NTV Telugu Site icon

Aavesham Review: షెకావత్ సార్ ‘ఆవేశం’ రివ్యూ

Aavesham Review

Aavesham Review

Aavesham Movie Review: ఈ ఏడాది మలయాళ సినీ పరిశ్రమ నుంచి వస్తున్న దాదాపు చాలా సినిమాలు సూపర్హిట్లుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే వాటిలో కొన్నింటిని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఫహద్ ఫాసిల్ హీరోగా ఆవేశం అనే ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది ఓటీటీలో రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న రోమాంచం అనే సినిమా డైరెక్ట్ చేసిన జిత్తు మాధవన్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా చెప్పబడుతున్న ఈ సినిమాని ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ – అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నజ్రియా నజీమ్ – అన్వర్ రషీద్ నిర్మించారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించగా, హిప్‌స్టర్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాస్, మిధుట్టి, సజిన్ గోపు మరియు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం సుశిన్ శ్యామ్ అందించగా, సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ సమీర్ తాహిర్ మరియు వివేక్ హర్షన్ నిర్వహించారు. ₹20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ మలయాళ సినిమా రివ్యూని తెలుగులో మీకు అందిస్తున్నాం.

ఆవేశం కథ:
తెలుగు రాష్ట్రాలలోని యూత్ చాలావరకు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాలకు వెళ్లి ఎలా అయితే చదువుకుంటారో కేరళకు చెందిన యూత్ ఎక్కువగా బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటూ ఉంటారు. అలా బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేందుకు కేరళకు చెందిన బిబి(మిథున్ జెఎస్), శాంతన్(రోషన్ షానవాస్‌), అజు(యూట్యూబర్ హిప్‌స్టర్) వస్తారు. ముందే పరిచయం లేకపోయినా అక్కడికి వెళ్ళాక బాగా క్లోజ్ అయిపోతారు. అనుకోకుండా ర్యాగింగ్ బారిన పడి తీవ్ర అవమానానికి గురవుతారు. అయితే లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇలా అయిందని భావించి లోకల్ లో ఉండే ఒక దాదానో, గుండానో మనకి సపోర్టుగా ఉంటే అంతా బాగుంటుంది అని అలాంటి ఒక వ్యక్తి కోసం బార్లలో వైన్ షాప్ లలో వెతుకుతూ ఉంటారు. అక్కడే వారికి మలయాళీ అయిన లోకల్ గుండా రంగ (ఫహద్ ఫాసిల్) పరిచయం అవుతాడు. నెమ్మదిగా అతనితో పరిచయం పెంచుకొని తమని ర్యాగింగ్ చేసి తీవ్ర అవమానానికి గురయ్యేలా చేసిన కుట్టి అండ్ గ్యాంగ్ పని పడతారు. ఈ గోలలో పడి సబ్జెక్టులని ఫెయిల్ అవ్వడంతో కాలేజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గూండాలతో తిరిగితే కాలేజీ నుంచి పంపించేస్తానని వార్నింగ్ ఇస్తాడు. అయితే ఒకపక్క రంగాతో పరిచయం అనూహ్యమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఏ రంగా అయితే తమని అవమానించిన వాళ్ళని కొడతాడని స్నేహం చేశారో అదే రంగా వీరిని చంపాల్సి వచ్చేలా పరిస్థితులు ఏర్పడతాయి. అయితే అసలు రంగా వీరిని ఎందుకు చంపాలనుకుంటాడు? వీళ్లు చదువులు పాసయ్యారా లేదా? చివరికి రంగా వీళ్ళని ఏం చేశాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
