Jhansi Review: ప్రముఖ నటి అంజలి నటించిన వెబ్ సీరిస్ ‘ఝాన్సీ’. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గత యేడాది అక్టోబర్ లో సీజన్ 1 స్ట్రీమింగ్ అయ్యింది. లేటెస్ట్ గా సీజన్ 2లోని నాలుగు ఎపిసోడ్స్ ను డిస్నీ సంస్థ వ్యూవర్స్ కు అందుబాటులో ఉంచింది. గతాన్ని మర్చిపోయినా ‘ఝాన్సీ’ కథలో కొంత భాగాన్ని మొదటి సీజన్ లో చూపించిన దర్శకుడు తిరు… ఇప్పుడీ నాలుగు ఎపిసోడ్స్ లో ఏం చెప్పాడో తెలుసుకుందాం.
బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మహిత (అంజలి) వేశ్యావాటికకు చేరుతుంది. అక్కడ బార్బీ (చాందినీ చౌదరి)తో ఆమెకు పరిచయం అవుతుంది. ఓ క్లబ్ లో దారుణమైన జీవితాన్ని గడిపే వీరు మొత్తానికి అక్కడ నుండి తప్పించుకుంటారు. అయితే… ఆ తర్వాత కొన్ని రోజులకే మహిత ఓ ప్రమాదంలో గతాన్ని కోల్పోతుంది. తన కూతురు మేహను రక్షించిందన్న కారణం మహితను సంకేత్ (ఆదర్శ్ బాలకృష్ణ) హైదరాబాద్ తీసుకొస్తాడు. అతని భార్య సాక్షి ఏ.సీ.పి., బట్ సంకేత్ తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా అతనికి దూరంగా ఉంటుంది. గతాన్ని మర్చిపోయిన మహితకు ‘ఝాన్సీ’ అనే పేరు పెడతాడు సంకేత్. ఆమె ఓ బొటిక్ ను నిర్వహిస్తుంటుంది. ఓ సాధారణ యువతి అయిన ఝాన్సీకి తన కళ్ళ ముందు అన్యాయం జరిగితే మాత్రం తీవ్రమైన కోపం వచ్చేస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళను ఎవరైనా హెరాస్ చేస్తే, హత్య చేయడానికి కూడా వెనకాడదు. ఇలాంటి విపరీతమైన మనస్తత్త్వం ఉన్న ఆమె గతం భయంకరమైందనే భావన సంకేత్ కు కలుగుతుంది. ఇక రెండో సీజన్ విషయానికి వస్తే… గోవాలో ఈ కథ మొదలవుతుంది. ఝాన్సీ తన గతాన్ని అమీషాను బెదిరించి, తెలుసుకుంటుంది. తన చేతిలోనే గ్యాంగ్ స్టర్, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే కలెబ్ కొడుకు చనిపోయాడనే విషయం ఆమెకు అర్థమౌతుంది. ఇదే సమయంలో మహిత బ్రతికే ఉందనే విషయం తెలుసుకుని కలేబ్ విదేశాల నుండి ఇండియా వస్తాడు. ఝాన్సీకి గతం గుర్తు రానంతవరకూ తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్సా (రామేశ్వరి తాళ్ళూరి) బృందం ఎందుకు భావించింది? వాళ్ళకు కలేబ్ కు ఉన్న సంబంధం ఏమిటీ? తన కొడుకును హత్య చేసిన మహితను కలేబ్ చంపగలిగాడా? మహిత ఉరఫ్ ఝాన్సీని అరెస్ట్ చేయాలనుకున్న సాక్షి కోరిక నెరవేరిందా? ఈ ప్రశ్నలకు సెకండ్ సీజన్ లోని నాలుగు ఎపిసోడ్స్ లో సమాధానం లభిస్తుంది. అయితే… పిక్చర్ అభీ బాకీ హై అన్నట్టుగా… అంజలి వర్సెస్ చాందినీ చౌదరితో డైరెక్టర్ తిరు కొత్త మెలిక పెట్టాడు. ఝాన్సీ చనిపోయాడని భావిస్తున్న కొడుకు బార్బీ దగ్గర ఉన్నట్టుగా తెలిపారు. సో… తన కొడుకును ఆమె తిరిగి ఎలా పొందింది? ఆమె మీద విపరీతమైన ద్వేషభావాన్ని కలిగిన ఆ పిల్లాడి మనసును ఝాన్సీ ఎలా మార్చుకుంది!? అనేది రాబోయే సీజన్ లోని ఎపిసోడ్స్ లో చూడాల్సి ఉంది.
