NTV Telugu Site icon

Love Reddy Movie Review: లవ్ రెడ్డి రివ్యూ

Love Reddy

Love Reddy

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో వినిపించిన పెద్ద పేరు లవ్ రెడ్డి. టైటిల్ తోనే ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడేలా చేసిన ఈ సినిమాని తెలంగాణలోని చేర్యాలకు చెందిన స్మరణ్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. అంజన్ రామచంద్ర హీరోగా శ్రావణి రెడ్డి హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమాని గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ వస్తున్నారు మేకర్లు. ఎస్కేఎన్ ట్రైలర్ లాంచ్ చేయడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కిరణ్ అబ్బవరం రావడంతో పాటు టీజర్, ట్రైలర్ కట్స్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

లవ్ రెడ్డి కథ:
ఆంధ్ర కర్ణాటక బోర్డర్‌ గ్రామంలో నివాసం ఉండే నారాయణరెడ్డి(అంజన్ రామచంద్ర)కు 30 ఏళ్లు వచ్చినా పెళ్లి కాక పెళ్లి చూపుల కోసం తిరుగుతూ ఉంటాడు. తనకు సరైన అమ్మాయి దొరికితే తప్ప పెళ్లి చేసుకోను అని భీష్మించుకుని కూర్చున్న అతన్ని సోదరుడు నీవల్లే నా పెళ్లి కావడం లేదని ఒకసారి గొడవ పెట్టుకుంటాడు. ఇలా సాగుతున్న సమయంలో అనుకోకుండా బస్సులో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి మొదటి చూపులోనే నారాయణరెడ్డి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఒక పెళ్లి చూపులకు వెళ్లి అక్కడ దివ్య ఉందనుకుని భ్రమ పడి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కానీ అక్కడ ఉన్నది వేరే అమ్మాయని అదంతా తన భ్రమ అని తెలిసి ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాడు. ఆ తరువాత దివ్యతో పరిచయం ఏర్పడుతుంది. దివ్యతో మాట్లాడుతున్న సమయంలో దివ్య తనను ప్రేమిస్తుంది అనుకుని నారాయణరెడ్డి ఫిక్స్ అవుతాడు. అయితే దివ్య ఎంగేజ్మెంట్ చేసుకుందనే విషయం తెలిసి షాక్ అవుతాడు. వెంటనే దివ్యకు తన ప్రేమ వ్యక్తం చేయడానికి వెళ్ళినప్పుడు దివ్య ఊహించని షాకిస్తుంది. అసలు నారాయణరెడ్డి దివ్య ఒకటి అవుతారా? దివ్యకు పెళ్లి చేసేందుకు ఆమె తండ్రి ఎందుకు తాపత్రయపడతాడు? దివ్యను పెళ్లి చేసుకుంటానని నారాయణరెడ్డి చెప్పినప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు? చివరికి దివ్య, నారాయణరెడ్డి కలుస్తారా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
తెలుగు సినిమాలలో లవ్ స్టోరీస్ అనేది నెవర్ ఎండింగ్ జానర్. ప్రేమను గొప్పగా చూపించిన సినిమాలు కొన్ని అయితే పరమ చెత్తగా చూపించిన సినిమాలు కొన్ని. వాటిని మన ప్రేక్షకులు ఆదరించారు, ఆదరిస్తూనే ఉన్నారు, వీటిని కూడా మన ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ప్రేమలో మరో కొత్త యాంగిల్ ని చూపించేందుకు చేసిన ప్రయత్నమే లవ్ రెడ్డి. సినిమా మొదట్లోనే హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. తనకు మనసుకు నచ్చే అమ్మాయి దొరికే వరకు ఎన్ని పెళ్లి సంబంధాలైనా చూస్తూనే ఉంటాను తప్ప ఎవరిని ఓకే చేయను అని భావించే హీరో సరైన అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. అలాంటి అమ్మాయి దొరికిన తరువాత ఆమెతో పరిచయం, ఆ తర్వాత ఆమె మాటల్లోనే తన మీద ప్రేమ ఉందని ఫీలయ్యే క్రమం వన్ సైడ్ లవర్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా రాసుకున్నాడు డైరెక్టర్. ఆ తర్వాత ఆమె గురించి కుటుంబ సభ్యులందరూ తాపత్రయపడటం లాంటివి కొంత కనెక్షన్ మిస్ అయినా సరే 30 ఏళ్లు పైబడిన తర్వాత ఇంకా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన కొడుకు కోసం ఆ కుటుంబం పడే తాపత్రయం మాత్రం కొంత కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. అయితే హీరోయిన్ మరో పేరుతో పెళ్లికి ఒప్పుకోవడం, అసలు ప్రపోజ్ కూడా చేయకుండానే ఆమె తనను ప్రేమిస్తుందని భావనలోనే హీరో ఉండిపోవడం లాంటివి కాస్త భిన్నంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపోజ్ చేసి, ప్రేమలో ఉన్న అమ్మాయే మనకోసం వెయిట్ చేస్తుందో చేయదో తెలియదు. అలాంటిది ఆమెలో తనకు ప్రేమ కనబడింది కాబట్టి తనను ప్రేమిస్తుంది, తన కోసమే వెయిట్ చేస్తుందని హీరో వెయిట్ చేయడం కాస్త లాజిక్స్ కి దూరం అనిపించినా ప్రేమలో లాజిక్స్ కి చోటు ఎక్కడిది అని సరి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఊహించని క్లైమాక్స్ తో ప్రేక్షకుల మనసులను తడిమి బయటకు పంపిస్తాడు డైరెక్టర్. నిజానికి ఇలాంటి క్లైమాక్స్ తెలుగు సినిమాలలో ఆశించడం, ఊహించడం రెండూ కష్టమే. అయినా తాను చెప్పాలనుకున్న కథను నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ స్మరణ్ రెడ్డి. దానికి ఆయనను అభినందించవచ్చు. కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే సినిమా మాత్రం కాస్త భిన్నంగా పొయటిగ్గా అనిపిస్తుంది.. ముఖ్యంగా లొకేషన్లు చాలా కొత్తగా అనిపిస్తాయి. అయితే సినిమా స్లాంగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్లాంగ్ అర్థం చేసుకోవడం అందరి వల్ల కాదు. ఆంధ్ర కర్ణాటక బోర్డర్ లో ఉన్న భాష కేవలం అక్కడి వారికి మాత్రమే పరిమితం. దీన్ని రాయలసీమకు గాని లేదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేపథ్యాన్ని గాని ఎంచుకొని ఉంటే మరింత ఎక్కువ మందికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉండేవి.. అయితే డైరెక్టర్ ఎంచుకున్న నేపథ్యం కాస్త కొత్తగా ఉంది. అలాగే నటీనటులు దాదాపుగా అందరూ కొత్తవారే కావడం కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతలో కొంత రిజిస్టర్డ్ యాక్టర్స్ ఉంటే ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతారు. అయినా సరే ఈ సినిమాలోని నటీనటులు తమ స్థాయికి మించే నటించినట్లు అనిపించింది. ఎందుకంటే ఎవరికి వారు ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

