Malaikottai Vaaliban Review: ప్రముఖ మలయాళ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో జల్లికట్టు లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాల దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరి తెరకెక్కించిన ‘మలైకోటై వాలిబన్’. మలయాళంలో జనవరి 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తెలుగు సహా ఇతర భాషలలో సైతం రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఎందుకో చేయలేదు. ఇక ఈ సినిమా ఇప్పుడు ‘డిస్నీ+ హాట్‌స్టార్’ ఓటీటీ వేదికగా తెలుగు సహా మిగిలిన నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
మలైకోటై వాలిబన్ కథ:
ఇది స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథ. కేరళలోని మలైకోటై అనే ప్రాంతానికి చెందిన మల్లయోధుడైన వాలిబన్ (మోహన్‌లాల్) తన గురువు అయ్యన్నార్(హరీష్ పేరడి), సోదరుడు చిన్నయ్యప్ప(మనోజ్ మోసెస్) తో కలిసి గ్రామాలు సంచరిస్తూ ఉంటాడు. ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి మల్లయోధులను మట్టికరిపించి ఎంతోమందిని శత్రువులుగా చేసుకుంటూ ఉంటాడు. అలాంటి అతను చిన్నప్పుడే మల్లయోధులను మట్టికరిపించిన మలైకోటై సంస్థానానికి వెళ్తాడు. అక్కడ ఆంగ్లేయుల చెరలో బందీలుగా ఉన్న వారికి వాలిబన్ విముక్తి కలిగించడానికి ప్రయత్నిస్తాడు. ఇక అతను వారికి విముక్తి కలిగించాడా? వాలిబన్ మలైకోటై వాలిబన్‌గా ఎలా మారాడు? ప్రాణం కన్నా ఎక్కువగా భావించే సోదరుడికి ఏమైంది? గురువుగా భావించే అయ్యన్నార్ ఎందుకు వాలిబన్ మీద యుద్ధం ప్రకటించాడు. గురు శిష్యుల యుద్ధం దేనికి దారితీసింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
మోహన్ లాల్ లిజో జోస్ పెల్లిస్సేరి కాంబో సినిమా అనగానే మలయాళ ప్రేక్షకులు మాత్రమే కాదు తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను ఈ సినిమా పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా మొదలైనప్పటి నుంచే ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో విఫలం అయింది. శత్రువు కొడుకుని తన దగ్గర తనకు రక్షణగా మార్చుకుని చివరిలో అతనితోనే గొడవపడే కథతో ఎన్నోసినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అలంటి కథతోనే వస్తుంది. నిజానికి ఇలాంటి పాయింట్ మన ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కానీ, చూపించే విధానమైనా విభిన్నంగా ఉంటే సినిమా కనెక్ట్ అయ్యేది. నిజానికి అసలు కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లేందుకు దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. కథలోకి వెళ్ళాక కూడా ఎందుకో కనెక్ట్ అయ్యేలా చేయడంతో విఫలం అయ్యాడు. ఫస్టాఫ్ మొత్తం వాలిబన్ ఊరూరు తిరగుతూ బోర్ కొట్టిస్తాడు. దానికి తోడు కథతో సంబంధం లేని కొన్ని పాత్రలు తెరపైకి వస్తూ వెళ్తున్నా, ఏవీ గుర్తుపెట్టుకునేలా లేకపోవడం మైనస్. తాను పుట్టిపెరిగిన సంస్థానాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్ వారితో వాలిబన్ ఫైట్ మొదలైనప్పటి నుంచి కొంచెం కథలో వేగం అందుకున్నట్టు అనిపించినా మళ్ళీ ఆ తరువాత కథ అక్కడి నుంచి మరో ప్రాంతానికి షిఫ్ట్ అవుతుంది. తమ్ముడి మరణం, గురువు అనుమానంతో వాలిబన్ నేపథ్యం రివీల్ అయ్యాక వచ్చే ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో సీక్వెల్ తీసుకురానున్నట్లు వెల్లడించారు. అయితే రెండు భాగాలుగా సినిమా చేయాలనీ ఈ మొదటి సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలిగింది. ఇదేమీ కొత్త కథ కాదు ఈ క్రమంలో స్క్రీన్‌ప్లే బలంగా ఉండేలా చూసుకోవాలి కానీ అక్కడే తేడా పడింది.
నటీనటుల విషయానికి వస్తే సినిమా మొత్తం మీద వాలిబన్ పాత్రే ఎక్కువ కనిపిస్తుంది. ఒకరకంగా ఇది మోహన్ లాల్ వన్ మ్యాన్ షో. వాలిబన్ పాత్రలో ఆయన సరిగ్గా సూట్ అయ్యాడు. ఇక తమ్ముడిగా మనోజ్, అతని భార్యగా కథా నంది సరిగా సెట్ అయ్యారు. ఇక వాలిబన్ గురువుగా హరీశ్ పేరడికి మంచి పాత్ర పడింది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ప్రశాంత్ పిళ్లై అందించిన మ్యూజిక్ ఫర్వాలేదు. మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ బాగుంది కానీ కొన్ని షాట్స్ కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నాయి. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆ లొకేషన్స్ ను వెతికి షూట్ చేసే ఓపిక ఉండడం గొప్ప విషయం.
ఫైనల్ గా: వా……లిబన్ ను చూడాలంటే చాలా సహనం ఉండాలి.