బెంగుళూరులోని ఓ కాలేజీలో చదువుకోవడానికి వచ్చిన ముగ్గురు మలయాళీ విద్యార్థుల సమస్యలో రంగ అనే ఒక రౌడీ జోక్యం చేసుకోవడం, ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ సినిమా. కాలేజీలో మొదలయ్యే సమస్యలు విద్యార్థుల వ్యక్తిగత జీవితాల వరకు పాకడంతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. కాలేజీ హాస్టల్‌లో చిన్న చిన్న జోకులతో సాగే ఈ సినిమా రంగ అండ్ అతని గ్యాంగ్ ఎంట్రీతో కలర్‌ఫుల్‌గా మరియు ఉత్సాహంగా మారుతుంది. రంగ ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? అతని ప్రత్యర్థులు ఎవరో చెబుతూ సినిమా సాగుతుంది. అలా ముగ్గురు మలయాళీ కుర్రాళ్ళకి చెబుతున్నట్టుగానే మనకి రంగా లైఫ్ మొత్తం చెబుతూ ఉంటారు. తొలి సినిమా రోమంచంతోనే తనదైన ముద్ర వేసిన జిత్తు మాధవన్ రెండో సినిమాలోనూ తన క్రాఫ్ట్‌ని బయటపెట్టాడు. ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్కంఠతో కూడిన ఫుల్ మీల్స్ లాంటి సినిమాను మలయాళ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. యువత ఎనర్జీ లెవెల్‌కి తగ్గట్టుగా వారి వైబ్‌కి అనుగుణంగా రూపొందించిన సినిమా ఇది. కామెడీ, యాక్షన్ కలగలిపిన ఈ సినిమా థియేటర్‌లో చూడాల్సిన సినిమా. మన రొటీన్ సినిమాల ఫైట్ సీన్స్ కి భిన్నంగా ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే పోరాట సన్నివేశాలు, క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 100 మందిని చంపే సీన్ చాలా సినిమాల్లో ప్రజెంట్ చేసినా.. ఈ సినిమాలో సీన్ మాత్రం హైలైట్. ఫస్ట్ హాఫ్ ఎలాంటి ల్యాగ్ లేకుండా కామెడీ తర్వాత కామెడీతో చక్కగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంత లాగ్ అనిపిస్తుంది. చాలా సీన్స్ అనవసరం అనిపించినా సేఫ్ క్లైమాక్స్ తో సినిమా ముగుస్తుంది. నిజానికి యూత్ నే టార్గెట్ గా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. 15 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులను ఉద్దేశించి తీసిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా మెప్పించవచ్చు.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఫహద్ ఫాజిల్ – ఫాఫా ట్యాగ్ లైన్‌ని మళ్లీ పరిచయం చేస్తూ చేసిన ఈ సినిమా అయన కెరీర్ లోనే ఒక మెల్ స్టోన్. సైకో లాంటి డాన్ పాత్రలో జీవించాడు. మొదటి షాట్ నుండి చివరి షాట్ వరకు అదే ఎనర్జీ. విపరీతమైన హైపర్‌గా ఉండటంతో, నెక్స్ట్ మినిట్ ఏమి చేస్తాడో అనే ఉత్సుకతతో ప్రేక్షకులను టెన్షన్ పెట్టాడు. ఇక ఫైట్ సీన్స్ లో రెచ్చిపోయాడు. లౌడ్ డైలాగ్ డెలివరీ,మాస్ మ్యానరిజమ్స్ పాత్రకు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. ఇక రంగ కుడిభుజంగా నటించిన సజిన్ కూడా రెచ్చిపోయి నటించాడు. చాలా సీన్స్‌లో ఫహద్‌ని కూడా మించిపోయేలా సజిన్ మెరిశాడు. సజ్జన్ సిట్యుయేషనల్ కామెడీ థియేటర్లో అందరినీ నవ్విస్తుంది. మలయాళీ గేమర్ – యూట్యూబర్ హిప్‌స్టర్, మిథున్ జెఎస్ మరియు రోషన్ షానవాస్‌ లు ముగ్గురూ చితకొట్టేశారు. అమ్మగా తంగం మోహన్‌ పాత్రను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రంగ – ఈ అమ్మ పాత్ర మధ్య ఫోన్ సంభాషణలు ఒకేసారి నవ్వు తెప్పిస్తూనే ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఇక మన్సూర్ అలీఖాన్, ప్రమోద్ వెలియనద్, ఆశిష్ విద్యార్థి, పూజా మోహన్‌రాజ్, నీరజా రాజేంద్రన్ మరియు శ్రీజిత్ నాయర్ కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నీకల్ టీం విషయానికి వస్తే కనుక సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా నైట్ సీన్స్ లో కేర్ తీసుకున్నాడు. సుశీన్ శ్యామ్ – పాటలు, నేపథ్య సంగీతం సీన్స్ ను ఎలివేట్ చేసేలా ఉన్నాయి. ప్రారంభం నుండి చివరి వరకు ప్రేక్షకులను రోలర్ కోస్టర్ రైడ్ లూప్‌లోకి తీసుకువెళ్లినట్లుగా ఉంటుంది. సుశిన్ తన గత చిత్రాలలో లాగానే చాలా సన్నివేశాలను తన సంగీతంతో ఎలివేట్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్ విషయంలో ఎడిటింగ్ టేబుల్ మీద కొంత కత్తెరకు పని చెప్పాల్సింది.

ఓవరాల్ గా ఈ ఆవేశం సినిమా కమర్షియల్ ఫార్ములాలోనే వెళుతూ అలరించే యాక్షన్ కామెడీ. ఫ్రెండ్స్ గాంగ్ తో కలిసి చూస్తే భీభత్సంగా ఎంజాయ్ చేసే మూవీ.