NTV Telugu Site icon

First day first show! Review : ఫస్ట్ డే ఫస్ట్ షో! రివ్యూ

First Day First Show

First Day First Show

 

కొన్ని నిర్మాణ సంస్థల పట్ల ప్రేక్షకులకు ఓ గౌరవం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడిచిన అది చెరిగిపోదు, చెదిరిపోదు. అలాంటి సంస్థ పూర్ణోదయ! స్వర్గీయ ఏడిద నాగేశ్వరరావు ఆ బ్యానర్ పై నిర్మించిన సినిమాలు తెలుగు చలన చిత్ర చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి. ఇప్పుడు ఆయన తనయుడు శ్రీరామ్ కుమార్తె శ్రీజ తాతగారి బాటలో సాగాలని, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాతగా మారింది. తొలి యత్నంగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే మూవీని నిర్మించింది. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ కథ, కథనం అందించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. అనుదీప్ శిష్యులు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇది 2001లో నారాయణ్ ఖేడ్ లో జరిగే కథ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ మూవీ విడుదల నేపథ్యంలో సాగుతుంది. పవన్ కళ్యాణ్ కు డై హార్డ్ ఫ్యాన్ శ్రీను (శ్రీకాంత్ రెడ్డి). తన అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే జీవితం వేస్ట్ అన్నది అతని ఫీలింగ్. స్కూల్ హెడ్ మాస్టర్ అయిన శ్రీను తండ్రి మొదటి రోజు మొదటి ఆట చూడకపోతే వచ్చే నష్టం ఏమిటీ? అని కొడుకును నానా తిట్లూ తిడుతుంటాడు. అలాంటి శ్రీనుకు తాను ప్రేమించిన లయ (సంచిత బసు) కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే అని తెలుస్తుంది. ‘ఖుషీ’ సినిమా టిక్కెట్లు తెస్తే, ఫస్ట్ డే ఫస్ట్ షో కలిసి చూద్దామని మాట ఇస్తుంది. తన కోసం, తన ప్రేయసి కోసం శ్రీను సినిమా టిక్కెట్లను సంపాదించడానికి ఎలాంటి పాట్లు పడ్డాడన్నదే ఈ సినిమా!

షార్ట్ ఫిల్మ్ తీయాల్సిన పాయింట్ ను పట్టుకుని రెండు గంటల ఫీచర్ ఫిల్మ్ చేయాలనే కోరికతో జీడిపాకంలా కథను సాగదీశారు. దాంతో జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఎలాంటి ఆసక్తి లేకుండా పోయింది. సినిమా టిక్కెట్లు సంపాదించడం అనే ఎజెండా చుట్టూనే కథ సాగడం, అందుకోసం హీరో పడే పాట్లు…. ఏ ఒక్క సందర్భంలోనూ మనకు నవ్వు తెప్పించవు సరికదా… ఆ అతి చేష్టలు చూస్తే చిరాకు పుడుతుంది. చివరకు శవంతో పాటు టిక్కెట్లను గోతిలో కప్పేశారని దాన్ని తవ్వడం పరాకాష్ఠ! వీటన్నింటినీ తట్టుకుని క్లయిమాక్స్ కు చేరిన తర్వాత అయినా హీరోయిన్ తో కలిసి సినిమా చూడాలనే హీరో కోరిక నెరవేరుతుందా అంటే అదీ లేదు!! ఇందులో ఏ పాత్రకూ సరైనా ముగింపూ లేదు. ప్రతి పాత్ర ఇలా వచ్చి, నాలుగు డైలాగ్స్ చెప్పి అలా వెళ్ళిపోతుంటుంది. వాళ్ళకు వాళ్ళు ఇదో కామెడీ సినిమా అనుకుని, కథ రాసేసుకుని, నిర్మాతను మెప్పించేసి మూవీ చేసేసినట్టుగా ఉంది. తలా తోక లేని ఇలాంటి కథను అసలు సినిమాగా తీసి, ప్రేక్షకులను మెప్పించగలమని ఏడిద శ్రీరామ్ ఆయన కుమార్తె శ్రీజ ఎలా అనుకున్నారో అర్థమే కాదు.

