NTV Telugu Site icon

Just A Minute Review: జస్ట్ ఎ మినిట్ రివ్యూ

Just A Minute Review

Just A Minute Review

Just A Minute Movie Review: ఏడు చేపల కథ సినిమాతో గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత ఒక ప్రెస్ మీట్ లో బోల్డ్ గా మాట్లాడి వైరల్ అయిన అభిషేక్ పచ్చిపాల మరో బోల్డ్ కామెడీ ‘జస్ట్ ఎ మినిట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిషేక్ హీరోగా నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా, రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ మూవీ మేకర్స్ బ్యానర్ పై కార్తీక్ ధర్మపురి, తన్వీర్, ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా ‘జస్ట్ ఎ మినిట్’ సినిమా తెరకెక్కింది. యశ్వంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 19న థియేటర్స్ లో రిలీజయింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఈ సినిమా ఆకట్టుకుంది? అనేది మనం రివ్యూలో చూద్దాం.

‘జస్ట్ ఎ మినిట్’ కథ:
రవి(అభిషేక్‌ పచ్చిపాల) సరదాగా తిరిగే కుర్రాడు. అయితే ఓ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అది బయటకు చెప్పుకోలేని సమస్య కావడంతో సొంతగానే దాని నుంచి బయట పడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ సమస్య గురించి తన ఫ్రెండ్ రాంబాబు(జబర్దస్త్ ఫణి)కి మాత్రమే తెలుసు. ఈ సమస్య కారణంగా రవి మరిన్ని సమస్యలు తెచ్చుకుంటాడు. అదే సమయంలో రవికి పూజ(నజియా ఖాన్) పరిచయం కావడంతో ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే అసలు రవికి ఉన్న సమస్య ఏంటి? రవి సమస్య పూజకు తెలుసా? పూజతో ప్రేమ సఫలమైందా? రవి సమస్యకు పరిష్కారం దొరికిందా తెలియాలంటే బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ సినిమాలో ఒక కీలక విషయాన్ని చర్చించారు. టైటిల్ తోనే ఆ సమస్య ఏమిటి అనేది మీకు అర్ధమై పోతుంది. నిజానికి ప్రస్తుతం యువత చాలా వరకు ఈ సమస్య గురించి భయపడుతోంది, బాధపడుతుంది. ఈ విషయాన్ని కామెడీగా చూపిస్తూనే ఓ మంచి మెసేజ్‌ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు యశ్వంత్‌. అయితే ఆయన రాసుకున్న పాయింట్ గా కథ బాగుంది కానీ దాన్ని తెరపై చూపించడంలో తడబడ్డాడు. నిజానికి కొన్ని సీన్లను తెరకెక్కించిన విధానం చూస్తే అనుభవ లేమి కనిపిస్తుంది. అయితే కొన్ని కామెడీ సీన్లతో పాటు ఎమోషనల్‌ సన్నివేశాలను చక్కగా తెర మీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్‌ రవికి ఉన్న సమస్యతో కామెడీగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయేలా కథనం ఉండడం కాస్త ఇబ్బందికర అంశమే అయినా నిడివి తక్కువ ఉండడం సినిమాకు ప్లస్‌ పాయింట్‌. అయితే కొన్ని బోల్డ్‌ సీన్స్‌, సంభాషణలు ఉండడంతో ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదు కానీ యూత్‌ కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా థియేటర్‌ ఆడియన్స్‌ను మెప్పించే విషయం పక్కన పెడితే ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పవచ్చు.

నటీనటుల విషయానికి వస్తే అభిషేక్ పచ్చిపాల తనకున్న సమస్యను సమస్యలా కాకుండా కామెడీగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. నాచురల్ గా నటించాడు. అయితే హీరోయిన్ నజియా ఖాన్ పెర్ఫార్మెన్స్ కంటే గ్లామరస్ గా చాలా బాగుంది. జబర్దస్త్ ఫణి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కామెడీతో నవ్విస్తూనే ఎమోషన్ ని చాలా బాగా పండించారు. సరిపల్లి సతీష్ తండ్రిగా, పోలీస్ గా ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించారు. ఇక ఎస్.కె. బాజీ పాటలు పెద్దగా గుర్తుంచుకో తగినట్లు లేదు. నేపథ్య సంగీతం అయితే పర్వాలేదు. సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ ను క్యారీ చేసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ టేబుల్ మీద మరింత కత్తెరకు పని పెట్టి ఉంటే బాగుండేది.

ఫైనల్లీ ఒక కీలక విషయంలో సందేశం ఇస్తూ న‌వ్వించే సినిమా జస్ట్ ఎ మినిట్.

Show comments