NTV Telugu Site icon

Darshini Review : దర్శిని రివ్యూ.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Darshini Movie

Darshini Movie

Darshini Movie Review : ఈ మధ్య కాలంలో అన్ని భాషల్లో థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్న క్రమంలో ఇలాంటి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు కూడా వికాస్, శాంతిప్రియ జంటగా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో వి4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ LV సూర్యం నిర్మాతగా ‘దర్శిని’ అనే సినిమా తెరకెక్కింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుందని టీజర్, ట్రైలర్ తో క్లారిటీ వచ్చింది. ఇక టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులలో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. అలా అంచనాలు ఏర్పడేలా చేసిన ఈ దర్శిని సినిమా మే 17న థియేటర్స్ లో రిలీజయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంది? అనేది రివ్యూలో చూద్దాం.

‘దర్శిని’ కథ:
సంతోష్(వికాస్), ప్రియ(శాంతిప్రియ), లివింగ్ స్టోన్(సత్య) ఫ్రెండ్స్. ముగ్గురూ కలిసి కొన్ని రోజులు వెకేషన్ కోసం డాక్టర్ దర్శిని అనే సైంటిస్ట్ కి చెందిన ఫామ్ హౌస్ కి వెళ్తారు. అక్కడ అన్ని రూమ్స్ చూస్తుండగా ఓ రూమ్ లో పెన్ సెన్సార్ ద్వారా భవిష్యత్తు చూస్తారు. అయితే అనుకోకుండా డాక్టర్ దర్శిని శవం అయి కనిపిస్తుంది. అయితే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ని ఎవరో ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటారు. అసలు దర్శిని ఎలా చనిపోయింది? భవిష్యత్తు మిషన్ లో వాళ్లు ఏం చూశారు? ఈ ముగ్గుర్ని బెదిరించింది ఎవరు? అసలు భవిష్యత్తు మిషన్ కథేంటి? ఎరక్కపోయి ఇరుక్కుపోయిన ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఫామ్ హౌస్ నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది థియేటర్స్ లో చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈమధ్య కాలంలో రొటీన్ కధల కంటే భిన్నంగా ఉండే కథలకే డిమాండ్ ఉంటోంది. అందుకే ఈ సినిమా కథను ఆసక్తికరంగా రాసుకున్నారు మేకర్స్. మామూలుగా సస్పెన్స్ థ్రిల్లర్ కథకి ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ జత చేశారు. భవిష్యత్తు తెలుసుకునే ప్లాట్ తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ సినిమా విషయంలో కూడా దాదాపు అదే జరిగింది. భవిష్యత్తు తెలుసుకునే యంత్రం అంటూ ఒక యంత్రంతో ఆసక్తి కలిగించారు కాన్నీ స్క్రీన్ ప్లే విషయం మాత్రం సాగతీత అనిపిస్తుంది. ఇక ఒక పక్క సైన్స్ ఫిక్షన్ కథతో పాటు ప్రియ – వికాస్ ల మధ్య ప్రేమకథ కూడా ఉంటుంది. ఇంటర్వెల్ కి ముగ్గురు ఫ్రెండ్స్ ని ఎవరో చంపబోతున్నట్టు చూపిస్తూ సెకండ్ హాఫ్ పై ఆసక్తి వచ్చేలా చేశారు. అలా సెకండ్ హాఫ్ కి తీసుకొచ్చి, అక్కడ అసలు ఏం జరుగుతుంది? అనేది ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ వెళ్తారు. అయితే సినిమా చూస్తే సన్నివేశాల విషయంలో కథ కంటిన్యుటీ విషయంలో కొన్ని అనుమానాలు వస్తే అది మీ తప్పు కాదు. తక్కువ క్యారెక్టర్స్ తో మినిమమ్ లొకేషన్స్ లో కథని ఆసక్తికరంగా నడిపిస్తూ భయపెట్టారు. ఓవరాల్ గా సినిమాలో కొన్ని అనుమానాలు కలిగినా, కొన్ని లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో పూర్తి స్థాయిలో సఫలం కాలేదు.

నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో అందరూ కొత్తవాళ్లే కాగా వికాస్, శాంతి ప్రియ హీరోహీరోయిన్లుగా మెప్పించారు. లివింగ్ స్టోన్ కామెడీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రలు తక్కువే అయినా ఆయా పాత్రలను పోషించినవారు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. టెక్నీకల్ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు అనిపించేలా ఉన్నా విజువల్స్ ఇంకొంచెం బాగుంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫర్వాలేదు. చిన్న సినిమా అయినా లిమిటెడ్ బడ్జెట్ లో మంచి రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారు.

ఫైనల్లీ లోపాలను పక్కన పెట్టి చూస్తే ‘దర్శిని’ థ్రిల్లర్ సినిమా లవర్స్ కి నచ్చొచ్చు.