ఈ సినిమాకు సంబంధించి సెల్లింగ్ ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది అనుదీప్ కేవీ పేరు మాత్రమే. ‘జాతిరత్నాలు’కు ముందు అతనో ఫ్లాప్ మూవీ కూడా తీశాడనే విషయాన్ని నిర్మాతలు మర్చిపోయినట్టున్నారు. ‘జాతిరత్నాలు’ సూపర్ హిట్ అయ్యింది కాబట్టి అతనిచ్చిన స్టోరీని, అతని గైడెన్స్ లో తీసేస్తే హిట్ అవుతుందనే గుడ్డి నమ్మకమే ఇందులో మనకు కనిపిస్తోంది. అనుదీప్ శిష్యులు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ ఇద్దరూ కలిసి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. వారి దర్శకత్వ ప్రతిభ ఏ ఒక్క సన్నివేశంలోనూ మనకు బూతద్దంలో చూసినా కనిపించదు. చనిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి, శవం దగ్గర సినిమా పాటను పాడటం… అదో కామెడీ అని డైరెక్టర్స్ భావించడం కంటే దారుణం ఇంకోటి ఉండదు. ఈ సినిమాలో ఇలాంటి అతి చేష్టలు చాలానే ఉన్నాయి. అనుదీప్ కేవీనే నమ్ముకున్నారు కాబట్టే కావచ్చు… అతనితోనూ ఓ గెస్ట్ రోల్ చేయించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఈ సినిమా నచ్చుతుందని నిర్మాతలు ఒకవేళ భావించి ఉంటే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇందులో ఆ ఫ్యాన్స్ ను కూడా పనీపాటలేని, చవట దద్దమ్మలుగానే చూపించారు. పరోక్షంగా అలాంటి తిట్లే తిట్టారు.

హీరోహీరోయిన్లు శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసులో గొప్ప నటన ఏదీ మనకు కనిపించదు. కొంతలో కొంత రిలీఫ్ ఇచ్చేది ‘వెన్నెల’ కిశోర్ పోషించిన రవన్న పాత్ర మాత్రమే! ఇతర ప్రధాన పాత్రలను తనికెళ్ళ భరణి, సీవిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్ (దర్శకుడు కూడా), రామకృష్ణ, శ్రీనివాసరెడ్డి, ప్రభాస్ శ్రీను, మహేశ్‌ ఆచంట, గంగవ్వ తదితరులు పోషించారు. రథన్ సంగీతం, ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ ఓకే! నిర్మాణ విలువలు గొప్పగా ఏమీలేవు. బడ్డీ కొట్టులో వారపత్రికల బదులు కవర్ పేజీలతో మేనేజ్ చేసేశారు. లిప్ సింక్ కూడా సరిగా చూసుకోలేదు. కథను కాకుండా అనుదీప్ ను నమ్ముకుని ఈ సినిమా తీసినట్టుంది తప్పితే, ఆడియెన్స్ కు నచ్చుతుందా లేదా అనే ఆలోచన నిర్మాతలు చేయనట్టుగా అనిపించింది. నిజంగా తన తాతగారి పేరును నిలబెట్టాలనో, పూర్ణోదయా సంస్థను జనం మర్చిపోకూడదనో శ్రీజ భావించి ఉంటే… ఇలాంటి చిత్రాల జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది!

రేటింగ్: 1/5

ప్లస్ పాయింట్
అనుదీప్ కథనివ్వడం!

మైనెస్ పాయింట్
అనుదీప్ ను మాత్రమే నమ్ముకోవడం!

ట్యాగ్ లైన్: ఫ్లాప్ షో!