NTV Telugu Site icon

Konda Movie Review : కొండా రివ్యూ

Kondaa

Kondaa Review

 

ఈ మధ్య తెలుగులోనూ బయోపిక్స్ ఎక్కువై పోయాయి. ఈ యేడాది ప్రారంభంలో దిశ హత్యోదాంతంతో ‘ఆశ’ చిత్రం వచ్చింది. మొన్న సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా ‘మేజర్’ రూపుదిద్దుకుంది. ఇక లాస్ట్ వీక్ ఉద్యమకారిణి సరళ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘విరాటపర్వం’ వచ్చింది. ఇప్పుడు నక్సలైట్లతో మమేకమై, ఉద్యమ జీవితాన్ని గడిపిన కొండా దంపతులు మురళీ, సురేఖ జీవిత ప్రథమాంకం ‘కొండా’ గా విడుదలైంది.

అమాయకులకు న్యాయం చేయడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని వ్యక్తిగా కొండా మురళీని కొందరు కొలుస్తారు. చదువుకునే రోజుల్లోనే సురేఖను కొండా మురళీ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. తనను తాను కాపాడుకోవడం కోసం మురళీ తన మిత్రుడు ఆర్కే సాయంతో కొంతకాలం నక్సలైట్ గా జీవితాన్ని గడిపారు. అనివార్యంగా ఉద్యమం నుండి బయటకు వచ్చి పోలీసులకు లొంగిపోయారు. ఆ తర్వాత మురళీ రాజకీయ ప్రయాణం మొదలెట్టారు. కానీ అప్పటికే తన మీద ఉన్న పోలీస్ కేసుల కారణంగా భార్య సురేఖతో పొలిటికల్ అరంగేట్రమ్ చేయించారు. కొంతకాలం తెలుగుదేశం నీడలోనూ, ఆ తర్వాత కాంగ్రెస్ లోనూ ఉన్న మురళీ రాజకీయ జీవితం రాజశేఖర రెడ్డి మరణానంతరం ఊహించని మలుపులు తిరిగింది. కానీ ‘కొండా’ సినిమా సురేఖ తన రాజకీయ వారసురాలుగా మురళీ ప్రకటించడంతో ముగిసింది.

కొండా మురళిలోని ఆవేశం, ఆగ్రహం, పేదల పట్ల అతనికి ఉన్న కన్సర్న్ ను తెలియచేసే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. కాలేజీలో చదువుకునే సమయంలో సురేఖతో ప్రేమలో పడి పెళ్ళి చేసుకోవడం, నక్సలైట్స్ తో అయిన పరిచయంతో అడవి బాట పట్టడం, తెలుగుదేశం పార్టీ నేతను నమ్మి మోసపోవడం, పోలీసులకు లొంగిపోయి ప్రజా రాజకీయాలలోకి రావడమే ఈ చిత్రం. నిజానికి కొండా మురళీ, సురేఖ జీవితం చాలా విస్తృతమైంది. వాటి లోతులకు పోకుండా పై పైనే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా చుట్టేశారు. దాంతో ఏ ఎమోషన్ కూడా పండలేదు. ఇక రాజకీయ శత్రుత్వంతో 1992లో దాడికి గురైన మురళీ చావుతప్పి కన్నులొట్టపోయి హాస్పిటల్ లో చేరతారు. శరీరంలోకి బోలెడన్ని బుల్లెట్లు దూసుకుపోతాయి. ఆ సమయంలో మురళీ హాస్పిటల్ లో పోలీసులతో భీకర పోరాటం చేసి బయటకు రావడాన్ని మరీ కామెడీగా తీశారు. నక్సలైట్లతో మురళీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఉద్యమం నుండి బయటకు వచ్చినా వారి సానుభూతి పరుడుగానే ఉన్నారు. అయితే ఆ సన్నివేశాల కంటే కూడా నక్సలిజాన్ని గ్లోరిఫై చేసే సీన్స్ కు, పోలీసుల మీద నక్సలైట్లు సానుభూతితో పాడే పాటకు వర్మ ప్రాధాన్యమిచ్చారు. ఇది మురళీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను పక్కన పెట్టి కాలహరణం చేయడం తప్ప మరొకటి కాదు. ఇవాళ్టి ప్రేక్షకులలో నక్సలిజం పట్ల ఎలాంటి సానుభూతి లేదు… వారి చర్యలను సమర్థించే మనుష్యులూ లేరు. అలాంటి వారు ఉండి ఉంటే ఆర్. నారాయణమూర్తి సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకాదరణ పొందేవి. ఆ నిజం గ్రహించకుండా వర్మ ‘కొండా’ సినిమాలో ఆ అంశాలకు అనవసరమైన ప్రాధాన్యమిచ్చారు. ఎర్ర చిత్రాలలో గతంలో వచ్చిన రెండు పాపులర్ సాంగ్స్ ను ఇందులో వాడుకున్నారు కానీ వాటి వల్ల ఉపయోగం లేకపోయింది.

