కళ్యాణ్ దేవ్ నటించిన ‘సూపర్ మచ్చి’ మూవీ ఈ యేడాది సంక్రాంతి సీజన్ లో థియేటర్లలో విడుదలైంది. బట్ ఎలాంటి ఇంపాక్ట్ చూపలేకపోయింది. దాంతో అదే సమయంలో రిలీజ్ కావాల్సిన అతని మరో సినిమా ‘కిన్నెరసాని’ వాయిదా పడి, శుక్రవారం నుండి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘అశ్వద్థామ’ ఫేమ్ రమణ తేజ దర్శకత్వంలో రజనీ తాళ్లూరి, రవి చింతల ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.
వెంకట్ (కళ్యాణ్ దేవ్) ఓ లాయర్. వేద (కాషిష్ ఖాన్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్న టైమ్ లో ఆమె హత్యకు గురౌతుంది. అకారణంగా తన ప్రియురాలిని హత్య చేసిన వారిపై వెంకట్ పగ తీర్చుకోవాలనుకుంటాడు. సీరియల్ కిల్లర్ జయదేవ్ (రవీంద్ర విజయ్) వేద అనే పేరున్న అమ్మాయిలను చంపుకుంటూ పోతున్నాడనే విషయం తెలుస్తుంది. అతన్ని పట్టుకునే క్రమంలో అసలైన వేద (అన్ శీతల్)ను వెంకట్ కలుస్తాడు. తన ప్రియరాలిని చంపిన హంతకుడి కోసం వెంకట్, తనను చంపాలనుకుంటున్న తండ్రి కోసం వేద వెతకడం మొదలుపెడతారు. అసలు జయదేవ్ ఎవరు? తన కూతురు వయసుండే వేద అనే అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు? ఇటు వేద, అటు వెంకట్ లక్ష్యమైన జయదేవ్ వాళ్ళకు చిక్కాడా? లేదా? అనేది మిగతా కథ.
‘కిన్నెరసాని’ అనే టైటిల్ చూసి, ఇదో సాఫ్ట్ లవ్ స్టోరీ అనుకునే ఆస్కారం ఉంది. అయితే సినిమా షూటింగ్ ప్రారంభం నుండి అందుకు భిన్నమైన ప్రచారాన్నే దర్శక నిర్మాతలు చేశారు. ఇంటెన్సిటీ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ గా మూవీని ప్రమోట్ చేశారు. కళ్యాణ్ దేవ్ కాస్తంత భిన్నమైన పాత్రలో కనబడతాడనే భావనా కలిగించారు. దానికి తోడు ‘ది ఫ్యామిలీమ్యాన్’ ఫేమ్ రవీంద్ర విజయ్ ఇందులో నటించడంతో సమ్ థింగ్ స్పెషల్ గా ఈ మూవీ ఉంటుందనే అభిప్రాయం సాధారణ ప్రేక్షకుడికి కలిగింది. అయితే ఈ భిన్నమైన కథను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ‘కిన్నెర’ చుట్టూ తిరగాల్సిన కథను కాసేపు హీరో చుట్టూ, మరికాసేపు విలన్ చుట్టూ, ఇంకొంతసేపు అతని కూతురు చుట్టూ తిప్పేశాడు. దాంతో ఈ టైటిల్ కు జస్టిఫికేషన్ లభించలేదు. టైటిల్ రోల్ పోషించానని మహతి బిక్షు చెప్పుకోవాలే కానీ ఆమె సెంటర్ పాయింట్ గా మూవీ సాగలేదు. ఇక ఎదుటి వారి కళ్ళలోకి కొన్ని క్షణాలు చూసి వారి మనసులో ఏముందో తెలుసుకునే రేర్ క్వాలిటీ ఉన్న వేదను పాత్రను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఆ చిత్రమైన లక్షణం కారణంగా ఆమె బాల్యం ఛిద్రమవడం చూపిన దర్శకుడు ఆ పాయింట్ కు తర్వాత అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం చిత్రంగా అనిపిస్తుంది. ‘కల్కి’ ఫేమ్ దేశరాజు సాయితేజ్ ఈ సినిమాకు కథ, మాటలు, కథనం అందించారు. దాంతో రమణ తేజ ఈ కథను ఓన్ చేసుకోలేకపోయారేమో అనిపిస్తోంది.
కళ్యాణ్ దేవ్ నటనలో ఏమంత గొప్ప ఇంప్రువైజేషన్ కనిపించలేదు. మలయాళ చిత్రం ‘ఇష్క్’ ఫేమ్ అన్ సీతల్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె కానీ, హీరో లవర్ గా నటించిన కాషిష్ ఖాన్ గానీ గొప్ప నటన ఏమీ ప్రదర్శించలేదు. ఈ మధ్య మలయాళ రీమేక్ ‘ఇష్క్’లోనూ; ‘మిషన్ ఇంపాజిబుల్’ లోనూ రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించాడు. ఇందులో విలన్ గా నటించాడు. ఆ రెండు సినిమాలతో పోల్చితే అతని తెలుగు డబ్బింగ్ ఇందులో కాస్తంత బెటర్ గా ఉంది. ఇతర పాత్రలలో భానుచందర్, షాన్ సాల్మన్, శ్రియా త్యాగి, సత్యప్రకాశ్ తదితరులు కనిపిస్తారు. అన్బరివ్ స్టంట్స్ సహజంగా ఉన్నాయి. దినేశ్ కె బాబు సినిమాటోగ్రఫీ, మహతి స్వర సాగర్ నేపథ్య సంగీతం బాగున్నాయి. సినిమా నిడివి తక్కువ ఉండటం ఓ ప్లస్ పాయింట్. బట్ ఆ రెండు గంటల పదినిమిషాల సేపు కూడా వీక్షకులకు కట్టిపడేసే సన్నివేశాలు ఏవీ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. ఓటీటీలో ఉంది కాబట్టి టైమ్ పాస్ కోసం ఓసారి చూడొచ్చు.
రేటింగ్: 2.25 / 5
ప్లస్ పాయింట్స్
ప్రొడక్షన్ వాల్యూస్
మహతి స్వరసాగర్ రీరికార్డింగ్
దినేశ్ బాబు సినిమాటోగ్రఫీ
సినిమా నిడివి
మైనెస్ పాయింట్స్
మెప్పించని నటీనటుల నటన
ఆసక్తికలిగించని కథనం
ట్యాగ్ లైన్: మెప్పించని థ్రిల్లర్!