NTV Telugu Site icon

Extra Ordinary Man Review : ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ రివ్యూ

Extra Ordinary Man

Extra Ordinary Man

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేశాడు. లక్కీ హీరోయిన్ అని తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలు ఏర్పడేలా చేసింది. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం రండి.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కథ ఏమిటంటే:

హైదరాబాద్ లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అభి(నితిన్) తన తల్లితండ్రలిద్దరి(రావు రమేష్, రోహిణి)తో కలిసి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తూ ఉంటాడు. జీవితంలో ఎప్పటికైనా ఒక మంచి నటుడు అవ్వాలని ప్రయత్నిస్తున్న అభినవ్ ఒక పెద్ద కంపెనీకి చైర్మన్ అయిన లిఖిత(శ్రీ లీల)తో ప్రేమలో పడతాడు. తండ్రికి యాక్సిడెంట్ కావడంతో లిఖిత కంపెనీలో ఉద్యోగానికి జాయిన్ అవుతాడు. ఇక ఒక సినిమాలో హీరో అవకాశం రావడంతో ఆ ఉద్యోగం మానేయడం వలన ప్రేమకు దూరం అవడమే కాక తండ్రితో గొడవ కూడా పడతాడు. ఇక ఆ సినిమా డైరెక్టర్ మోసం చేయడంతో బాధలో పడ్డ అభినవ్ అనుకోకుండా ఒక విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకుంటాడు. ఒక ఊరు మొత్తాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న నీరో అలియాస్ నిరంజన్(సుదేవ్ నాయర్)తో దొంగ పోలీసుగా మారి తలపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఐజీ విజయ్ చక్రవర్తి(రాజశేఖర్) ఏం చేశాడు? చివరికి లిఖిత, అభి ఒక్కటయ్యారా? అసలు ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఎలా అయ్యాడు అనేది తెలియాలి అంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:

రచయితగా ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చిన వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అంతా సీరియస్ టోన్ లో సాగుతూ ప్రేక్షకులను అలరించలేక పోయింది. ఈ క్రమంలో ఆయన చాలా గ్యాప్ తీసుకుని చేసిన ఈ సినిమా మీద అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే నితిన్ కి సరైన హిట్ లేదు, వంశీకి సరైన హిట్ లేదు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అది కూడా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ అనగానే ఆ అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా సంగతి మాట్లాడితే ఇది కొత్త కథ ఏమీ కాదు, సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులను కన్ఫ్యూజ్  చేయడానికి ప్రయత్నిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా ఓపెనింగ్ లోనే ఒక మంచి ఛేజింగ్ సీన్ తో మొదలు పెట్టి హీరో చేత హీరో కథ చెప్పించడం మొదలు పెట్టి కాస్త సినిమా మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. ఇక ఈ సినిమా మొదలు అయినప్పటి నుంచి ఒక పక్క సీరియస్ గా కథ చెబుతూనే మరో పక్క కామెడీ చేయిస్తూ వచ్చారు. నిజానికి నితిన్, రావు రమేష్, రోహిణి, కమెడియన్ పృథ్వీ, బ్రహ్మాజీ, హైపర్ ఆదిల కామెడీ బాగానే వర్క్ అవుట్ అయినప్పటికీ కొన్ని చోట్ల కాస్త ఓవర్ అనిపిస్తుంది. అయితే డైలాగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి కనెక్ట్ అయ్యేలా రాసుకున్నాడు డైరెక్టర్ వంశీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా కథ కొత్తది ఏమీ కాదు కానీ మనకు అలవాటైన కథనే కొంత ట్విస్ట్ చేసి చెప్పే ప్రయత్నం చేశారు, అయితే అది వికటించకుండా కామెడీ మందు పూశారు, అది కొంత వరకు వర్కౌట్ అయింది. అయితే సెకండ్ హాఫ్ వరకు కథ మీద మనకు ఒక అవగాన రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నా సెకండ్ హాఫ్ మొదలయినప్పటి నుంచి రొటీన్ ఫీలింగ్ కలుగుతుంది. సినిమాకి లాజిక్స్ కి చాలా దూరం, ఒక ఊరి కోసం ఎలాంటి సంబంధం లేని హీరో వెళ్ళడం, అక్కడి వారి కోసం నాటకం ఆడడం ఇవన్నీ రొటీన్ అయినా దానికి ఎంచుకున్న రీజన్ కొత్తగా ఉంది, అయితే అది అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఇక హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి కొన్ని సీన్లు పెట్టుకుని ఉంటే బాగుండేది. చూసిన వెంటనే ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ కలగాలన్నా ఏదో ఒక మేజిక్ అవసరం ఆ మేజిక్ మిస్ అయింది. ఇక హీరో బ్యాక్ గ్రౌండ్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసిన డైరెక్టర్ విలన్ ను ఒక క్రూరుడిగా చూపించారు కానీ అతని బ్యాక్ గ్రౌండ్ ను ఏ మాత్రం ఎస్టాబ్లిష్ చేయలేక పోయారు. కొన్ని కామెడీ సీన్స్ కనెక్ట్ అయ్యేలా ఉన్నా కొన్ని మాత్రం ట్రోల్ మెటీరియల్ అనిపిస్తాయి. అయితే శ్రీ లీల ఇంట్లో నితిన్ డ్యాన్సింగ్ సీన్, పోలీస్ స్టేషన్ సీన్స్ కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. మొత్తంగా లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే కొందరికి నచ్చవచ్చు.

