ఇటీవల రాజేంద్రప్రసాద్ కుమార్తె అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణించిన కొన్ని రోజులకే రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించిన లగ్గం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కూడా రాజేంద్రప్రసాద్ హీరోయిన్ తండ్రిగా నటించగా పెళ్లి చుట్టూనే కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. సాయి రోనక్, ప్రగ్యా నగర హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రోహిణి సహా పలువురు సీనియర్ నటులు కీలక పాత్రలలో కనిపించారు. ప్రమోషనల్ కంటెంట్తో సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూ లో చూద్దాం.
లగ్గం కథ:
ఊరిలో వ్యవసాయం చేసుకునే సదానందం(రాజేంద్రప్రసాద్) ఒక పని మీద హైదరాబాద్ వస్తాడు. తన చెల్లెలు(రోహిణి) కొడుకైన చైతన్య(సాయి రోనక్)ను చూద్దామని అతని నివాసానికి వెళ్తాడు. అక్కడ అతను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని నెలకు రెండు లక్షల జీతం వస్తుందని తెలుసుకుంటాడు. వెంటనే తన కుమార్తె మానస(ప్రగ్యా నగారా)తో చైతన్యకు వివాహం జరిపించాలని భావించి చెల్లెలికి చెబితే అందుకు ఆమె కూడా సరే అంటుంది. ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి నిశ్చయించిన తర్వాత అనుకోకుండా చైతన్య ఉద్యోగం పోతుంది. అయితే తాను తన కుటుంబంతో కలిసి ఊరిలోనే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతానని చైతన్య కూడా ఊరికి వచ్చేస్తాడు. అయితే ఉద్యోగం పోయిన విషయం రాజేంద్రప్రసాద్ కి చైతన్య కుటుంబం చెప్పక ముందే మరొకరి ద్వారా తెలుస్తుంది. తనను మోసం చేయాలనుకున్నాడనే ఉద్దేశంతో ఈ పెళ్లి ఆపడానికి రాజేంద్రప్రసాద్ ఒక ప్లాన్ చేస్తాడు. అయితే రాజేంద్రప్రసాద్ ప్లాన్ ప్రకారం పెళ్లి చెడగొట్టడానికి డీజే(చమ్మక్ చంద్ర-చిత్రం శ్రీను) గ్యాంగ్ ప్రయత్నిస్తున్న సమయంలో చైతన్య కావాలని పెళ్లి చెడగొడతాడు. అయితే చైతన్య ఎందుకు పెళ్లి చెడగొట్టాలి అనుకున్నాడు? మానస పెళ్లి విషయంలో తండ్రి మాట విన్నదా? చివరికి చైతన్య, మానస పెళ్లి జరిగిందా? అసలు సదానందం సాఫ్ట్వేర్ వ్యక్తినే అల్లుడిగా ఎందుకు తీసుకురావాలి అనుకున్నాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సింది.
విశ్లేషణ
టైటిల్ సూచించినట్లుగా ఈ లగ్గం సినిమా కూడా హీరో హీరోయిన్ల పెళ్లి చుట్టూ తిరుగుతుంది. వ్యవసాయం చేసుకునే తండ్రే తన కుమార్తెను తనలాగా వ్యవసాయం చేసుకునే వాడికి కాకుండా సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాడికి మాత్రమే ఇచ్చి పెళ్లి చేస్తానని ఫీలింగ్లో బతికేస్తూ ఉంటాడు. దానికి తోడు తన అల్లుడే అలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడనే విషయం తెలిసి అతనితోనే పెళ్లి చేయడానికి సిద్ధమవుతాడు. అయితే అప్పటికే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసి ఆమెకానికల్ లైఫ్ కి అలవాటు పడిపోయి విరక్తి కలిగిన సదరు హీరో దాని నుంచి దూరంగా తన తల్లిదండ్రులకు దగ్గరగా ఉండేందుకు సిద్ధమవుతాడు. దానికి ఉద్యోగం పోయిందేమో అనే ఉద్దేశంతో పెళ్లి కూడా క్యాన్సిల్ చేసేందుకు సిద్ధమవుతాడు సదరు తండ్రి. నిజానికి ఇదంతా సినిమా కథలా కాకుండా నిజజీవిత సంఘటనలు ఆధారంగా