NTV Telugu Site icon

Record Break Review: జయసుధ కొడుకు హీరోగా నటించిన ‘రికార్డు బ్రేక్’ రివ్యూ

Record Break Movie

Record Break Movie

Record Break Movie Review: గతంలో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన చదలవాడ శ్రీనివాసరావు కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు. ఆయన చాలా కాలం గ్యాప్ తీసుకుని దర్శకత్వం చేసిన సినిమా రికార్డు బ్రేక్. టైటిల్ వినగానే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమాకు సంబంధించి విజయేంద్ర ప్రసాద్, చిన్నికృష్ణ వంటి వాళ్లు ఇచ్చిన రివ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానికి తోడు జయసుధ కుమారుడు నిహార్ కపూర్ హీరోగా పరిచయమవుతున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. మరి శివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు భోజ్పురి, ఒడిశా భాషల్లో సైతం రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే : కోటీశ్వరుల ఇంట జన్మించిన ఇద్దరు చిన్నారులు అనుకోని పరిస్థితులలో అడవి పాలు అయ్యి అనాధలవుతారు. అలా అడవిలోనే పెరిగిన ఇద్దరు అనాధలు నిహార్ కపూర్, నాగార్జున ప్రపంచం అంతా గుర్తింపు తెచ్చుకునే రెజ్లింగ్ ఛాంపియన్స్ ఎలా అయ్యారు? చిన్ననాడే తల్లిని పోగొట్టుకున్న వారికి తల్లి ఎలా దొరికింది? వీళ్లు రెజ్లింగ్ వెళ్లడానికి ఆ తల్లి చేసిన త్యాగం ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు దర్శకుడుగా కూడా మారి కొన్ని సినిమాలు చేశారు. అయితే ఆయన భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ రికార్డు బ్రేక్ సినిమా టైటిల్ తోనే అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. అలాంటి ఈ సినిమాని రిలీజ్ కి వారం ముందే మీడియాకి నాలుగు స్పెషల్ షోలు వేసి చూపించారు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులకు సైతం స్పెషల్ షోలు వేసి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. నిజానికి ఈ సినిమా కథ కొత్తది ఏమీ కాదు, గతంలో మనం చూసిన భద్రాచలం తమ్ముడు తరహాలోనే భారతదేశం తరపున పోరాడే వారి కథ. ఒక కోటీశ్వరుల కుటుంబంలో జన్మించిన ఇద్దరు అన్నదమ్ములు అనూహ్యంగా అడవిపాలు అయ్యి అక్కడ అనాధలుగా పెరుగుతారు. తర్వాత రెజ్లింగ్ నేర్చుకున్న వాళ్లు భారతదేశం కోసం ఎలా ఇతర దేశాలను సైతం ఓడించి చివరికి మంచి పేరు తీసుకొచ్చారు అనే కాన్సెప్ట్ తో సినిమాని తెరకెక్కించారు. నిజానికి హీరోలు చూడడానికి పహిల్వాన్లు లాగా అనిపిస్తారు. రొటీన్ హీరోలు సెట్ అవ్వరు కాబట్టి ఈ పాత్రలకు చూడగానే అబ్బురపడేలా ఉండే నిహార్ నాగార్జునను ఎంపిక చేసుకున్నట్లు అనిపించింది. ఒకపక్క కమర్షియల్ అంశాలతో సినిమాని నడిపిస్తూనే మరొకపక్క రైతుల సమస్య అలాగే తల్లి కొడుకుల సెంటిమెంట్ ని సమపాళ్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్.

నటీనటుల విషయానికి వస్తే కొత్త వాళ్ళైనా కూడా నిహార్ కపూర్, నాగార్జున, రగ్ధ ఇఫ్తాకర్, సంజన, సోనియా వంటి వారు తమ తమ పాత్రలలో ఆసక్తికరంగా నటించారు. సత్య కృష్ణ క్యారెక్టర్ అయితే సినిమాకి హైలైట్. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు నిర్మాతగా మాత్రమే మనకు పరిచయం ఉన్న టి. ప్రసన్న కుమార్ విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే చదలవాడ శ్రీనివాసరావు అనుకున్నది అనుకున్నట్టు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని చోట్ల సినిమా లాగ్ అనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ బాగున్నా, ఎందుకో రియాలిటీకి దూరం అనిపించేలా కొన్ని సీన్స్ ఉన్నాయి. అంగిరెడ్డి శ్రీనివాస్ అందించిన కథ, సబు వర్గీస్ సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

Show comments