NTV Telugu Site icon

Happy Birthday Movie Review : హ్యాపీ బ‌ర్త్ డే రివ్యూ

Happy Birthday

Happy Birthday

 

తొలి సినిమా ‘మత్తు వదలరా’ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో చేసి విజయం సాధించిన రితేశ్‌ రాణా తన తదుపరి సినిమా కూడా ఇదే సంస్థలో చేశాడు. అదే ‘హ్యాపీ బర్త్ డే’. క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ సినిమాతో రితేశ్‌ సెకండ్ సినిమా సిండ్రోమ్ ని అధిగమించాడా? ‘హ్యాపీ’ అనే టైటిల్ పాత్ర పోషించిన లావణ్య కెరీర్ కి ఈ సినిమా ఏ మేరకు హెల్ప్ అవుతుంది? ‘మత్తు వదలరా’ సక్సెస్ చూసి రితేశ్‌ రాణాతో సెకండ్ మూవీ చేసిన మైత్రీ మూవీస్ కి దక్కిన ప్రతిఫలం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘హ్యాపీ బర్త్ డే’.

నిజానికి కామెడీ సినిమాలకు లాజిక్ వెద‌క్కూడ‌దు. అలా అని సర్రియలిస్టిక్ కామెడీ సినిమా అనే పేరుతో పూర్తిగా ఇల్లాజికల్ గా ప్రేక్షకుల బుర్రలు తినకూడదు. ట్రైలర్ తో ఆస‌క్తిని పెంచి థియేటర్లలో తుస్సుమనిపించే సినిమాలు చాలా వస్తుంటాయి. ఆ కోవకు చెందిన మరో సినిమానే ‘హ్యాపీ బర్త్ డే. ప్రచారంలో అద్భుతమైన క్రియేటివిటీ చూపించిన దర్శకుడు రితేశ్ సినిమా విషయంలో మాత్రం ఏ మాత్రం ఆసక్తిని క్రియేట్ చేయలేక పోయాడు. కథ విషయానికి వస్తే రక్షణశాఖా మంత్రి ‘వెన్నెల’ కిషోర్‌ గన్ అమెండ్ మెంట్ చట్టాన్ని తీసుకువచ్చి ఇంటింటికీ గ‌న్ను అనే బిల్లును పార్లమెంట్ లో పెట్టి పాస్ చేయిస్తాడు. అంతే నో మాస్క్ నో ఎంట్రీలా నో గన్ నో ఎంట్రీలా మారిపోతుంది పరిస్థితి. దీంతో వీధి వీధికి అంగళ్ళలో గన్నులు అమ్మేస్తుంటారు. ఇదిలా ఉంటే బ‌ర్త్ డేని ప‌బ్బులో జరుపుకోవడానికి వస్తుంది హ్యాపీ (లావ‌ణ్య త్రిపాఠీ). అక్కడే ప‌నిచేస్తున్న వెయిటర్ అగ‌స్త్య కి ఓ లైట‌ర్ తెచ్చి ఇస్తే తను ఇచ్చిన అప్పు మాఫీ చేస్తానంటాడు రాహుల్ రామకృష్ణ. మరో వైపు స‌త్యతో ఓ శ‌వాన్ని పాతిపెట్టే డీల్ కుదుర్చుకుంటాడు గుండు సుదర్శన్. వీరితో పాటు ర‌క‌ర‌కాల పాత్రలు ప‌బ్‌లో ఎంటరవుతాయి. ఇక్కడే మత్తు కలిపి హ్యాపీని కిడ్నాప్ చేస్తాడు మరో వెయిటర్. డిక్కీలో శవాన్ని పాతిపెట్టాలనుకున్న సత్యకు సడన్ గా అక్కడ హ్యాపీ లాగా ఉండే మరో పాత్ర దర్శనం ఇస్తుంది. అసలు హ్యాపీకి, తన ట్విన్ సిస్టర్ కి మినిస్టర్ తో ఉన్న సంబంధం ఏమిటి? ఆ లైట‌ర్ లో ఉన్నది ఏమిటి? ఈ పాత్రలన్నింటికి ఉన్న లింక్ ఏమిటి? వాటిని దర్శకుడు ఎలా కలిపాడు? చివరకు ఏం జరిగిందన్నదే ‘హ్యాపీ బర్త్ డే’ కథ.

కామెడీ సినిమాల‌లో ఎవరూ లాజిక్ చూడరు. అయితే క‌థ మాత్రం ఉండాలి. సర్రియలిస్టిక్ కామెడీ పేరుతో తలాతోక లేకుండా మా ఇష్టం వచ్చినట్లు తీస్తాం… మీరు నవ్వండి అంటే ఆడియన్స్ అంత వెర్రివాళ్ళు కాదు. ఒక్క ఇంగ్లీష్ ట్రాన్స్ లేషన్ సీన్ మాత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అగ‌స్త్య బిచ్చగాడు ట్రాక్, సిస్టర్స్ సెంటిమెంట్ ఆడియన్స్ తలలు బొప్పి కట్టేట్టు చేస్తుంది. వైవా హర్ష ఎపిసోడ్ కూడా సేమ్. ఇక ప‌బ్‌లో సాంగ్ వ‌స్తుంటే… కింద ఓ వైపు ‘మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం’ అని వేస్తూ మరో వైపు ‘ఈ పాట‌ని నిర్మాత కోరిక మేర‌కు చిత్రీక‌రించ‌డం జ‌రిగింది’ అని వేశారు. నిజంగా పాట బాగుంటే అది పేలి ఉండేది. అసలు పాటే నీరసం. దానికి తోడు ఈ స్టిప్ తో కామెడీ అనే ఫీల్ కాకుండా దర్శకుడికి ఇష్టం లేకున్నా నిర్మాత బలవంతంగా తీయించాడనే అభిప్రాయం ఆడియన్స్ లో కలగటం ఖాయం. లావ‌ణ్య త్రిపాఠి తన రెండు పాత్రలను హుషారుగా చేసింది. స‌త్య కూడా తన పాత్రలో నూటికి నూరు శాతం అవుట్ పుట్ ఇచ్చాడు. అగస్త్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సురేశ్ సారంగా సినిమాటోగ్రఫీ ఉన్నంతలో ఫర్వాలేదనిపిస్తాయి. ఎ క్లాస్ సెంటర్లలో ఈ సర్రియలిస్టిక్ కామెడీని కొంతలో కొంత ఎంజాయ్ చేస్తారేమో కానీ బి, సి సెంటర్లలో ఆడియన్స్ దర్శకుడిని తిట్టుకుంటూ బయటకు రావటం ఖాయం. దర్శకుడు రితేశ్ రాణాలో… విషయం అయితే ఉంది కానీ దానిని సరైన పద్దతితో ఉపయోగించలేనిపిస్తుంది. అసలు నిర్మాతలు కథ విన్నారా? లేదా? ఫస్ట్ సినిమా ‘మత్తు వదలరా’ ఆడింది కదా అని గుడ్డిగా ముందుకు వెళ్ళారా? అనే సందేహమూ కలుగుతుంది.

 

ప్లస్ పాయింట్స్
నిర్మాణాత్మక విలువలు
లావణ్య, సత్య, వెన్నెల కిషోర్ నటన

మైనస్ పాయింట్స్
చిరాకు పుట్టించే కామెడీ
కథ, కథనాలు

ట్యాగ్ లైన్: అన్ హ్యాపీనే!