NTV Telugu Site icon

Mirzapur Season 3 Review: మీర్జాపూర్ – 3 ఎలా ఉందంటే..?

Mirzapur 3

Mirzapur 3

Mirzapur Season 3 Review: బాలీవుడ్ వెబ్ సీరిస్ లలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వెబ్ సీరిస్ మీర్జాపూర్ 3. మొదటి రెండు భాగాలు హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. భారీ అంచనాల మధ్య అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన ఈ సీరిస్ ఎలా ఉందో ప్రేక్షకులను మెప్పించిందో లేదో చూద్దాం..

కథ :
మీర్జాపూర్ 2లో కథ ఎక్కడ అయితే ముగిసిందో మీర్జాపూర్ – 3ని అక్కడి నుండే మొదలవుతుంది. తనకు కుడి భుజంలా వ్యవహరించే తన తమ్ముడు బబ్లూ, అతని భార్య స్వీటీని చంపిన మున్నాపై ప్రతీకారం తీర్చుకోవాలని గుడ్డు పండిట్ రగిలిపోతాడు. అదును చూసి మున్నా భయ్యా, అతని తండ్రి కాలిన్ భయ్యా(పంకజ్ త్రిపాఠి)లపై కాల్పులు జరుపుతాడు గుడ్డు. ఆ కాల్పుల్లో మున్నా భయ్యా మరణిస్తాడు. దీంతో కాలిన్ భయ్యా భార్య బీనా త్రిపాఠి సహకారంతో, గోలు సపోర్ట్ తో మీర్జాపూర్ డాన్ గా గుడ్డు పండిట్ అవతరిస్తాడు. కానీ మున్నా భార్య మాధురి యాదవ్(ఇషా తల్వార్) ఉత్తర్ ప్రదేశ్ కి సీఎంగా అక్కడ క్రైమ్ లేకుండా చేయాలని డిసైడ్ అవుతుంది. గుడ్డు పండిట్ నయా డాన్ గా మారడాన్ని అక్కడ ఉన్న కొందరు గ్యాంగ్ స్టర్స్ వ్యతిరేకిస్తారు. గుడ్డు షూట్ చేశాక కాలిన్ ఏమయ్యాడు? మీర్జాపూర్ గద్దెను కూల్చేయాలని ముఖ్యమంత్రి మాధురి (ఇషా తల్వార్) లక్ష్యం నెరవేరిందా? కాలిన్ భయ్యా తిరిగొచ్చాడా లేదా? మాధురి, గుడ్డులలో ఎవరు నిలిచారు..?ఇవన్నీ తెలియాలంటే ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ ని చూడాల్సిందే….

విశ్లేషణ
మొదటి రెండు భాగాలు సూపర్ హిట్ అవడంతో మూడవ భాగం ఎప్పుడు వస్తుందా అని హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎదురు చూశారు. సీక్వెల్ అనగానే ఆడియన్స్ లో ఒక విధమైన అంచనాలు ఉండటం కామన్. మీర్జాపూర్ హిట్ అవడానికి ప్రధాన కారణం రక్తపాతం, మున్నా భయ్యా అడల్ట్ సంబాషణలు, డార్క్ హ్యూమర్. ఈ సిరీస్ లో మున్నా భయ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. కానీ మీర్జాపూర్ సింహాసనం కోసం ఒకరిపై ఒకరు ఎత్తులకు పైఎత్తులు ఇంప్రెస్ చేశాయి. అక్కడక్కడ వచ్చే కొన్ని ట్విస్ట్ లు మెప్పిస్తాయి. ఈ సీజన్ ఫైనల్ మూడు ఎపిసోడ్ లు మాత్రం ఫుల్ ఫీస్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఆఖరి ఎపిసోడ్ చివరి అరగంట చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో మంచి రేసీ స్క్రీన్ ప్లే తో అదరగొడుతుంది. మొదటి రెండు సీజన్లలో హింస, అడల్ట్ కంటెంట్ కాస్త ఎక్కువే. కానీ సీజన్ -3 లో హ్యూమర్ తగ్గించి డ్రామా ఎక్కువ నడిపాడు. ఆ క్రమంలో లెంగ్త్ పెంచుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. ప్రతి ఎపిసోడ్ సుమారు 50 నిమిషాలు ఉంటుంది, రన్ టైమ్ కోసం సీన్లు సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. అక్కడక్కడ కొంచెం బోరింగ్ ఫీలింగ్ కలుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతోందినని క్యూరియాసిటీని ప్రేక్షకుడికి కలగజేయడంలో దర్శకుడు తడబడ్డాడు. స్క్రీన్ ప్లే ప్రేక్షకుడు ముందే పసిగట్టే విధంగా సాగుతుంది. ఎంటర్టైన్మెంట్ కొంచెం పెంచి అనవసరమయిన సీన్లు లేపేస్తే బాగుండేది.

నటీనటుల ప్రదర్శన;
గుడ్డు పాత్రలో అలీ ఫజల్ సూపర్ పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు . మొత్తం సిరీస్‌ను తన భుజస్కందాలపై మోస్తూ వన్ మ్యాన్ షో చేసాడు. శ్వేతా త్రిపాఠి, అంజుమ్ శర్మ సైతం తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బీనా త్రిపాఠి పాత్ర మేరకు నటించి మెప్పించింది. రసికా దుగల్ తన క్యారెక్టర్ కు మరోసారి ప్రాణం పోసింది. సీఎం పాత్రలో నటించిన ఇషా తల్వార్ నటన బాగుంది. విజయ్ వర్మ అద్భుతమైన నటనతో సిరీస్ ఆసాంతం ఆకట్టుకున్నారు. పంకజ్ త్రిపాఠి కనిపించేది కొన్ని సన్నివేశాలు అయినా సరే తన మార్క్ నటన డైలాగ్ డెలివరీతో అలరించాడు. విఎఫ్ఎక్స్ బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంతకు వాటి లాగే బాగుంది.

తీర్పు :
మొదటి భాగం అంచనాలను అందుకోవడంలో మీర్జాపూర్ -2 సక్సెస్ అయింది. కానీ మీర్జాపూర్ -2 అంచనాలను రీచ్ అవడంలో ఈ పార్ట్ -3 కొంచెం వెనకబడిందనే చెప్పాలి. అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ కొడుతూ ఓ సారి చూడొచ్చు.