NTV Telugu Site icon

Doctor strange Review: డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్

Doctors

Doctors

మార్వెల్ కామిక్స్ తెరకెక్కిస్తోన్న సూపర్ హీరోస్ మూవీస్ కు ప్రత్యేకమైన అభిమానులున్నారు. వారిని 2016లో రూపొందిన సూపర్ హీరో మూవీ ‘డాక్టర్ స్ట్రేంజ్’ భలేగా అలరించింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ చిత్రం 2022 మే 6న విడుదలయింది.

‘డాక్టర్ స్ట్రేంజ్’ చిత్రం చూసిన వారికి ఈ ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ బాగా అర్థమవుతుంది. లేదా మార్వెల్ కామిక్స్ ఫాలో అయ్యేవారికి మాత్రమే ఈ సినిమాలోని కథాంశం బోధపడుతుంది. ఇందులో భారతీయ పురాణాల్లో తరచూ వినిపించే పర లోకాలు, అలాగే బుద్ధిజమ్ లోని పునర్జన్మలు కూడా ఈ కథలో చోటు చేసుకున్నాయి. వీటితో పాటు బైబిల్ లోని దైవత్వం – పైశాచికత్వం వంటి అంశాలూ కలగలసి ఉన్నాయి. వీటిలో బాగా ప్రావీణ్యం ఉన్నవారికి మాత్రమే ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ కథలోని అసలు విషయం బోధపడుతుంది. లేదంటే కేవలం విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాగా అనిపిస్తుంది. ఇందులో గ్రాఫిక్స్ మాయాజాలమే కాదు, యాక్షన్, మదర్ సెంటిమెంట్, లవ్ అన్నీ మిళితమయ్యాయి. ఓ లోకం నుండి తన లోకంలోకి వచ్చిన అమ్మాయిని ఓ దుష్టశక్తి అంతమొందించాలని భావిస్తుంది. ఆమె ఏ లోకం వెళ్ళినా తరుముతూ ఉంటుంది. ఆమెను డాక్టర్ స్ట్రేంజ్ ఎలా రక్షించాడు అన్నదే కథ.

గతంలో క్రిస్టఫర్ నోలాన్ తెరకెక్కించిన ‘ఇన్ సెప్షన్’ సినిమా తొలుత చాలామందికి అర్థం కాలేదు. పదే పదే చూశాకే, అందులోని “స్వప్నసిద్ధాంతం’ బోధ పడింది. ఈ స్పీడ్ యుగంలో ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ పదే పదే చూసేంత ఓపిక నవతరం ప్రేక్షకులకు లేదు మరి. డాక్టర్ స్టీఫెన్ స్ట్రేంజ్ గా బెనడిక్ట్ కుంబర్ బ్యాచ్ ఈ సారి కూడా అలరించారు. వండా, స్కార్లెట్ గా ద్విపాత్రాభినయం చేసిన ఎలిజబెత్ ఓల్సన్ తనదైన అభినయంతో పైచేయి సాధించింది. అమెరికా ఛావెజ్ గా నటించిన జోచిటి గోమెజ్ తన పాత్రలో ఒదిగిపోయింది. కథనంలో పలు అంశాలు చొప్పించడం వల్ల ప్రేక్షకునికి కంగాళీ అనిపిస్తుంది. ‘డాక్టర్ స్ట్రేంజ్’ మొదటి భాగం చూడని వారికి మరింత చికాకు కలిగిస్తుంది. మొదటి భాగం కంటే ఈ ద్వితీయ భాగంలో విజువల్ ఎఫెక్ట్స్ బాగా అలరిస్తాయని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్:
– మార్వెల్ కామిక్స్ మూవీ కావడం
– ‘డాక్టర్ స్ట్రేంజ్’ సీక్వెల్ అవ్వడం
– విజువల్ ఎఫెక్ట్స్

మైనస్ పాయింట్స్:
– కలగాపులగమైన కథనం
– అర్థం కాని సైకాలజీ అంశాలు

రేటింగ్: 2.75/ 5

ట్యాగ్ లైన్ : డాక్టర్ మాయాజాలం!