NTV Telugu Site icon

Dirty Fellow Review: డర్టీ ఫెలో రివ్యూ

Dirty Fellow Review

Dirty Fellow Review

Dirty Fellow Movie Review: ఇండియన్ నేవీలో పని చేసిన శాంతి చంద్ర హీరోగా నటించిన మూవీ ‘డర్టీ ఫెలో’. పేరుతోనే అందరినీ ఆకర్షించిన ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమా మీద ఆసక్తి ఏర్పడేలా చేసింది. ఈ క్రమంలో ఈ సినిమా నేడు(మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ
ఇద్దరు స్నేహితులు మాఫియా డాన్‌ జేపీ (నాగినీడు), శంకర్ నారాయణ (సత్య ప్రకాష్) సెటిల్‌మెంట్స్‌ చేస్తుంటారు. అయితే మరో స్నేహితుడి సలహాతో జేపీని తప్పిస్తే తనే మాఫీయా డాన్‌గా ఉండొచ్చని భావించి శంకర్‌ నారాయణ జేపీని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. అయితే పోలీసులు ఇద్దరినీ రౌండప్ చేసిన క్రమంలో అనుకోకుండా శంకర్‌ నారాయణ కొడుకు చనిపోతాడు. దీంతో శంకర్‌ నారాయణ జేపీపై పగ పెంచుకుని ఎప్పటికైనా నీ కొడుకుని తానే చంపుతానని జేపీకి వార్నింగ్‌ ఇస్తాడు. కట్‌ చేస్తే.. సిద్దు(శాంతి చంద్ర) ఓ గూడెంలో పూజారి ఇంట్లో ఉండి అక్కడి పిల్లలకు చదువు చెబుతూ కాలం గడుపుతాడు. పూజారి కూతురు రాగ (దీపికా సింగ్) సిద్దుని ఇష్టపడుతుంది కానీ అదే గ్రామానికి వ్యవసాయ పరిశోధన అంటూ చిత్ర (సిమ్రితి) వస్తుంది. ఆ గూడెం, ఆ అటవీ ప్రాంతాన్ని శంకర్ నారాయణ మనిషి పోతురాజు(కుమనన్) తన గుప్పిట్లో పెట్టుకుని గంజా వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే పోతురాజుని సిద్దు హతమార్చేస్తాడు. దీంతో సిద్దు, డర్టీ ఫెల్లో ఒక్కరే అని శంకర్ నారాయణకి తెలుసుంది. అయితే షాకిచ్చేలా సిద్దుని చిత్ర షూట్ చేస్తుంది? ఆ తరువాత ఏమైంది? డర్టీ ఫెల్లో, సిద్దు ఒకరేనా? శత్రు ఎవరు? శత్రుకి డర్టీ ఫెల్లోకి, సిద్ధూకు సంబంధం ఏంటి? చిత్ర ఎందుకు షూట్ చేసింది? శంకర్ నారాయణ చివరకు ఏం చేశాడు? అనేది థియేటర్లో చూడాల్సిందే.

విశ్లేషణ
మాఫియా నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు రాగా ఈ డర్టీ ఫెలో కూడా ఆ కోవకే చెందుతుంది. అయితే ఇందులో దానికి కాస్త రొమాంటిక్ టచ్ ఇస్తూనే మరో పక్క ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా యాడ్‌ చేయడంతో కాస్త భిన్నంగా అనిపిస్తుంది. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ల్యాగ్ అనిపించదు. మూవీ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రీన్ ప్లేని కాస్త కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంది. యాక్షన్‌, ఎమోషన్స్‌, రొమాన్స్‌తో ఫస్టాఫ్‌లో కథనం ఫాస్ట్‌గా సాగుతుండగా సినిమా మొదట్లో డర్టీ ఫెలోని పరిచయం చేసి ఆ తర్వాత సిద్దు పాత్ర చుట్టూ కథను నడించాడు దర్శకుడు. దీంతో అసలు సిద్దు, డర్టీ ఫెలో ఒకరానా కాదా? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగేలా చేయడంలో సఫలం అయ్యాడు. చిత్ర పాత్రను కూడా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లా మార్చాడు. ఇక సెకండాఫ్‌లో మాఫియా డాన్‌ ‘డర్టిఫెలో’ చుట్టే కథనం సాగుతుంది. ఇక క్లైమాక్స్‌లో జేపీ ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని నడిపించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.
నటీనటుల విషయానికి వస్తే సిద్దు, డర్టీ ఫెలొ పాత్రల్లో శాంతి చంద్ర చాలా ఈజ్ తో నటించాడు. రెండు కారెక్టర్ల మధ్య వేరియేషన్స్‌ను కూడా చక్కాకా పలికించాడు. యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఇక నాగినీడు చాలా రోజుల తరువాత లెంగ్తీ పాత్రతో మెప్పించాడు. సత్య ప్రకాష్ విలనిజం చాలా రోజులకు మళ్లీ తెరపై ఫుల్ లెంత్ లో కనిపించింది. పోతురాజుగా కుమనన్ ఇరగదీశాడు. దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ ముగ్గురూ కూడా తెరపై అందంగా కనిపించగా సిమ్రిత్ కి నటనకు స్కోప్ దక్కింది. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమా పర్వాలేదు. డాక్టర్‌. సతీష్‌ కుమార్‌ సంగీతం బాగుంది. చాలా పాటలు వినడానికి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, అలాగే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడినట్టు అనిపించలేదు.

ఫైనల్లీ ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే యాక్షన్ లవర్స్ కి సినిమా నచ్చొచ్చు.