నటీనట్ల విషయానికి వస్తే అంజన్ రామచంద్రకి తెలుగులో హీరోగా ఇది మొదటి సినిమానే అయినా ఒక సగటు కుర్రాడి పాత్రలో జీవించాడు. ఈరోజుల్లో ఎవరికి వారే హీరో. అదే పాయింట్ను హీరో ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. దానికి హీరో కూడా చాలా సహకరించినట్టే అనిపించింది. శ్రావణి రెడ్డి ఈ ఇందులో దివ్య పాత్రకు సరిగ్గా నప్పింది. ఆమె ఒక హీరోయిన్ లా కాకుండా పక్కింటి అమ్మాయిలా, మనం రోజు బస్ స్టాప్ లో లేదా మన నిజ జీవితంలో ఎక్కడో ఒకచోట ఎదురుపడే అమ్మాయిలాగా కనిపించడమే కాదు అభినయంతో కట్టిపడేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడుతాయి. ఇక సినిమా మొత్తం మీద మరొక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ హీరోయిన్ తండ్రి. కన్నడలో పలు సినిమాలు చేసిన ఆయన ఈ పాత్రతో ఒక్కసారిగా అబ్బా కమల్ హాసన్ అని థియేటర్లలో అనిపించుకోకుండా ఉండడు. మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్ర పరిధి మేరకు నటించారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రాణం పోసింది సంగీతం. సిద్ శ్రీరామ్ పాడిన పాటలు కానీ ఇతర పాటలు కానీ ఏదో ఇరికించినట్టు కాకుండా కరెక్ట్ గా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. లొకేషన్స్ విషయంలో కూడా సినిమాకి మంచి మార్కులు పడతాయి. మనకి అలవాటైన లొకేషన్స్ కాకుండా కొత్త లోకేషన్లో సినిమా చేశారు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాకి మంచి రిక్నెస్ తీసుకొచ్చింది. సినిమా నిడివి కూడా కరెక్ట్ గా కట్ చేయడంలో ఎడిటర్ తన వంతు పాత్ర పోషించాడు. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఫైనల్లీ లవ్ రెడ్డి.. లవ్ లో ఉన్న వారందరి గుండెలను టచ్ చేస్తాడు.. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్స్ కి విపరీతంగా కనెక్ట్ అవుతాడు.