నటీనటుల విషయానికి వస్తే… కొండా మురళి పాత్రను అదిత్ అరుణ్ బాగానే చేశాడు. అలానే ఇర్రా మోర్ సురేఖ పాత్రను చక్కగా పోషించింది. వీళ్ళిద్దరూ ఆ పాత్రల స్వభావాన్ని తెలియచేయాలని అనుకున్నారు వారి బాడీ లాంగ్వేజ్ ను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయలేదు. అది బాగుంది. కొండా తల్లిదండ్రుల పాత్రలను పోషించిన తులసీ, ఎల్బీ శ్రీరామ్ చక్కని నటులే అయినా తెలంగాణ యాసను పలకడంలో కష్టపడుతున్న విషయం తెరమీద తెలిసిపోతోంది. తెలుగుదేశం నేతగా పృథ్వీరాజ్, నక్సలైట్ ఆర్కేగా ప్రశాంత్ కార్తీ, పోలీస్ అధికారి పాత్రల్లో అభిలాష్ చౌదరి, శ్రవణ్‌ నటించారు. కొండా స్నేహితుడు పాత్రలో ఆటో రామ్ ప్రసాద్ మెప్పించాడు. మల్హర్ జోషి సినిమాటోగ్రఫీ, డి.ఎస్.ఆర్. నేపథ్య సంగీతం బాగున్నాయి. లిమిటెడ్ ఆడియెన్స్ కు మాత్రమే నచ్చే చిత్రం కావడంతో లిమిటెడ్ బడ్జెట్ లోనే దీనిని తీసిన విషయం అర్థమైపోతోంది. ఈ సినిమాకు కొండా దంపతుల కుమార్తె సుస్మితా పటేల్ ప్రొడ్యూసర్.

తమ వారి కథను, తామే చిత్రంగా నిర్మించినప్పుడు అందులో సహజంగానే పాజిటివ్ అంశాలే ఉంటాయనే విమర్శ ఉంటుంది. ఈ సినిమా విషయంలోనూ అలాంటి విమర్శలు వచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా కొండా దంపతుల మీద అభిమానం ఉన్న వారికి ఈ సినిమా నచ్చుతుందేమో కానీ జనరల్ ఫిల్మ్ గోయర్ కు నచ్చే అంశాలు ఇందులో పెద్దగా లేవు.

 

ప్లస్ పాయింట్స్
కొండా బయోపిక్ కావడం
డీఎస్ఆర్ నేపథ్య సంగీతం
సినిమా నిడివి

మైనెస్ పాయింట్స్
పండని ఎమోషనల్ సీన్స్
బలహీనమైన స్క్రీన్ ప్లే
పేలవమైన ముగింపు

ట్యాగ్ లైన్: కొండా…. కొందరికే!