Murder Mubarak Movie Review: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని తెలుగు తమిళ కన్నడ మలయాళం భాషలోనే కాదు బాలీవుడ్లో సైతం ఎన్నో సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి, వస్తూనే ఉంటాయి. ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మర్డర్ ముబారక్. స్టార్ హీరోయిన్ తమన్నా ప్రియుడు విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటించింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి ఏసిపి పాత్రలో నటించిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంది? ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూసి తెలుసుకుందాం
‘మర్డర్ ముబారక్’ సినిమా కథ:
ఢిల్లీలోని రాయల్ క్లబ్‌లో జరిగిన ఓ హత్యను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏసీపీ భవానీ సింగ్(పంకజ్ త్రిపాఠీ) రావడంతో కథ మొదలవుతుంది. ఈ క్లబ్ బాగా డబ్బున్న వ్యక్తుల కోసం బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేయబడిన క్లబ్.. రోజాతా ఇక్కడే సమయం వెచ్చించే వారు మొదలు రకరకాల ధనవంతులు ఈ క్లబ్ లో తమ తమ జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ క్లబ్‌లో ఇరవై రూపాయల టిప్పింగ్ కింగ్ రణవిజయ్ సింగ్ (సంజయ్ కపూర్), గాసిప్ ఆంటీ రోష్ని (టిస్కా చోప్రా), ఆమె డ్రగ్ అడిక్ట్ కొడుకు యష్ (సుహైల్ నాయర్), బి గ్రేడ్ సినిమా హీరోయిన్ షెహనాజ్ నూరానీ (కరిష్మా కపూర్), ఒక నాటీ శిల్ప కళాకారిణి కూకీ. ( డింపుల్ కపాడియా), వితంతువు బాంబి తోడి (సారా అలీ ఖాన్) అలాగే ఆమె ఎక్స్ ఆకాష్ డోగ్రా (విజయ్ వర్మ) ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటారు. క్లబ్‌లో దీపావళి పార్టీ జరుగుతోండగా జిమ్ ట్రైనర్ లియో మాథ్యూ (అషిమ్ గులాటి) జిమ్‌లో వ్యాయామం చేస్తూ హఠాత్తుగా మరణిస్తాడు. క్లబ్ ప్రెసిడెంట్ ఇదొక యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేయమంటే ఏసీపీ భవాని సింగ్ (పంకజ్ త్రిపాఠి) ఈ మరణం ప్రమాదవశాత్తు జరిగిందని, పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని భావిస్తాడు. పోలీసుల విచారణ సాగుతున్న కొద్దీ కోటీశ్వరుల జీవితాలకు సంబంధించిన అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్న క్రమంలో అసలు లియోని చంపింది ఎవరు? ఎందుకు అతన్ని చంపారు? అనే విషయాలను భవాని సింగ్ ఎలా ఛేదించాడు? ఇక ఈ క్లబ్ లో మెంబర్లుగా ఉన్న ఆకాష్ డోగ్రా(విజయ్ వర్మ), బంబి(సారా అలీ ఖాన్)లకి ఈ హత్యలతో ఏంటి సంబంధం? ఇతర ధనవంతులకు చెందిన ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ ‘మర్డర్ ముబారక్’ సినిమా కథ అనూజా చౌహాన్ రాసిన ‘క్లబ్ యు టు డెత్’ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. ‘అంగ్రేజీ మీడియం’ సినిమా తర్వాత, దర్శకుడు హోమీ అదాజానియా చేసిన ఈ ‘మర్డర్ ముబారక్’ థియేటర్లలో విడుదల కాలేదు కానీ నేరుగా OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. అలాగే హోమీ అదాజానియా వెబ్ సిరీస్ ‘సాస్ బహు ఔర్ ఫ్లెమింగో’ గత సంవత్సరం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం చేయబడింది. డైరెక్టర్ హోమీ అదాజానియా స్పెషాలిటీ ఏంటంటే.. అది సినిమా అయినా, సిరీస్ అయినా, అవి ఏ జానర్‌లో ఉన్నా.. ప్రేక్షకుల పల్స్‌ని బాగా అర్థం చేసుకుంటాడని చెప్పొచ్చు. ఇక ఈ థ్రిల్లర్ సినిమా ప్రత్యేకత కూడా అదే. ఏంటంటే జరిగిన ఒక హత్య ఎవరు చేశారో? చివరి వరకు ప్రేక్షకులకు అర్ధం కాకపోవడం. ఈ మిస్టరీని సినిమాలో పూర్తిగా మెయింటైన్ చేయడంలో హోమీ అడజానియా సక్సెస్ అయ్యాడు. ఈ తరహా మర్డర్ మిస్టరీ సినిమాలకు ఆసక్తే ప్రధానమైన సరుకు. దాన్ని డైరెక్టర్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాలో కూడా మర్డర్ మిస్టరీ పేరుతో సంపన్నుల మెరిసే జీవితం వెనుక ఉన్న డొల్లతనాన్ని వ్యంగ్యంగా చూపే ప్రయత్నం చేశారు. సినిమా ప్రారంభంలో పాత్రలని, చాలా ఆసక్తికరంగా ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే హోమీ చాలా పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. అయితే అక్కడ కొంచెం సాగతీసిన ఫీలింగ్ కలిగినా క్లైమాక్స్ వరకూ సస్పన్స్ మెయింటైన్ చేయడమే కాదు మధ్యలో కొన్ని షాకులు ఇస్తూ కథ నడిపాడు.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో చాలా మంది నటులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ పోతే సమయం చాలదు. అయితే ప్రధానంగా ఒక నలుగురి పాత్రల గురించి మాట్లాడుకుందాం. ముందుగా పంకజ్ త్రిపాఠి ACP పాత్రను తనదైన రీతిలో పోషించాడు. ఒక సెన్సిబిలిటీస్, నిజాయితీ ఉన్న పోలీసు అధికారిగా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇక సారా అలీ ఖాన్ నటన బాగుంది, ఆమె పాత్రకు కాస్త నెగటివ్ టచ్ ఇవ్వడం కొత్తగా అనిపించింది. విజయ్ వర్మకు తక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు కానీ ఉన్నంతలో అదరకొట్టాడు. కరిష్మా కపూర్ నటన కూడా అద్భుతంగా ఉంది. మహారాజా క్యారెక్టర్‌లో సంజయ్ కపూర్ సెట్ అయ్యాడు. ఓవరాల్‌గా యాక్టింగ్ పరంగా అందరు నటీనటులు బెస్ట్ ఇచ్చారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే సస్పెన్స్, థ్రిల్లర్, మర్డర్-మిస్టరీగా సినిమా ఆకట్టుకుంది కానీ కథ కొంత బలహీనంగా ఉంది. కేవలం ఒక హత్య ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అందరూ హంతకులుగా కనిపించేలా ఈ కథను అల్లడం కొంత ప్లస్. ‘మర్డర్ ముబారక్’ టైటిల్ జస్టిఫికేషన్ బాలేదు. సాంకేతిక అంశాల గురించి చెప్పాలంటే, లినేష్ దేశాయ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సచిన్ జిగర్ మ్యూజిక్ అందించిన యాద్ ఆవే పాట బాగుంది, అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల లౌడ్ అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో కేర్ తీసుకుని ఉండాల్సింది.
ఓవరాల్‌గా చెప్పాలంటే, ఒక మర్డర్ మిస్టరీ సినిమా చూడాలనుంటే ఈ వారం చూసేయచ్చు.. కొన్ని ఏ సర్టిఫికెట్ సీన్స్ ఉంటాయ్ జాగ్రత్త!