మొదటి సీజన్ లో అంజలికి సంబంధించిన బాల్య, యవ్వన సంఘటనలను చూపించడంతో ఆ ఎపిసోడ్స్ కొంత బోర్ కొట్టాయి. అలానే వ్యభిచార గృహంలోని సన్నివేశాలకు కొన్ని జుగుప్సను కలిగించాయి. అయితే… ఇందులో అలాంటి ల్యాగ్ చాలా వరకూ లేదు. కానీ మొదటి ఎపిసోడ్ లో మాత్రం దారుణమై వర్గలర్ డైలాగ్స్ ను క్యారెక్టర్స్ తో మాట్లాడించారు. హిందీ వెబ్ సీరిస్ లకు తెలుగువి ఏమాత్రం తక్కువ కాదని దర్శకుడు చెప్పాలనుకున్నాడేమో! అయితే అన్ని ఎపిసోడ్స్ ను దర్శకుడు తిరు ఆసక్తి కరంగానే చిత్రీకరించాడు. బట్ కొన్ని సన్నివేశాలు రొటీన్ గా, సినిమాటిక్ గా ఉన్నాయి. అలానే క్లయిమాక్స్ పిక్చరైజేషన్ సినిమాలు గుర్తు చేసే విధంగా ఉంది. దానికి తోడు ప్రదీప్ చంద్ర, అంజలి మధ్య పెట్టిన క్లయిమాక్స్ ఫైట్ మరీ లెంగ్త్ ఎక్కువై బోర్ కొట్టేస్తుంది. అయితే… చేతిలో రిమోట్ ఉంటుంది కాబట్టి… ఫాస్ట్ ఫార్వ్డ్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆర్టిస్టులలో అంజలి నటన ఆకట్టుకుంటుంది. చాందినీ చౌదరి ఓకే. ఆమెకు సంబంధించిన అసలు కథ వచ్చే సీజన్ లో ఉండబోతోంది. సో.. అందులో మరింత స్క్రీన్ స్పేస్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఇతర ప్రధాన పాత్రలలో తాళ్ళూరి రామేశ్వరి, ఆదర్శ్ బాలకృష్ణ, రాజ్ అరుణ్, సంయుక్త హర్నాద్, ప్రదీప్ రుద్ర, సురేశ్ చక్రవర్తి, ఆదిత్య తదితరులు కనిపిస్తారు. శ్రీచరణ్ పాకాల రీ రికార్డింగ్ బాగుంది. గణేశ్ కార్తిక్ సంభాషణలు ఓకే. కాకపోతే కొన్ని చోట్ల శ్రుతిమించి ఉన్నాయి. మొదటి సీజన్ తో పోల్చితే సెకండ్ సీజన్ బాగుందనే చెప్పాలి. అంజలి గతాన్ని రివీల్ చేసిన విధానం బాగుంది. మూడో సీజన్ కోసం ఎదురు చూసేలా ఈ నాలుగు ఎపిసోడ్స్ ను దర్శకుడు తిరు ఆసక్తికరంగా మలిచాడు.
రేటింగ్: 2.75/ 5
ప్లస్ పాయింట్స్
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
టెక్నీషియన్స్ టాలెంట్
ఆకట్టుకునే యాక్షన్ సీన్స్
మైనెస్ పాయింట్స్
వల్గర్ డైలాగ్స్
రొటీన్ క్లయిమాక్స్
ట్యాగ్ లైన్ : పిక్చర్ అభీ బాకీ హై!