NTV Telugu Site icon

Love Mocktail 2 Review: లవ్ మాక్ టైల్ 2 రివ్యూ

Love Mocktail 2

Love Mocktail 2

Love Mocktail 2 Review: ఇతర భాషలలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసే విషయం ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఇతర భాషల్లో సూపర్ హిట్లుగా నిలిచిన సినిమాలను తెలుగులోకి తీసుకువస్తూ ఉన్నారు మేకర్స్. తాజాగా అలాంటి ఒక సినిమాని ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన లవ్ మాక్ టైల్ 2 అనే సినిమాని ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. డార్లింగ్ కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా కన్నడ నాట సూపర్ హిట్ అయింది. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం

లవ్ మాక్ టైల్ 2 కథ:
ఈ సినిమా మాక్ టైల్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది. కథ కూడా కంటిన్యూషన్ అనే చెప్పాలి. విజయ్ అకా విజ్జు (అబిలాష్) మరియు సుష్మ (కుషి ఆచార్) తప్పిపోయిన తమ స్నేహితుడైన ఆది(డార్లింగ్ కృష్ణ) కోసం వెతకడంతో ప్రారంభమవుతుంది. ఆది భార్య నిధి (మెలినా నాగరాజ్) చనిపోతుంది. అయితే ఎప్పుడూ భార్య ఆలోచనలతోనే సతమతం అయ్యే ఆది ఎలా అయినా ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలని అరకు వెళతాడు. అలా వెళుతున్న క్రమంలో తన భార్య తనతోనే ఉందని ఊహించుకుని ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే అతన్ని కొంతమంది ఇష్టపడుతూ వెంటపడినా సరే భార్య ఉందని వారిని పట్టించుకోడు అయితే ఒక లేఖ తన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఈ క్రమంలో అతని లైఫ్ లోకి జంకీ (సుష్మిత గౌడ), సిహి (రాచెల్ డేవిడ్)లు ఎంట్రీ ఇస్తారు. ఈ క్రమంలో ఆది తన భార్యను మర్చిపోయాడా? ఆది మరో వివాహం చేసుకున్నాడా? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా మొత్తం బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ: ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ గా వస్తున్న సినిమాల విషయంలో కథ కొన్నింటిలో కంటిన్యూ అవుతుంటే కొన్నింటిలో అవ్వడం లేదు. ఈ సినిమాలో కొంత కంటిన్యూ చేస్తూనే మరి కొంత కొత్త కథనాన్ని జొప్పించే ప్రయత్నం చేశారు. మొదటి సినిమాతో సంబంధం లేకుండానే రెండో సినిమాలో చాలా భాగాలు కొత్తగా అతికించినట్లు మనకు అనిపిస్తుంది. అయితే రెండో భాగంలో కొత్త కొత్త పాత్రలు ఎంట్రీ ఇచ్చినా వాటిని వాడుకున్న విధానం మాత్రం ఆకట్టుకునే విధంగా ఉందనే చెప్పాలి. కొన్ని సీన్స్ ఎమోషనల్ గా మరికొన్ని సీన్స్ కామెడీగా ప్రేక్షకులను హత్తుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.

నటీనటుల విషయానికొస్తే డార్లింగ్ కృష్ణ తానే దర్శకుడిగా నిర్మాతగా ఈ సినిమా చేశాడు. అలాగే ఈ సినిమాలో హీరోగా కూడా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అయితే కృష్ణ అద్భుతంగా నటించాడు అని చెప్పాలి. ఇక నిధి పాత్రలో నటించిన మెలినా నాగరాజు నటన కూడా చాలా బాగుంది. ఇక రేచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్, అమృత అయ్యంగార్, సుష్మిత గౌడ, అభిలాష్ సహా మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే మొదటి భాగంలోనే మ్యూజిక్ గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. సినిమాకి సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన అసెట్ అనే చెప్పాలి. ఈ సినిమాని ఎన్విఆర్ కృష్ణ తెలుగు ప్రేక్షకుల ముందుకు డబ్బింగ్ చేసి తీసుకొచ్చారు. అయితే డబ్బింగ్ సినిమాల కాకుండా మంచి స్ట్రైట్ తెలుగు ఫిలిం అనిపించేలా డబ్బింగ్ టీం పని చేసిందని చెప్పొచ్చు.

ఫైనల్ గా లవ్ మాక్ టైల్ టు నవ్విస్తూనే హృదయాన్ని కదిలించే ఓ ప్రయాణం

Show comments