NTV Telugu Site icon

800 Review: 800 రివ్యూ

800 Movie Review

800 Movie Review

800 Movie Telugu Review: శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ అనౌన్స్ చేసినప్పటి నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. ముందుగా ముత్తయ్య మురళీధరన్ పాత్రని తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పోషించాలని అనుకున్నారు. దాదాపుగా ఆ మేరకు సినిమా ప్రకటన కూడా వచ్చింది. అయితే విజయ్ సేతుపతి నటించడం విషయం మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ముత్తయ్య మురళీధరన్ శ్రీలంకలో సెటిల్ అయిన తమిళ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ పాత్రను విజయ్ సేతుపతి పోషించే వ్యవహారం మీద పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వినిపించడంతో ఆ ప్రాజెక్టు నుంచి సేతుపతి తప్పుకున్నారు. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ మాధుర్ మిట్టల్ ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటించిన సినిమాను 800 పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తమిళ దర్శకుడు శ్రీపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అక్టోబర్ ఆరో తేదీన రిలీజ్ చేయబోతున్నారు. అయితే తెలుగు మీడియాకి మాత్రం రెండు రోజులు ముందుగానే ఈ సినిమాను సమర్పిస్తున్న శివలెంక కృష్ణ ప్రసాద్ స్పెషల్ ప్రీమియర్ షో వేయించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

800 సినిమా కథ:
ముందు చెప్పుకున్నట్టుగానే ఇది ఒక బయోపిక్. అంటే నిజజీవితంలో జరిగిన విషయాలనే సినిమాటిక్ గా రెండున్నర గంటల సమయంలో చూపించే ప్రయత్నం చేశారు. శ్రీలంకలో సెటిల్ అయిన ఒక తమిళ కుటుంబంలో పుట్టిన మురళీధరన్(మాధుర్ మిట్టల్) అనే వ్యక్తి శ్రీలంక తరపున క్రికెట్ ఆడి ఆ దేశానికి మంచి పేరు తీసుకురావడమే కాదు, ఎన్నో మ్యాచులలో ఆ దేశ జట్టును గెలిపించేలా చేశాడు. అంతేకాక తన పేరిట కొన్ని అరుదైన రికార్డులు కూడా నమోదు చేసుకున్నాడు. వాటిలోనే టెస్ట్ క్రికెట్ లో 800 వికెట్లు తీసిన ఘనత కూడా ఒకటి. ఆ ఎనిమిది వందల వికెట్లు తీసిన పాయింట్నే ప్రధాన కథాంశంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. అందుకుగాను మురళీ జననం ఆ తర్వాత క్రికెటర్ గా అతను రూపుదిద్దుకున్న వైనం, క్రికెటర్ గా మారిన తరువాత ఎదుర్కొన్న విమర్శలు, పడ్డ మానసిక వేదన, వంటి విషయాలను ఆసక్తికరంగా చూపిస్తూ ఎనిమిది వందల వికెట్ల మార్క్ అందుకునే విషయాన్ని హైలైట్ చేస్తూ సినిమాను ముగించారు. ఇలా కథ చదవడం కంటే సినిమా చూస్తున్నప్పుడే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది.

