నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటించిన చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకునిగా ఈ సినిమాను తెరకెక్కించారు. బన్నీ వాసు నిర్మాణంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను ప్రమోషనల్ కంటెంట్ ఇంకా పెంచింది. ఇక భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది మనం రివ్యూలో చూద్దాం పదండి.
తండేల్ కథ:
శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల మత్స్యకార గ్రామంలో పక్క పక్క ఇళ్లలోనే ఉండే రాజు(నాగ చైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమలో ఉంటారు. గుజరాత్ తీరానికి వెళ్లి వేటాడే బృందానికి తండేల్(లీడర్)గా వ్యవహరిస్తూ ఉంటాడు రాజు. ఊరిలో కొన్ని సంఘటనలు చూసి రాజుని ఇక వేటకు వెళ్ళకూడదు అని కోరుతుంది సత్య. అయితే మాట వినకుండా వెళ్ళాడని మరో పెళ్లికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో అతని రాకకు ఎదురుచూస్తుండగా పాక్ నేవీకి చిక్కి జైలు పాలైన సంగతి తెలుస్తుంది. అయితే తన ఊరి వారందరూ పడుతున్న ఇబ్బందిని గమనించి ఎలా అయినా సరే రాజు సహా ఇతర జాలర్లను భారత్ తీసుకు వచ్చేందుకు ఢిల్లీ వెళ్లి పోరాటం మొదలుపెడుతుంది. ఇలాంటి నేపథ్యంలో అసలు పాకిస్తాన్లో చిక్కుకున్న జాలర్లు తిరిగి వచ్చారా? రాజు సత్య ఏకమయ్యారా? లేక సత్య వేరే వివాహం చేసుకున్నదా ? అలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
2018- 19 కాలంలో జరిగిన రియల్ స్టోరీని సినిమాగా చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్లి అక్కడ పాకిస్తాన్ బోర్డర్లో నేవీకి చిక్కి జైలుకు వెళ్లారు. 16 నెలల జైలు శిక్ష అనంతరం వారి కుటుంబాల పోరాటం కారణంగా తిరిగి భారత్లో అడుగు పెట్టారు, ఇది లైన్. దానికి ఒక అందమైన ప్రేమ కథను అటాచ్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. రాజు- సత్య చిన్ననాటి నుంచి పక్కపక్క ఇళ్లలో పెరుగుతూ ఉండడంతో ఒకరంటే ఒకరికి విడిచి ఉండలేనంత ప్రేమ ఏర్పడుతుంది. ఈ క్రమంలో తన మాట వినకుండా వేటకు వెళ్లాడని రాజుని కాదని వేరే వివాహానికి కూడా సిద్ధమవుతుంది సత్య. అయినా సరే పాకిస్తాన్ జైల్లో చిక్కుకున్న రాజుని కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది? చివరికి ఎలా కాపాడుకుంది అనేది ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నిజానికి నిజ జీవితంలో రెండు మూడు జంటల మధ్య ఉన్న సంఘటనలను ఒకే జంటకు కలిపి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నిజ జీవిత ఘటనలను సినిమాటిక్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో చందు చూపించిన చొరవ అభినందనీయం. నిజానికి టీం చెప్పినట్టు అద్భుతమైన లవ్ స్టోరీ అని అనలైం కానీ ప్రేమికులందరూ కనెక్ట్ అయ్యేలా ఈ లవ్ స్టోరీని సిద్ధం చేసుకున్న తీరు బాగుంది. సినిమా ఓపెనింగ్ లోనే తనకు ఇక రాజు వద్దు, వివాహానికి సిద్ధమవుతాను అంటూ తన తండ్రికి సత్య క్యారెక్టర్ చెప్పే సీన్ తో ప్రారంభమై తర్వాత ఫస్ట్ ఆఫ్ అంతా వారి ప్రేమ ఎపిసోడ్ చూపించారు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లడం, అక్కడ జైలు జీవితం, జైలులో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఇలాంటి విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించడంలో టీం సక్సెస్ అయింది. అక్కడి జైలు నుంచి వచ్చేందుకు ఎన్ని నాటకీయ పరిణామాలు ఎదురయ్యాయి? ఆ వచ్చిన తర్వాత రాజు సత్యను కలిశాడా లేదా అనే విషయాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెర మీదకు తీసుకొచ్చారు. అయితే అందుకోసం విపరీతమైన సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు అనిపించింది. ఒకపక్క ఎమోషనల్ స్టోరీగా చూపిస్తూనే మరోపక్క సినిమాను మంచి దేశభక్తితో కూడిన అంశాలతో నింపడం అభినందనీయం. అయితే ఆర్టికల్ 370 రద్దు లాంటి అంశాలు ఉండడంతో దీనిని మరింత పబ్లిసిటీ నార్త్ లో చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో నాగచైతన్య నటనలో చాలా మెచ్యూరిటీ కనిపించింది. ముఖ్యంగా లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ అదరగొట్టాడు. అలాగే ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ లో కూడా చాలా ఈజ్ తో కనిపించడం గమనార్హం. నిజానికి సాయి పల్లవి పక్కన నటించడానికి హీరోలు ఒకానొక సందర్భంలో వెనకడుగు వేస్తున్న ప్రస్తుత ట్రెండ్ లో ఆమెను డామినేట్ చేసేలా కొన్ని సీన్స్ లో చైతన్య నటించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక సాయి పల్లవి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సరైన మెచ్యూరిటీ లేని ఒక సగటు ఆడపిల్లగా ఆమె ఆకట్టుకుంది. ఇక ఆడు కాలం నరేన్, కరుణాకరన్, రంగస్థలం మహేష్, వంటి వారు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అయితే హీరో హీరోయిన్లతో పాటు ఇతర నటీనటుల శ్రీకాకుళం యాస విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ గురించి. కొన్ని ఫ్రేమ్స్ తో పాటు చిన్న చిన్న మైన్యూట్ డీటైలింగ్స్ చాలా బాగున్నాయి. ఇక ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తంగాల పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి అందించిన సంగీతంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణాన్ని తీసుకొచ్చింది. ఎడిటింగ్ కూడా క్రిస్పీ గా ఉంది. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది సినిమా స్థాయికి తగ్గట్టుగా ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉండేలా చూసుకున్నారు.
ఫైనల్లీ తండేల్.. ఒక హత్తుకునే ఎమోషనల్ లవ్ స్టోరీ దాంతో పాటు దేశభక్తులకు మంచి ట్రీట్.