NTV Telugu Site icon

Maidaan Movie Review: మైదాన్ (హిందీ) రివ్యూ

Maidaan Trailer

Maidaan Trailer

Maidaan Movie Review & Rating in Telugu : స్పోర్ట్స్ డ్రామా సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. గతంలో ‘చక్ దే ఇండియా’ (హాకీ), ​​’భాగ్ మిల్కా భాగ్’ (రేసింగ్), ‘మేరీ కోమ్’ (బాక్సింగ్), ‘దంగల్’ (కుస్తీ), ‘పంగా’ (కబడ్డీ) వంటి సినిమాలు కూడా అదే కోవలో వచ్చాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు బాగానే ఆడితే కొన్ని సినిమాలకు మాత్రం ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక ఇప్పుడు దర్శకుడు అమిత్ శర్మ భారతదేశపు లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ సినిమా తెరకెక్కించాడు. దానికి మైదాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది ఇక ఈ సినిమాని ఈద్ సందర్భంగా ఏప్రిల్ పదవ తేదీ అంటే రేపు రిలీజ్ చేయబోతున్నారు కానీ రెండు రోజుల ముందే మీడియాకి స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రహీంగా అజయ్ దేవగన్ నటన ఎలా ఉంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం

‘మైదాన్’ కథ:
హైదరాబాద్ కి చెందిన భారత ఫుట్‌బాల్ జట్టు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగన్) 1950లలో ఫుట్‌బాల్ అసోసియేషన్‌లోని తన ప్రత్యర్థులను వెనక్కి నెట్టి ఒక కొత్త ఫుట్‌బాల్ జట్టును రెడీ చేస్తాడు. ఆటలో విజయం సాధించడానికి భారతదేశంలోని అన్ని మూలలకి వెళ్లి ఫుట్‌బాల్ ఆటగాళ్లను ఎంపిక చేస్తాడు. నిజానికి, 1952లో, భారత ఫుట్‌బాల్ జట్టు ఒలింపిక్స్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో రహీమ్ కొత్త స్ట్రాటజీతో కొత్త జట్టుతో సిద్ధం అవుతాడు. రహీమ్‌కు భార్య సైరా (ప్రియమణి), కుమారుడు హకీమ్, కుమార్తె – తల్లి ఉన్నా అతని ధ్యాస మాత్రం ఎప్పుడూ ఫుట్బాల్ మీదే ఉంటుంది. ఇక అలా 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో, ఈ టీం వెళ్లి నాలుగో స్థానంలో నిలుస్తుంది. 1960లో రోమ్ ఒలింపిక్స్‌లో జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ, ఫైనల్స్ అర్హత సాధించలేకపోయారు. ఈ క్రమంలో రహీమ్ ని అతని ప్రత్యర్థులు, ఒక ఫేమస్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ రాయ్ (గజరాజ్ రావు) రాజకీయాలకు బలిపశువును చేసి కోచ్ పదవి నుండి తొలగిస్తారు. ఆతరువాత ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తెలియగా ఇంటికి పరిమితం అవుతాడు. ఈ ప్రాణాపాయ పరిస్థితుల్లో రహీమ్ భార్య సైరా మళ్లీ కోచింగ్ చెప్పేందుకు వెళ్లేలా మోటివేట్ చేస్తుంది. ఈసారి రహీమ్ తన ప్రాణాలను పణంగా పెట్టి 1962లో జకార్తా ఆసియా క్రీడల్లో ఫైనల్స్‌లో దక్షిణ కొరియాను ఓడించి దేశానికి బంగారు మెడల్ సాధించడంతో సినిమా ముగుస్తుంది.

విశ్లేషణ:
హైదరాబాద్ కి చెందిన ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్రను చిత్రీకరిస్తూ రహీమ్ ను కీర్తించలేదు అలా అని మెలోడ్రామాటిక్‌గా సినిమా చేయలేదు. సినిమా ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ ని, కథని ఎస్టాబ్లిష్ చేయడంలో టైమ్ స్పెండ్ చేసినా సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్ట్ పెరిగి చివరి 20 నిమిషాల్లో ప్రేక్షకుడికి రెప్ప వేయడం కూడా మరచిపోయేలా చేశాడు. థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు మూడు గంటల సినిమా ఏమంటుంది అనే ఆలోచనతోనే లోపలికి ప్రేక్షకుడి వెళతాడు కానీ ఫస్టాఫ్ అదే ఫీలింగ్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలవుతుందో ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి పెరుగుతుంది. కొన్ని సన్నివేశాలు ఫ్లాట్‌గా కనిపించినా దర్శకుడు రహీమ్ యొక్క వినూత్నమైన ఆట పద్ధతులు, వ్యూహాలు – విప్లవాత్మక విధానాన్ని చూపించిన తీరు ఆసక్తికరం. హిస్టారికల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లను థ్రిల్లర్ స్టైల్‌లో స్క్రీన్‌పై చూపిస్తూ ముందుకు తీసుకు వెళ్ళాడు. తుషార్ కాంతి రే, ఫ్యోదర్ లియాస్ సినిమాటోగ్రఫీని మెచ్చుకోకుండా ఉండలేం. 1950-60ల నాటి కోల్‌కతాను చాలా అందంగా చూపారు. సినిమాకి నమ్మశక్యంగా అనిపించేలా దర్శకుడు రియల్ ఫుటేజీని కూడా చాలా చోట్ల నప్పేలా ఉపయోగించారు. కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్ కూడా ది బెస్ట్ వర్క్ ఇచ్చినట్లే చెప్పాలి. అప్పటి కాలాన్ని తెరమీద చూపించడానికి VFX కూడా బాగా ఉపయోగించబడింది. ఎఆర్ రెహమాన్ అందించిన సంగీతం కథను మరింత ఎలివేట్ చేసింది. నాలుగుసార్లు జాతీయ అవార్డు గ్రహీత అజయ్ దేవగన్ ఈసారి కూడా సయ్యద్ అబ్దుల్ రహీమ్‌గా మరో జాతీయ అవార్డు సాధిస్తాడేమో అనేలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ప్రశాంతంగా, సంయమనంతో, గౌరవప్రదమైన పాత్రలో తన అద్భుతమైన నటనతో చాలా సన్నివేశాల్లో కళ్ళతోనే నటిస్తూ ఆకట్టుకున్నాడు. సైరాగా ప్రియమణి తన పాత్రను చాలా అందంగా ఎగ్జిక్యూట్ చేసింది. గజరాజ్ రావు ఈ సినిమాకి మరొక అసెట్. సినిమాలో చాలా మంది కొత్త వారు నటించగా అందరూ బాగా నటించారు. చున్నీ గోస్వామిగా అమర్త్య రే, పీకే బెనర్జీగా చైతన్య శర్మ, పీటర్ తంగరాజ్‌గా తేజస్ రవిశంకర్, జర్నైల్ సింగ్‌గా దేవీందర్ సింగ్, తులసీదాస్ బలరామ్‌గా సుశాంత్ వేదాండే, ఎస్‌ఎస్ హకీమ్‌గా రిషబ్ జోషి, రామ్ బహదూర్ పాత్రలో అమన్‌దీప్ ఠాకూర్ అద్భుతంగా నటించారు. ఇక బోనీ కపూర్, జీ స్టూడియోస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ: స్పోర్ట్స్ డ్రామా సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది అంతేకాదు. అసలు ఫుట్బాల్ అంటే ఏమిటో అవగాహన లేని వారిని కూడా సినిమా కుర్చీలకి అతుక్కుపోయేలా చేస్తుంది.