ఎవరెలా చేశారు అనే విషయానికి వస్తే ముందుగా నటీనటుల గురించి మాట్లాడుకుందాం హీరోగా నితిన్ ఈ సినిమాకి సరిగ్గా సూట్ అయ్యాడు. నితిన్ కోసమే ఈ క్యారెక్టర్ ను రాశానని చెప్పిన డైరెక్టర్ మాటలు విని నిజమే అనిపించింది. ఎందుకంటే నితిన్ టైమింగ్, కామెడీ సరిగ్గా నప్పాయి. హీరోయిన్ గా శ్రీ లీల కూడా ఫర్వాలేదు, అయితే ఆమెది అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర ఏమీ కాదు. అయితే ఏమీ తెలియకుండానే, పెద్దగా బుర్ర వాడకుండానే కొన్ని వందల కోట్ల విలువైన కంపెనీ నడిపే తింగరబుచ్చి పాత్రలో ఒదిగిపోయింది. ఆమె పాత్ర ఆమె చివరి సినిమా ఆదికేశవ లోని పాత్రను పోలి ఉండడం గమనార్హం. రాజశేఖర్ కి రీ ఎంట్రీ అన్నట్టు ప్రచారం జరిగినా ఆ స్థాయి పాత్ర అయితే కాదు. ఉన్నంతలో ఆయన తన అనుభవానికి తగ్గట్టు నటించాడు. ఇక ఈ మధ్య తెలుగు సినిమాల్లో మెరుస్తున్న సుదేవ్ నాయర్ నీరో పాత్రలో భలే నటించాడు, డబ్బింగ్ కూడా మేనేజ్ చేసి ఉంటే బాగుండేది. ఇక రావు రమేష్ కి మంచి పాత్ర పడింది. రోహిణి, బ్రహ్మాజీ, హైపర్ ఆది, సత్య శ్రీ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే మ్యూజిక్ విషయంలో పాటలు అన్నీ ఆకట్టుకోకపోయినా కొన్ని మాత్రం బాగున్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రాఫర్ ఒక పక్కా కమర్షియల్ సినిమాకు ఎలాంటి కలర్స్ వాడాలో అవి పర్ఫెక్ట్ గా వాడాడు. ఇక డైలాగ్స్ మాత్రం ఒక రేంజ్ లో పేలాయి, ముఖ్యంగా కామెడీ సీన్స్ లో. కథకు డ్యామేజ్ కాకుండా ఎడిటింగ్ టేబుల్ మీద కొంత నిడివి తగ్గించి ఉంటే బాగుండేది.

ఫైనల్లీ: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా కామెడీ సినిమాలు ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.