NTV Telugu Site icon

Demonte Colony 2 Review : డిమాంటి కాలనీ 2 సినిమా భయపెట్టిందా? లేదా?

Demonte Colony

Demonte Colony

Demonte Colony 2 Review in Telugu: డిమాంటి కాలనీ సినిమా గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2015లో విడుదలైన సినిమా తమిళంలోనే కాదు తెలుగులో కూడా బాగా ఆడింది 9 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వల్గా డిమాంటి కాలనీ 2 ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆగస్టు 15వ తేదీన తమిళంలో రిలీజ్ అయిన సినిమా తంగలాన్ తో పోటీ పడుతూ కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాని తెలుగులో ఒక వారం లేటుగా రిలీజ్ చేస్తున్నారు. 23వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి మూడు రోజులు ముందే స్పెషల్ ప్రీమియర్ వేశారు. తమిళ్లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎలా అనిపించింది? అనే వివరాలు రివ్యూలో చూద్దాం పదండి.

డిమాంటి కాలనీ 2 కథ:

ఆరేళ్ల క్రితం సూసైడ్ చేసుకుని మరణించిన తన భర్త సామ్ (సర్జనో కాళిద్) ఎలా చనిపోయాడో అంతుపట్టక ఇబ్బంది పడుతూ ఉంటుంది డెబీ (ప్రియ భవాని శంకర్). అతని ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేసిన సమయంలో అతను లైబ్రరీలో చదివిన ఒక పుస్తకం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం తెలుస్తుంది. అంతేకాక ఆరేళ్లకు ఒకసారి ఒక బ్యాచ్ మొత్తాన్ని పుస్తకం చంపేస్తుంది అనే విషయం తెలిసి దానిని ఆపడానికి ఆమె ప్రయత్నిస్తుంది. సరిగ్గా అదే సమయంలో శ్రీనివాస్(అరుళ్ నిధి) అతని కవల సోదరుడు రఘునందన్(అరుళ్ నిధి) కూడా ఈ పుస్తకం చదివే ప్రయత్నం చేసిన తర్వాత మరణించబోతున్నారని తెలుస్తుంది. అయితే వాళ్లను ఆ మరణాల నుంచి దూరం చేసేందుకు తన మామ రిచర్డ్(అరుణ్ పాండియన్)తో కలిసి ఆమె కొన్ని స్కెచ్ లు వేస్తుంది. అయితే ఆమె స్కెచ్ లు ఫలించి వాళ్లు బతికారా? లేదా? వాళ్లను టిబెట్ నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు ఏ మేరకు కాపాడే ప్రయత్నం చేశారు? అసలు డిమోంటి కాలనీలోకి మరో అమ్మాయిల బ్యాచ్ ఎలా ప్రవేశించింది? చివరికి డెబి ప్రయత్నం ఎంతవరకు ఫలించింది? ఆమె శ్రీనివాస్, రఘునందన్లను కాపాడిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. 

డిమాంటి కాలనీ 2 విశ్లేషణ 

నిజానికి తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టమైన జానర్లలో ఈ హారర్ జానర్ కూడా ఒకటి. గతంలో తమిళం అలాగే హిందీ భాషల్లో హిట్ అయిన ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించిన దాఖలాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాని వారం లేట్ అయినా సరే ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే ఈ సినిమా మొత్తాన్ని చూడాలంటే డిమాంటి కాలనీ మొదటి భాగాన్ని కూడా చూసి ఉండాలి. నిజానికి సినిమా మొదలైనప్పుడే మొదటి భాగంలో ఏం జరిగిందనేది కొంత చూపించే ప్రయత్నం చేశారు కానీ సినిమా మొత్తం చూస్తేనే అసలు మొదటి భాగంలో ఏం జరిగిందో అర్థం అవుతుంది. ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతి 20 నిమిషాల నుంచి అరగంటలో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను షాక్ ఇస్తూనే వచ్చాడు డైరెక్టర్. మొదటి భాగంలో లేని ఒక కుటుంబాన్ని రెండో భాగంలోకి తీసుకొచ్చి రెండు కథలను మిక్స్ చేసిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టేలా ఉంది. సినిమా మొదటి భాగం చూడని వాళ్ళు కూడా రెండో భాగాన్ని అర్థం చేసుకునేలాగే తెరకెక్కించారు కానీ చూస్తే ఇంకా పర్ఫెక్ట్ గా అర్థమయ్యేలా ఉంటుంది. అయితే తమిళంలో సూపర్ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా మీద భారీ అంచనాలతో థియేటర్లలోకి వెళితే కాస్త నిరాశపడతారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళితే మాత్రం కాస్త ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భలే నిలబెట్టింది. నిజానికి ఒకటి రెండు సందర్భాలలో ఒళ్ళు గగుర్పొడిచేలా సీన్స్ ఉన్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే మొదటి సినిమాతో పోలిస్తే ఈ రెండవ పార్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా పెరిగినట్టు అనిపించింది. ముఖ్యంగా ప్రతి ఫ్రేమ్ ని కలర్ ఫుల్ గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ కూడా సక్సెస్ అయ్యాడు. సాధారణంగా హారర్ సినిమా అనగానే కాస్త డార్క్ బ్యాక్ డ్రాప్ లో చూపించే ప్రయత్నం చేస్తారు కానీ ఇది మాత్రం ఫుల్ లెన్త్ కలర్ ఫుల్ గానే అనిపించింది. అయితే గ్రాఫిక్స్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇక క్లైమాక్స్ విషయంలో తీసుకున్న కేర్ భలే ఆసక్తి రేకెత్తించేలా ఉంది. రొటీన్ క్లైమాక్స్ అనిపించకుండా మూడవ పార్ట్ కి ఇచ్చిన లీడ్ వెంటనే మూడో పార్ట్ చూసేయాలనిపించేలా ఉంది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గినట్టు అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా ట్రిక్కీగా ప్లాన్ చేసుకోవడం కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. 

నటీనటుల విషయానికి వస్తే అరుళ్ నిధి రెండు పాత్రలు చేశారు. రెండు పాత్రలలో లుక్స్ మధ్య వేరియేషన్స్ చూపించారు. కానీ నటన మనల్ని కన్ఫ్యూజ్ చేసేలా ఉంది. ప్రియ భవాని శంకర్ నటిగా ఎప్పుడో సత్తా చాటింది ఇప్పుడు గ్లామరస్ పాత్ర కాకుండా కాస్త నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. ఇక అరుణ్ పాండ్యన్ సహా మిగతా పాత్రలు చేసిన వారందరూ తమ తమ పాత్రలు పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బౌద్ధ బిక్షువులుగా కనిపించిన వాళ్ళు ఆకట్టుకునేలా నటించారు. 

ఫైనల్ గా చెప్పాలంటే ఇది ఒక మాంచి హారర్ థ్రిల్లర్.. ఆ జానర్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా ఎక్కేస్తుంది.

Show comments