NTV Telugu Site icon

Godse Movie Review: గాడ్సే

Godse

Godse

సత్యదేవ్ ఇప్పుడిప్పుడే సోలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. రొటీన్ కు భిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ ముందు సాగుతున్న సత్యదేవ్ తాజా చిత్రం ‘గాడ్సే’ శుక్రవారం విడుదలైంది. గతంలో సత్యదేవ్ తో ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రాన్నితీసిన గోపీ గణేశ్‌ ఈ సినిమాను తెరకెక్కించడం, సత్యదేవ్ తో ‘జ్యోతిలక్ష్మి’ మూవీని ప్రొడ్యూస్ చేసిన సి. కళ్యాణ్ దీన్ని నిర్మించడంతో సహజంగానే ‘గాడ్సే’పై అంచనాలు నెలకొన్నాయి.

ఈ దేశంలోని రాజకీయ వ్యవస్థ కలుషితం కావడంతో ఆ ప్రభావం అన్ని రంగాలపై పడింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్కపోవడం లాంటి రుగ్మతలన్నీ చోటు చేసుకున్నాయి. ఈ దేశాన్ని ఉద్ధరించాలని విదేశాల నుండి వచ్చిన ఓ పారిశ్రామిక వేత్తకు ఈ కుళ్ళిపోయిన వ్యవస్థ నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అసలు అతని నేపథ్యం ఏమిటీ? అనేదే ‘గాడ్సే’ కథ. ఏసీపీ వైశాలి (ఐశ్వర్య లక్ష్మి) ఓ ఆపరేషన్ లో జరిగిన పొరపాటుతో మనస్తాపం చెంది ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. అయితే ఊహించని విధంగా రాష్ట్రంలో ఓ వ్యక్తి మంత్రులను, ప్రభుత్వ, పోలీస్ అధికారులను, న్యాయమూర్తిని కిడ్నాప్ చేయడంతో అతనితో జరిగే చర్చలలో ఆమె పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ చర్చల పర్యవసానం ఏమిటీ? గాడ్సే ఉద్దేశ్యపూర్వకంగా కొందరిని ఎంపికచేసి కిడ్నాప్ చేయడం, మరి కొందరిని హతమార్చడం వెనుక ఉన్న బలమైన కారణాలేమిటనేదే ఈ సినిమా. ప్రధమార్థం ఓ పజిల్ గా సాగితే ద్వితీయార్థంలో దానికి సమాధానాలు దొరుకుతాయి. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న కథలో కానీ, దాన్ని తెరపై చూపెట్టిన విధానంలో కానీ కొత్తదనం లేదు. గతంలో ఈ తరహా చిత్రాలు చాలానే వచ్చాయి. ముఖ్యంగా రజనీకాంత్ ‘శివాజీ’ మూవీ ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తాయి. అయితే హీరో నేపథ్యాన్ని మాత్రం దర్శకుడు కాస్తంత భిన్నంగా చూపించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేతో పాటు మాటలు సైతం దర్శకుడు గోపీ గణేశే అందించారు. ఆయన మాటలు తూటాల్లా పేలాయి. చాలా సందర్భాలలో ప్రేక్షకులను ఆలోచనలో పడేశాయి. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం, సురేశ్‌ సారంగం సినిమాటోగ్రఫీ చెప్పుకోదగ్గవిగా ఉన్నాయి.

నటీనటుల విషయానికి వస్తే, ఇది సత్యదేవ్ వన్ మ్యాన్ షోగా భావించొచ్చు. ఈ వ్యవస్థను ప్రశ్నించే క్రమంలో అతను చూపించిన ఆగ్రహం, ఆక్రోశం, ఆవేదన అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. అలానే తొలిసారి తెలుగు తెరకు పరిచయం అయిన ఐశ్వర్య లక్ష్మీ కూడా మంచి పెర్ఫార్మెన్సే ఇచ్చింది. ఇతర ప్రధాన పాత్రల్లో బ్ర‌హ్మాజీ ,సిజ్జూ మీన‌న్, నోయల్, చైతన్యకృష్ణ, రాహుల్ రామకృష్ణ, పృథ్వీరాజ్, నాగబాబు తదితరులు నటించారు. కానీ కథలో కొత్తదనం లేకపోవడం, కథనం ఆసక్తి కలిగించలేకపోవడం, చాలా సన్నివేశాలు ఫ్లాట్ గా సాగిపోవడంతో థియేటర్ లోని ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడు. సహజంగా ఇలాంటి సోషల్ ఇష్యూని టేకప్ చేసినప్పుడు వాటిని ఎమోషనల్ గా చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే ఆడియెన్ కనెక్ట్ అవుతాడు. ఇందులో ఆ సన్నివేశాలు కూడా పెద్దంత ఎఫెక్టివ్ గా లేదు. పైగా సత్యదేవ్, గోపీ గణేశ్ కాంబోలో మూవీ అనగానే ప్రేక్షకులు ఎంతో కొంత ఎక్స్ పెక్టేషన్ తో థియేటర్లకు వస్తారు. పైగా ఈ సినిమాకు ‘గాడ్సే’ అనే పేరు పెట్టడం కూడా ఆసక్తిని మరింత పెంచింది. కానీ ఆ రకమైన అంచనాలతో వచ్చిన వారిని ‘గాడ్సే’ నిరాశకు గురిచేశాడు.

రేటింగ్ : 2.25/ 5

ప్లస్ పాయింట్స్ 
సత్యదేవ్ నటన
ఆలోచింప చేసే డైలాగ్స్
టెక్నీషియన్స్ పనితనం

మైనెస్ పాయింట్స్
రొటీన్ కథ
మెప్పించని కథనం

ట్యాగ్ లైన్: జవాబు లేని ప్రశ్న!