విశ్లేషణ:
చాలా మంది క్రికెట్ అభిమానులకు ముత్తయ్య మురళీధరన్ ఆటతీరు, అతని రికార్డుల గురించి తెలిసే ఉంటుంది. కానీ ముత్తయ్య మురళీధరన్ తన జీవితంలో సాధించిన అతి పెద్ద రికార్డుగా చెప్పుకునే టెస్ట్ క్రికెట్లో 800 వికెట్ల రికార్డును ఎలా సాధించాడు? అలా సాధించేందుకు అతను ఎన్ని కష్టాలు అనుభవించాడు? ఆ కష్టాలని గుణపాఠాలుగా మార్చుకుని ఎలా ఎదిగి పైకి వచ్చాడు? అనే విషయాలను ఈ సినిమాలో డిస్కస్ చేశారు డైరెక్టర్ శ్రీపతి. అసలు క్రికెట్ ఎలా మొదలైంది? ఆ క్రికెట్ శ్రీలంక వరకు ఎలా వచ్చింది? ఆ క్రికెట్ కోసమే తమిళనాడు నుంచి వచ్చిన ముత్తయ్య మురళీధరన్ కుటుంబం లో మురళీధరన్ కు ఆ క్రికెట్ మీద ఎలా ఆసక్తి కలిగింది ? వంటి విషయాలను చాలా సింపుల్ గా సుత్తి లేకుండా చూపించే ప్రయత్నం చేశారు. ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ సినిమాల ఫార్ములానే నమ్ముకుంటూ ముత్తయ్య మురళీధరన్ కథ మొత్తాన్ని సీనియర్ జర్నలిస్ట్ అయిన నాజర్ చేత నెరేట్ చేయిస్తూ సినిమా కథనం మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. మనం గమనిస్తే సినిమా మొత్తానికి మెయిన్ పాయింట్ ఎనిమిది వందల వికెట్లు, ఆ మార్క్ చేరుకోవడానికి జీవితంలో ఎన్ని కష్టాలను మురళీధరన్ అనుభవించాడు.

సొంత టీం నుంచే ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు? చివరికి తనని తాను ఎలా మలుచుకున్నాడు వంటి విషయాలను చూపించే ప్రయత్నం చేశారు. నిజానికి ఇలాంటి బయోపిక్ సినిమాలకు ఎమోషన్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్. అయితే మురళీధరన్ ఒక శ్రీలంక క్రికెటర్, మనవాళ్లకు అతని పేరు, అతని రికార్డులు తప్ప అతని పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా తక్కువ విషయాలు తెలుసు. గతంలో ధోని, కపిల్ దేవ్ లాంటి వాళ్ళ బయోపిక్స్ రిలీజ్ అయినప్పుడు కొంతవరకు వారి జీవితాలకు కనెక్ట్ అయ్యేందుకు వాళ్లతో మన ఇండియన్స్ కి ఉన్న బాండింగ్ ఉపయోగపడింది. ఆ కనెక్షన్ మిస్ కావడంతో ఈ సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విషయంలో కొంత తడబాటు ఏర్పడింది. సినిమాలో హీరో ఎవరు అనే విషయం తెలిసినా సరే అతను హీరోగా అద్భుతాలు సృష్టిస్తున్నట్లుగా కాకుండా నిజంగా ముత్తయ్య మురళీ జీవితంలో ఏం జరిగిందో ఆ విషయాలను సినిమాటిక్ గా కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉండేలా చూపించే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. అయితే అక్కడే కాస్త ఎమోషనల్ టచ్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ముత్తయ్య ఎనిమిది వందల మార్క్ అందుకున్న పాయింట్ ఆయనకు శ్రీలంక క్రికెట్ అభిమానులకు ఒక మంచి సెలబ్రేటింగ్ పాయింట్.

కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు అనే ఫీలింగ్ కలిగింది. అదేవిధంగా తమిళనాడుకు శ్రీలంక లోకల్స్ కి మధ్య జరిగిన యుద్ధాన్ని చాలా సెన్సిటివ్గా టచ్ చేశారు. అటు వారిని ఇటు వీరిని నొప్పించకుండా ఆ యుద్ధం వల్ల అప్పటి పరిస్థితుల వల్ల మురళీధరన్ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయి అనే విషయాన్ని మాత్రమే ప్రస్తావించారు. మురళీ ఎవరినీ ఎందుకు సపోర్ట్ చేయలేదు? అనే విషయాన్ని కూడా చూపించి ఇంట్రెస్ట్ కలిగించారు. మన ఇండియన్ క్రికెటర్ల బయోపిక్స్ లో సినిమాటిక్ టచ్ కోసం కాస్త ఎలివేషన్లు పెద్ద ఎత్తున వాడారు కానీ ఈ సినిమా విషయంలో అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఆయన నిజ జీవితంలో జరిగిన ఇబ్బందులను కష్టాలను మాత్రమే ప్రస్తావించే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. అయితే ముత్తయ్య మురళీధరన్ తో క్రికెట్ అభిమానులకు మాత్రమే పరిచయం ఎక్కువ. కాబట్టి తెలుగులో క్రికెట్ అభిమానులకు ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 90స్ క్రికెట్ అభిమానులు అయితే ఆద్యంతం ఎంజాయ్ చేసేలా ఉంది. అయితే తమిళ ఆడియన్స్ అందరికీ ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఎవరెలా చేశారంటే?

