NTV Telugu Site icon

God Father Review: గాడ్ ఫాదర్ మూవీ రివ్యూ

God Father Review

God Father Review

God Father Review:’గాడ్ ఫాదర్’ అనగానే జనానికి మాఫియా డాన్స్ కథలు ముందుగా గుర్తుకు వస్తాయి. 1972లో రూపొందిన మార్లన్ బ్రాండో ‘గాడ్ ఫాదర్’ అంతలా సినీ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది మరి! తెలుగులో ఆ టైటిల్ తో ఇంతకు ముందు ఏయన్నార్ తో ఓ సినిమా వచ్చింది. ఇప్పుడు అదే టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మూవీ రావడం విశేషం! ఈ ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి మళయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కి సక్సెస్ సాధించిన ‘లూసిఫర్’ చిత్రం ఆధారం. అదే కథకు కొన్ని మార్పులూ, చేర్పులూ చేసి తెరకెక్కించారు. ‘హనుమాన్ జంక్షన్’తో మెగా ఫోన్ పట్టి హిట్టు కొట్టిన మోహన్ రాజా, తరువాత తమిళంలో అనేక రీమేక్స్ తో సక్సెస్ చూశారు. దాదాపు 21 సంవత్సరాల తరువాత ఈ ‘గాడ్ ఫాదర్’తో తెలుగు సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించడం విశేషం!

ఇక ఈ ‘గాడ్ ఫాదర్’ కథ ఏమిటంటే – సీఎమ్ పి.కె.ఆర్. మ‌ర‌ణంతో ఆ స్థానం ఖాళీ అవుతుంది. అందులో త‌న మాట వినేవారిని పెట్టుకొని త‌న ఇష్టారాజ్యంగా సాగాల‌ని పి.కె.ఆర్. కూతురు భ‌ర్త జ‌య‌దేవ్ (సత్యదేవ్) ఆశిస్తాడు. అయితే పి.కె.ఆర్. త‌న‌యుడైన బ్రహ్మ (చిరంజీవి) అత‌ని ఆట‌లు సాగ‌నివ్వకుండా అడ్డుప‌డ‌తాడు. బ్రహ్మను అంద‌రూ `గాడ్ ఫాద‌ర్` అంటూంటారు. అత‌ను వేరే భార్య కొడుకు కావ‌డంతో పాటు తన తల్లి మరణానికి తనే కారణమని పి.కె.ఆర్. కూతురు స‌త్యప్రియ (న‌య‌న‌తార‌)కు కూడా బ్రహ్మ అంటే ఇష్టం ఉండ‌దు. స‌త్యప్రియ భ‌ర్త ఆమె చెల్లెలి (తాన్య)కి డ్రగ్స్ అలవాటు చేసి అనుభ‌వించాల‌ని చూస్తూంటాడు. ఇవేవీ స‌త్యప్రియ‌కు తెలియ‌దు. ఓ ప‌థ‌కం ప్రకారం బ్రహ్మను జైలుకు పంపిస్తాడు జ‌య‌దేవ్. బ్రహ్మ ఎప్పటికప్పుడు జయదేవ్ ఎత్తులను చిత్తు చేస్తుంటాడు. సత్యదేవ్ నిజ స్వరూపం తెలిసిన త‌రువాత స‌త్యప్రియ కూడా భ‌ర్తను అస‌హ్యించుకుంటుంది. బ్రహ్మను అన్నగా అభిమానిస్తుంది. చెల్లెళ్ళకు అండ‌గా నిల‌చిన బ్రహ్మకు అత‌నంటే ప్రాణం పెట్టే మాసూమ్ భాయ్ (సల్మాన్) అండగా నిలుస్తాడు. దాంతో జ‌య‌దేవ్ చిత్తవుతాడు. చివ‌ర‌కు తండ్రి స్థానంలో స‌త్యప్రియ‌ను ముఖ్యమంత్రి కావటంతో సినిమా ముగుస్తుంది. `లూసిఫ‌ర్` చూసిన వారికి `గాడ్ ఫాద‌ర్` కిక్ ఇవ్వక‌పోవ‌చ్చు. `లూసిఫ‌ర్`లో చ‌నిపోయిన ముఖ్యమంత్రికి హీరో సొంత‌కొడుకా..? కాదా..?  అన్న అంశాన్ని న‌ర్మగ‌ర్భంగా చెప్పారు.  ఇందులో సొంత కొడుకు అనే చిత్రీక‌రించారు. అలాగే అందులో ముఖ్యమంత్రి కూతురుకు మొద‌ట వేరే వ్యక్తితో పెళ్ళయి ఓ కూతురు ఉంటుంది. భ‌ర్త చ‌నిపోయాక మ‌రో వ్యక్తిని చేసుకుంటే, అత‌ను ఆమె కూతురుతో మిస్ బిహేవ్ చేసేలా చూపారు. ఇందులో కూతురు పాత్రను చెల్లెలుగా మార్చారు. అందులో హీరోయిన్ కు ఓ సొంత త‌మ్ముడు ఉంటాడు. అత‌డిని అందులో ముఖ్యమంత్రిని చేస్తారు. ఈ సినిమాలో ఆ పాత్రనే లేదు. ఇలాంటి మార్పులు మిన‌హాయిస్తే `లూసిఫ‌ర్`నే అంత‌టా ఫాలో అయ్యారు.

