NTV Telugu Site icon

Kalapuram Movie Review : కళాపురం రివ్యూ

Kalapuram

Kalapuram

 

‘పలాస 1978’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాలతో తెలుగులో దర్శకుడిగా తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కరుణ కుమార్. అంతే కాదు… ఈ మధ్యలో ఆర్టిస్టుగానూ పలు చిత్రాలలో కనిపిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో జీ స్టూడియోస్ సహకారంతో రజనీ తాళ్ళూరి నిర్మించిన సినిమా ‘కళాపురం’. ఇక్కడ అందరూ కళాకారులే అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం జనం ముందుకు వచ్చింది.

కుమార్ (‘సత్యం’ రాజేశ్‌) దర్శకుడు కావాలని కలలు కంటూ ఉంటాడు. వచ్చిన అవకాశాలు చేజారిపోతున్న సమయంలో అప్పారావు (నిరంజన్) అనే నిర్మాత అతనితో సినిమా తీయడానికి అంగీకరిస్తాడు. అయితే తన సొంతూరు కళాపురంలో అందరూ కళాకారులే అని, అక్కడ కొంత భాగం షూటింగ్ తప్పనిసరిగా జరపాలనే నిబంధన పెడతాడు. అందుకు అంగీకరించి తన స్నేహితుడు ప్రవీణ్ (ప్రవీణ్ యండమూరి)తో కలిసి కుమార్ ఆ వూరు చేరిన తర్వాత కథ ఊహించని మలుపు తిరుగుతుంది. నిర్మాత అప్పారావు గాయబ్ కావడంతో ఊరిలోని పెద్దలు, కళాకారుల సహకారంతో కుమార్ సినిమా పూర్తి చేస్తాడు. అయితే… అందరినీ తానే డైరెక్ట్ చేశానని భ్రమపడుతున్న తనను వేరే ఒకరు డైరెక్ట్ చేశారని, తనకు తెలియకుండా తానే ఓ పాత్రగా మారిపోయాననే విషయం అతనికి ఆలస్యంగా తెలుస్తుంది. తెర వెనుక ఉండి కుమార్ ను నడిపింది ఎవరు? కళాపురంలోనే సినిమాను తీయాలనే నిబంధన ఎందుకు పెట్టారు? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే!

దర్శకుడు కరుణ కుమార్ ఇప్పటి వరకూ తీసిన రెండు సినిమాలు సామాజిక అంశాల నేపథ్యంలో తెరకెక్కినవి. కానీ దీన్ని వాటికి భిన్నంగా పొలిటికల్ సెటైరిక్ మూవీగా ఆయన తీశారు. సినిమా నేపథ్యంలో ఈ సినిమా తీసినా, రాజకీయ క్రీడలో ఓ మూవీ డైరెక్టర్ ఎలా పావుగా మారాడన్నది మెయిన్ పాయింట్. చిత్రం ఏమంటే మూవీ ప్రారంభం నుండి ఒక పద్ధతిలో సాగదు. అవకాశాల కోసం కుమార్ ప్రయత్నించడం, ఈజీ మనీ సంపాదించిన అప్పారావు ప్రొడ్యూసర్ అయిపోవడం, కళాపురం వెళ్ళి గ్రామీణుల సహకారంతో సినిమాను చుట్టేయడం… ఆ తర్వాత తన సినిమానే తనకే నచ్చక డైరెక్టర్ డీలా పడటం.. ఈ లోపు ఊహించని ట్విస్ట్ ఒకటి!! థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడు ఏ ఒక్క సన్నివేశంతోనూ కనెక్ట్ కాలేదు. ఎందులోనూ లాజిక్ అనేది కనిపించదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ నియోజకవర్గంలోని పోలీసులను కంట్రోల్ చేయలేక… ఇంత డ్రామా ఆడించిందనే పాయింటే చాలా పేలవంగా ఉంది. సరదాగా కొన్ని సన్నివేశాలను రాసుకుని, దానికి కాస్తంత పొలిటికల్ టచ్ ఇవ్వాలనే దర్శకుడి ఆలోచన బాగానే ఉన్నా, పండాల్సిన కామెడీ ఇందులో పండలేదు. క్యారెక్టరైజేషన్స్ చాలా పేలవంగా ఉన్నాయి. ‘పలస, శ్రీదేవి సోడాసెంటర్’ మూవీ తీసింది ఈయనేనా అనే సందేహమూ వస్తుంది. దర్శకుడిగా తనకున్న ఇమేజ్ ను మార్చుకోవాలని కరుణ కుమార్ పడిన తాపత్రయం తెర మీద కనిపిస్తోంది. బట్.. అందులో సఫలం కాలేదు.

‘సత్యం’ రాజేశ్‌ కామెడీకి దూరంగా కాస్తంత భిన్నమైన పాత్రలు చేయాలని ఈ మధ్య ప్రయత్నిస్తున్నాడు. ఇది అలాంటి పాత్రే. అతని నటన సెటిల్డ్ గా ఉంది. హీరో స్నేహితుడిగా ప్రవీణ్‌ యండమూరి, హీరోయిన్ గా సంచిత చక్కగా నటించారు. కాశీమా రఫీ, జనార్దన్, ‘చిత్రం’ శ్రీను, ప్రతాప్ రుద్ర, కుమార్, సనా, ఆంటోనీ, కరుణ కుమార్ తదితరులు పాత్రోచితంగా చేశారు. తన మొదటి రెండు సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్స్ పెట్టిన కరుణ కుమార్ ఇందులోనూ అదే బాటలో అనసూయ చౌదరి మీద ఓ సాంగ్ పెట్టేశాడు. కరుణ కుమార్ గత రెండు చిత్రాలు మ్యూజికల్ హిట్స్. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. ప్రసాద్ సినిమాటోగ్రఫీ, మణిశర్మ ఆర్.ఆర్. ఓకే! ‘కళాపురం’ ట్రైలర్ చూసి ఆ మధ్య వచ్చిన ‘సినిమా బండి’ లాంటి గ్రామీణ నేపథ్య చిత్రాన్ని చూస్తామని ఆశపడిన వారికి నిరాశే ఎదురవుతుంది. మొత్తం మీద ఇదో కలగాపులగం సినిమా! ఇలాంటి మూవీస్ ను థియేటర్లలో కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తే బెటర్!

రేటింగ్: 2 / 5

ప్లస్ పాయింట్స్
సినిమా మీద సినిమా కావడం
సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్
క్లయిమాక్స్ ట్విస్ట్

మైనెస్ పాయింట్స్
పేలవమైన కథ
ఆసక్తి కలిగించని కథనం

ట్యాగ్ లైన్: కలగాపులగం!