NTV Telugu Site icon

Jathara Review: జాతర రివ్యూ.. మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ ఎలా ఉందంటే?

Jathara Movie

Jathara Movie

ఈ మధ్యకాలంలో డివోషనల్ కంటెంట్ కి ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఎక్కువగా హిందూ సంప్రదాయాల గురించి హిందూ దేవీ దేవతల గురించి సినిమాలు చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే జాతర అనే ఒక సినిమాని తెరకెక్కించారు సతీష్ బాబు రాటకొండ. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కట్స్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

జాతర కథ;
ఈ కథంతా చిత్తూరు జిల్లా నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. అక్కడ ఒక గ్రామంలో నివసించే చలపతి(సతీష్ బాబు) నాస్తికుడు. ఆలయ పూజారి పాలేటి కొడుకు అయినా తన తండ్రి లాగా కాకుండా అసలు దేవుడంటే నమ్మకం లేకుండా బతికేస్తూ ఉంటాడు. అదే ఊరికి చెందిన వెంకటలక్ష్మి (దియారాజ్)తో ప్రేమలో పడతాడు. అయితే చలపతి తండ్రి పాలేటి మాత్రం అమ్మవారి గుడిలోనే పూజారిగా ఉంటూ అమ్మవారి అండతో గ్రామాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు పాలేటి సహా గంగావతి అమ్మవారు సైతం ఊరి నుంచి మాయం అవుతారు. అయితే పాలేటి చేసిన తప్పుల వల్లే అమ్మవారు ఊరు విడిచి వెళ్లిపోయిందని ప్రచారం మొదలవుతుంది. దీంతో పాలేటి కుటుంబం మొత్తాన్ని ఊరి వారు శత్రువులుగా చూడడం మొదలుపెడతారు. మరొకపక్క ఊరి పెద్ద గంగిరెడ్డి(ఆర్కే నాయుడు)తో పాలేటి కుటుంబానికి ముందు నుంచే గొడవలు ఉంటాయి. అయితే గంగిరెడ్డికి పాలేటి కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి? అసలు అమ్మవారు, పాలేటి గ్రామం విడిచి వెళ్లిపోవడానికి కారణం ఏమిటి? చివరికి అమ్మవారు, పాలేటి తిరిగి వచ్చారా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
ప్రస్తుతం హిందూ సంప్రదాయాలను చూపే సినిమాలకి, మైథాలాజికల్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. భక్తి నేపథ్యం ఉన్న కథాంశాలతో పాటు పురాణ సంబంధం ఉన్న కథలు ఉన్న సినిమాలు కూడా మంచి హిట్ అవుతున్నాయి. ఈ సినిమాని అదే విధంగా చిత్తూరు జిల్లాలో జరుపుకునే గంగమ్మ జాతర ఆధారంగా చేసుకుని తెరకెక్కించాడు సతీష్ బాబు. అయితే ఇప్పటివరకు అమ్మవారు తనను నమ్మే ప్రజలను కాపాడే లైన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం కాస్త విను అసలు దేవుడే లేడు అనే నాస్తికుడు ఊరు మొత్తాన్ని కాపాడాల్సి వచ్చేలా లైన్ ఉంటుంది. అసలు దేవుడిని నమ్మని ఆ యువకుడు అమ్మవారి అండతో ఊరు మొత్తాన్ని ఎలా కాపాడగలిగాడు? లాంటి విషయాలను ఒక రివెంజ్ స్టోరీతో కలిపి ఒక లవ్ స్టోరీతో మిళితం చేసి ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ మొత్తం ప్రేమ కథతో నడిపించిన ఆయన ఇంటర్వెల్ ట్విస్ట్ ని ఆసక్తికరంగా రాసుకున్నాడు. ఆ తర్వాత ఊరి పెద్దకి హీరో మధ్య గొడవ లు ఆసక్తికరంగా నడిపిస్తూనే క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకున్నాడు. నిజానికి కొంచెం లాజికల్ గా లైన్ తప్పినా సరే సినిమాటిక్ లిబర్టీ తీసుకుని బండి నడిపించినట్లు అనిపించింది. అయితే దర్శకుడికి మొదటి సినిమా అనే విషయం అర్ధమయ్యేలా ఉంది. మంచి పాయింట్ ను ఇంకా కాస్త జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకా బాగుండేది.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో దర్శకుడిగా బాధ్యతలు చేపట్టి మరో పక్క హీరోగా కూడా అలరించే ప్రయత్నం చేశాడు సతీష్ బాబు. చలపతి అనే పాత్రలో కొత్తగా కనిపించాడు. అద్భుతం అనలేం కానీ మొదటి సినిమాతోనే తనదని శైలిలో నటించాడు. వెంకటలక్ష్మి అనే పాత్రలో దియా రాజ్ కూడా ఆకట్టుకుంది. విలన్ గా ఆర్కే నాయుడుకి మంచి పాత్ర దక్కింది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దేవత సన్నివేశాల కోసం చేసిన కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంకా కొంచెం బాగా చేయొచ్చు అనిపించింది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి తగ్గట్టుగా ఉంది. పాటలు పెద్దగా గుర్తు పెట్టుకునేలా లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంది. ఎడిటింగ్ మీద మరింత శ్రద్ధ పెట్టి ఉండొచ్చు. అయితే ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం చాలా ఫ్రేమ్స్ లో కనిపించింది. అడవి అందాలను చూపించడంలో సినిమాటోగ్రఫీ కూడా ఉపయోగపడింది.

ఫైనల్లీ: జాతర మాస్ అండ్ రగ్డ్ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది..

Show comments