నటీనటుల విషయానికి వస్తే ముత్తయ్య మురళీధరన్ పాత్రలో మాధుర్ మిట్టల్ కొన్ని సీన్స్ లో సరిగ్గా సూట్ అవ్వలేదు ఏమో అనిపిస్తుంది. ముందుగా ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి అనే పేరు తెరమీదకు రాకుండా ఉండి ఉంటే మాధుర్ పెర్ఫార్మెన్స్ భలే ఉంది అనిపించేదేమో. కానీ ఇప్పుడు అదే పాత్రలో విజయ్ సేతుపతిని ఊహించుకుని మాధుర్ ను చూసినప్పుడల్లా ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఉన్నంతలో ముత్తయ్యను తెరమీద ఆవిష్కరించే ప్రయత్నంలో మాధుర్ తన 100% ఎఫర్ట్స్ అలా అలా ముత్తయ్య పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన భార్య మదిమలార్ పాత్రలో మహిమ నంబియార్ కనిపించింది రెండు మూడు సీన్లలో అయినా తన పాత్ర పరిధి మేరకు నటించి ఆకట్టుకుంది. నాజర్ పాత్రను చాలా సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేశారు. ఇక మిగతా పాత్రలలో నటించిన వారందరి పేర్లు తెలుగు వారికి పెద్దగా తెలియదు. తమిళ సినిమాల్లో కనిపించే నటీనటులు కొందరు మాత్రం కనిపించారు.

ముత్తయ్య మురళీధరన్ తండ్రి, బామ్మ, తల్లి పాత్రలలో తెలుగు వారికి కాస్త పరిచయం ఉన్న తమిళ నటులు కనిపించడం కొంత ఉపశమనం కలిగించే విషయం. మిగతా పాత్రధారులు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు కానీ ఆ ఫేసులు తెలుగువారికి రిజిష్టర్ అయినవి కాదు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే దర్శకుడిగా శ్రీపతి ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. దాదాపు చాలా సీన్స్ లో హీరో ఎలివేషన్స్ మీద ఫోకస్ పెట్టకుండా ముత్తయ్య మురళీధరన్ నిజజీవిత బాధల మీద, అతని స్ట్రగుల్ మీద ఫోకస్ పెట్టినట్లు అనిపించింది. జీవితంలో నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి సింహభాగం సమయం వెచ్చించాల్సి వస్తోంది అని ముత్తయ్య చేత ఒక డైలాగ్ చెప్పించాడు దర్శకుడు. ఆ డైలాగు విన్న తర్వాత నిజంగానే ముత్తయ్య మురళీధరన్ జీవితమంతా ఇంత కష్టాల మయంగా ఉండేదా అని అనిపించడమే కాక అతని జీవితం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని సగటు ప్రేక్షకుడికి ఆలోచన కలిగించే విషయంలో దర్శకుడు సఫలం అయ్యాడు.

ఇక సినిమాటోగ్రఫీ విషయంలో సినిమాటోగ్రాఫర్ ను మెచ్చుకొని తీరాల్సిందే. ఒకరకంగా ఇది బయోపిక్ సినిమా కావడంతో పీరియాడిక్ షార్ట్స్ కూడా తీయాల్సి వచ్చింది, వాటిని ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రియాలిటీకి దగ్గరగా క్యాప్చర్ చేయడంలో సఫలం అయ్యాడు. అయితే ఈ సినిమాలో సాంగ్స్ ఏమీ లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకులను కనెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడింది. ఎడిటింగ్ విషయంలో పెద్దగా కంప్లైంట్స్ ఏమీ లేవు కానీ స్క్రీన్ ప్లే విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఫైనల్గా చెప్పాలంటే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ క్రికెట్ లవర్స్ అందరికీ నచ్చుతుంది, ఒక హానెస్ట్ బయోపిక్.