Karimnagar’s Most Wanted Aha Series Review: ఈమధ్య కాలంలో లోకల్ కంటెంట్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. బలగం, దసరా, పలాస లాంటి సినిమాలు హిట్ టాక్ అందుకున్న క్రమంలో లోకల్ సినిమాలు, కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్నారు. ‘బలగం’తో రచయితగా పేరు తెచ్చుకున్న రమేష్ ఎలిగేటి ఇప్పుడు ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చారు. ‘బలగం’ సినిమా ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా కాగా ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ వెబ్ సిరీస్ మాత్రం తెలంగాణ నేటివిటీతో కూడిన మాఫియా డ్రామా. దీనికి బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించగా సాయి సూరేపల్లి, అమన్ సూరేపల్లి, అనిరుద్ టి, గోపాల్ ఎం ప్రధాన పాత్రలు పోషించారు. ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది, మరి ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:
గని (సాయి సూరేపల్లి) కరీంనగర్ పట్టణంలో పని పాట లేకుండా ఉండే మన పక్కింటి కుర్రాడి మనస్తత్వం కలిగిన వ్యక్తి. తన తమ్ముడు టింకు (అమన్ సూరేపల్లి), ఫ్రెండ్స్ బిట్టు (అనిరుద్ ఎం) , సత్తి (గోపాల్ మాదారం)తో కలిసి ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటాడు. కానీ వ్యాపారానికి డబ్బులు లేక, బ్యాంకులో అప్పు దొరక్క లోన్ రికవరీ ఏజెంట్లవుతారు. అయితే దానికంటే త్వరగా డబ్బు సంపాదించడం ఈజీ అని భావించి రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాలని కొంత డబ్బు పోగేసుకుంటారు. అప్పుడు 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటనతో స్థలం కొనడం కోసం అందరూ కలిసి పోగు చేసుకున్న 30 లక్షల నోట్లు మార్చడానికి తంటాలు మొదలవుతాయి. అనూహ్యంగా చనిపోయిన వారి ఆధార్, ఐడీ కార్డులు ఉపయోగించి బ్యాంక్ అకౌంట్స్ తెరిచి నోట్లు మార్చుకున్నామని అనుకునే లోపే ఏవ్ అకౌంట్స్ నుంచి మరో ఐదు కోట్ల రూపాయల నోట్లు కూడా మారతాయి. ఇక ఆ కేసులో గని అండ్ కో అరెస్ట్ అవుతారు. అయితే వీరికి తెలియకుండా ఆ ఐదు కోట్లు మార్చింది ఎవరు? ఈ కేసుకు ఎమ్మెల్యే పురోషోత్తం (శ్రీవర్ధన్)కు ఉన్న సంబంధం ఏమిటి? నోట్లు మార్చిన బ్యాంకు మేనేజర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? చివరికి ఏమైంది అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ: మనిషి మహానుభావులు అవ్వాలన్నా మోస్ట్ వాంటెడ్ అవ్వాలన్నా యవ్వనమే టర్నింగ్ పాయింట్. ఆ పాయింట్ మనిషి జీవితాన్ని అంతా డిసైడ్ చేస్తుందనే విషయాన్ని సూటిగా చెబుతూ ఒక పక్క మెసేజ్ ఇస్తూ మరోపక్క కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కించిన సిరీస్ ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’. ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’కు బలగం ఫేమ్ రమేష్ ఎలిగేటి రైటర్ అయినప్పటికీ ‘బలగం’ సినిమాకి ఈ సిరీస్ కి కామన్ పాయింట్ తెలంగాణ నేటివిటి. కొత్త ఆర్టిస్టులు, పరిమితమైన టీంతో బాలాజీ భువనగిరి ఒక మంచి సిరీస్ తీసే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యారు. కమర్షియల్ టచ్ మిస్ అవకుండా మెసేజ్ ఇచ్చే ప్రయతనం బాగుంది. ఆర్టిస్టులు కొత్తవాళ్లు అయినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి నేటివిటీకి తగ్గట్టు నటన రాబట్టుకున్నారు. కరీంనగర్ వారంతా హ్యాపీగా ఫీల్ అయ్యేకా అందంగా తెరపై చూపించారు. మనిషి సెల్ఫిష్ నెస్ హైలైట్ చేస్తూనే రాజకీయ నాయకుల లోపాయికారీ పనులు అన్నీ చూపించారు. సిరీస్ మొదటిలో ఇంట్రాయి క్యారెక్టర్లు అన్నట్టు కొంత కన్ఫ్యూజ్ అయ్యేలా ఉన్నా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అయితే వెబ్ సిరీస్ లెంగ్త్ ఎక్కువగా ఉండడంతో పాటు, ఎక్కువ క్యారెక్టర్లలో మనకి తెల్సిన ముఖాలు లేకపోవడం సిరీస్ కి మైనస్.
ఎవరెలా చేశారంటే? నటీనటుల విషయానికి వస్తే తెలంగాణ కుర్రాడిగా సాయి సూరేపల్లి, గని క్యారెక్టర్లో బాగా నటించాడు. ప్రతి సన్నివేశంలోనూ సహజంగా నటించాడు. మాఫియూగా మారి కరీంనగర్ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదిగిన క్రమంలో అతని నటనలో, ఆహార్యంలో చేంజ్ ఓవర్ భలే ఉంది. ఇక అమన్, అనిరుద్, గోపాల్ కూడా కరెక్ట్ గా సెట్ అయ్యారు. ఎమ్మెల్యేగా నటించిన శ్రీవర్ధన్, మిగతా ఆర్టిస్టులు చాలామంది కొత్త వాళ్ళు అయినప్పటికీ అనుభవం ఉన్నవారిలానే తమ పరిధి మేరకు నటించారు. కెమెరా వర్క్, మ్యూజిక్ ఫర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. అయితే ప్రొడక్షన్ వేల్యూస్ మాత్రం బాగున్నాయి.
ఫైనల్గా : తెలంగాణ నేటివిటీ నుంచి వచ్చిన ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ సిరీస్ ఈ నేటివిటీ సిరీస్ లు లేని లోటు తీరుస్తుంది.