ద‌ర్శకుడు మోహ‌న్ రాజా రీమేక్స్ తీయ‌డంలో మేటి. అదే తీరున `గాడ్ ఫాద‌ర్`నూ తెర‌కెక్కించారు. అందుకు లక్ష్మీ భూపాల్ మాటలు బాగా సహకరించాయని చెప్పవ‌చ్చు. థ‌మ‌న్ సంగీతం పాట‌ల్లో కన్నా నేప‌థ్యంగా ఆక‌ట్టుకుంటుంది. ‘ఆచార్య’ తర్వాత చిరంజీవి చేసిన పాత్ర ఫ్యాన్స్ ను ఆసాంతం ఆకట్టుకుంటుదనే చెప్పాలి. ఇక న‌య‌న‌తార‌, స‌త్యదేవ్ త‌మ పాత్రల‌కు ఎంతో న్యాయం చేశారు. ప్రత్యేకించి సత్యదేవ్ అందరినీ డామినేట్ చేశాడనే చెప్పాలి. మిగిలిన పాత్రధారుల్లో మురళీ శర్మ తనదైన మ్యానరిజంతో ఆకట్టుకుంటాడు.  ఇక స‌ల్మాన్ ఖాన్ పాత్ర ఒరిజిన‌ల్ లో పృథ్వీరాజ్  చేశారు. ఎందుకో ఏమో కానీ మోహన్ రాజా సల్మాన్ ఎపిసోడ్ పై అంత దృష్టిపెట్టినట్లు అనిపించదు. ఒరిజనల్ తో పోలిస్తే తేలిపోయింది. పాటల్లో ఫైట్ బ్యాక్ డ్రాప్ లో ‘నజభజజజరా’ చిత్రీకరణ బాగుంది. క్లయిమాక్స్ ముందుగా వ‌చ్చే చిరంజీవి, స‌ల్మాన్ “మార్ మార్ థ‌క్కర్ మార్…“ పాట కాసింత ఊపునిస్తుంది. అయితే క్లబ్ సాంగ్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఒరిజినల్ లో ఉంది కాబట్టే పెట్టారేమో అని పిస్తుంది. ఎటూ క్లయిమాక్స్ మార్చారు కాబట్టి ఆ పాట పూర్తిగా ఎత్తేసినా ఎలాంటి నష్టం ఉండదు. `లూసిఫ‌ర్` చూడ‌ని వారికి చిరు `గాడ్ ఫాద‌ర్` గా నచ్చుతాడు.

ప్లస్ పాయింట్స్
– చిరంజీవి, సత్యదేవ్ నటన
– నిర్మాణ విలువలు
– థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం
– ల‌క్ష్మీ భూపాల్ మాటలు

మైనస్ పాయింట్స్
– క్లయిమాక్స్
– ఆక‌ట్టుకోని స‌ల్మాన్ ఎపిసోడ్

రేటింగ్: 2.75/5

ట్యాగ్ లైన్: గాడ్ బ్రదర్!

Show comments