చేసుకుని చేసిన సినిమా ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో నెలకు 10 లక్షలు సంపాదించే వ్యాపారస్తుడి కంటే నెలకు లక్ష లక్షన్నర సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముద్దు అన్నట్లుగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అలాంటివారిని ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశారేమో అనిపిస్తుంది. సినిమా మొదటి నుంచి తాను చెప్పాలనుకున్న పాయింట్ సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ రమేష్ చెప్పాల. అయితే అదే కాస్త కథ స్పీడ్ అయిన ఫీలింగ్ కలిగేలా చేసింది. అయినా సరే ఇంటర్వెల్ సమయానికి పెళ్లి జరుగుతుందా జరగదా అనే ఒక అనుమానాన్ని రేకెత్తించి ఇంటర్వెల్ తర్వాత అసలు పెళ్లి చెడగొట్టడానికి కారణం ఏంటి? తర్వాత వాళ్లు మళ్ళీ కలిశారా లేదా లాంటి విషయాలను ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే నిజానికి ఈ సినిమా పెళ్లి కాక ఇబ్బందులు పడే అందరికీ కనెక్ట్ అయ్యే ఒక సబ్జెక్టు కానీ ఎక్కడో ఒక ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ దాన్ని కామెడీతో కవర్ చేసే ప్రయత్నం చేశారు కొంతవరకు అది ఫలించింది కూడా. కానీ ఒక ఎమోషనల్ కనెక్ట్ గనక ఏర్పడి ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి తోడు రాజేంద్రప్రసాద్ బలవంతంగా తెలంగాణ యాస పలుకుతున్న వ్యవహారం కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తల్లిదండ్రులే బలవంతంగా తయారు చేస్తున్నారు, మళ్ళీ వాళ్లే తమకు అనారోగ్యంగా ఉన్నప్పుడు రాలేదని నిందలు వేస్తున్నారు అనే ఒక పాయింట్ని గట్టిగా డిస్కస్ చేశాడు డైరెక్టర్. నిజానికి ఈ సినిమాలో సాఫ్ట్వేర్ అల్లుడే కావాలని పట్టుబట్టే తల్లిదండ్రులను బిడ్డలను కష్టపడి అమెరికాలో పంపించి ఇప్పుడు అక్కడ స్థిరపడిపోయాడు ఇక్కడికి రావడం లేదు అని కంప్లైంట్ చేసే తల్లిదండ్రులను ప్రశ్నించినట్లే అనిపించింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఆ ఊబిలో నుంచి బయటకు రాలేక అక్కడ ఉండలేక పడుతున్న ఇబ్బందులు కళ్ళకు కట్టినట్టు చూపించాడు.
నటీనటుల విషయానికి వస్తే సాఫ్ట్వేర్ అల్లుడిగా సాయి రోనాక్ కరెక్ట్ గా సెట్ అయ్యాడు. ఒకపక్క క్యూట్ గా కనిపిస్తూనే మరోపక్క నటనతో కూడా ఆకట్టుకున్నాడు. ప్రగ్యా నగరాకి ఎందుకో లుక్కు సెట్ అయినట్లు అనిపించలేదు కానీ నటన విషయంలో మాత్రం ఆమెకు వంక పెట్టలేము. ఇక రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో నిజమైన తండ్రిగా జీవించాడేమో అన్నట్లుగా రెచ్చిపోయారు. అయితే ఆయన యాస విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. ఇక రోహిణి గురించి చెప్పాల్సిందేముంది ఆమె తన అనుభవంతో తనదైన శైలిలో నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో సంగీతం, నేపథ్య సంగీతం ప్లస్ పాయింట్స్. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా ఆహ్లాదకరంగా సినిమా మొత్తాన్ని నడిపించింది. ఎడిటింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాతలు పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద చాలా అందంగా కనిపించింది.
ఫైనల్లీ ఈ లగ్గం సరదా సరదాగా సాగిపోతూ, ప్రశ్నిస్తూ ఆలోచింప చేస్తుంది.