NTV Telugu Site icon

Premalo Review: ప్రేమలో రివ్యూ

Premalo Movie Review

Premalo Movie Review

Premalo Movie Review: చందు కోడూరి హీరోగా, చరిష్మా శ్రీఖర్ హీరోయిన్‌గా డ్రీమ్ జోన్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘ప్రేమలో’ అనే సినిమా తెరకెక్కింది. చందు కోడూరి స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజేష్ కోడూరి నిర్మించారు. సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద ఆసక్తి పెరిగింది ఈ నేపద్యంలో సినిమా జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం.

ప్రేమలో కథ:
రాజమండ్రిలో పుట్టి పెరిగిన రవి (చందూ కోడూరి) చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. భార్య చనిపోవడంతో రవి తండ్రి(శివాజీ రాజా) తాగుడికి బానిస అయిపోతాడు కొడుకు ఉన్నాడో లేడో కూడా చూడకుండా ఒక పక్క తాగుతూ మరొక పక్క డ్రైవర్గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒక మెడికల్ షాప్ లో పనిచేసే రవి ఎప్పటికైనా తాను కూడా ఒక మెడికల్ షాప్ పెట్టుకోవాలని కలలు కంటూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా ప్రశాంతి(చరిష్మా) అనే యువతినీ మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమెతో పరిచయం పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించవు. దీంతో నేరుగా ఆమెను ప్రేమిస్తున్నానని చెబుతాడు. మూగదైన ప్రశాంతి ఇప్పటివరకు జాలి తప్ప ప్రేమ ఎరుగక ఆమెకూడా రవిని ప్రేమిస్తుంది. అంతా బాగుంటుంది అనుకున్న సమయంలో ప్రశాంతి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. అయితే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కారణం రవి ఆమెను రేప్ చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో అని ప్రశాంతి తండ్రి(శ్రీనివాస్ భోగిరెడ్డి) ద్వారా తెలుస్తుంది. అయితే ఆమెను ప్రాణంగా ప్రేమించిన రవి ఎందుకు ఆమెను రేప్ చేశాడు? అసలు నిజంగా రవి ఆమెను రేప్ చేశాడా? రవి ఆమెను రేప్ చేస్తున్నప్పుడు వీడియో తీసింది ఎవరు? అసలు నిజంగా ఏం జరిగింది? సూసైడ్ అటెంప్ట్ చేసిన ప్రశాంతికి ఏమవుతుంది? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ;
తెలుగులో ప్రేమ కధా చిత్రాలు ఎవర్ గ్రీన్ జానర్.. టాలీవుడ్ లో లవ్ స్టోరీ చుట్టూ అల్లుకున్న సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి, వస్తూనే ఉంటాయి. ఈ ప్రేమలో అనే సినిమా కూడా మొత్తం ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. సినిమా ఓపెనింగ్ లోనే ఒక వ్యక్తి మీద ఎటాక్ చేయడం చూపించి ఒక్కసారిగా సినిమాని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అసలు ఏమైంది? ఎందుకు ఒక్కొక్కరిని చేజ్ చేస్తూ హీరో వెళుతున్నాడు అనే అనే విషయం నెమ్మదిగా రివీల్ చేస్తూ కథలోకి తీసుకు వెళ్లే విషయంలో దాదాపు సఫలమయ్యాడు. ఒక్కరొక్కరిగా ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ మొత్తాన్ని చేజ్ చేస్తూ వెళ్లిన హీరో అసలు ఎందుకు చేజ్ చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని రివీల్ చేశాడు డైరెక్టర్. ముందే కథ మొత్తం చెప్పకుండా ఒక్కొక్క క్యారెక్టర్ ని బయట పెడుతూ అసలు కథ ఏమిటి అని ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఫస్ట్ అఫ్ మొత్తంలో హీరో క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసి ప్రేక్షకులను ప్రేమ కథలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అసలు కథ ఏమిటి అని ప్రేక్షకులకు అర్థమవుతుంది. అప్పటివరకు సినిమా ఏదో జరుగుతుంది లే అని భావించిన వారంతా అసలు ఏం జరిగిందో తెలుసుకుని ఒకసారి గా షాక్ అయ్యేలా డైరెక్టర్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. నిజానికి ఇది కొత్త కథ ఏమీ కాదు కానీ రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో పూర్తిస్థాయి గోదావరి యాసలో ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ప్రేమించిన వారి కోసం ఎంత దూరమైనా వెళతాం అని డైలాగులు చెప్పే ప్రేమికులే ఉన్న ఈ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి కోసం చావుకు కూడా వెనకాడకుండా ముందుకు వెళ్లేవారు ఉన్నారని ఒక సినిమాటిక్ టచ్ ఇచ్చి మరీ చెప్పారు. అయితే రొటీన్ కథ, ఊహకి అందేలా ఉన్న సీన్లు కొంత నిరాశ కలిగిస్తాయి. స్క్రీన్ ప్లే విషయంలో మరింత వర్కౌట్ చేస్తే బాగుండేది. అయితే క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టర్.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోగా నటించిన చందు స్వయంగా దర్శకత్వం చేయడం గమనార్హం. అయితే చందులోని నటుడు దర్శకుడిని కొంత డామినేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేక జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్లే యువకుడి పాత్రలో చందు సరిగ్గా సరిపోయాడు. ఇది మొదటి సినిమా అని ఎక్కడ అనిపించకుండా తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ప్రశాంతి పాత్రలో నటించిన చరిష్మా ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా ఆమె కళ్ళతోనే భావాలు పలికించి ఆకట్టుకుంది. శివాజీ రాజా చేసింది అతిధి పాత్ర లాంటిదే అయిన ఉన్నంతవరకు ఎమోషన్స్ పండించాడు. శ్రీనివాస్ భోగిరెడ్డికి ఒక మంచి రోల్ దొరికింది. హీరో స్నేహితుల పాత్రలో నటించిన వారు ఇతర పాత్రలలో నటించిన వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే పాటలు ఉన్నా గానీ ఎందుకు అంత గుర్తుంచుకో తగిన పాటలు ఏవీ లేవు. ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ నాచురల్ గా సినిమాకి సూట్ అయ్యేలా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా బాగా కుదిరాయి. ఎక్కడ ఖర్చుకు వెనుకాడినట్టు అనిపించలేదు.

ఫైనల్ గా: ప్రేమలో ఒక హానేస్ట్ గా పిక్చరైజ్ చేసిన హానెస్ట్ లవ్ స్టోరీ.

చిత్రం పేరు :
బ్యానర్ : డ్రీమ్ జోన్ పిక్చర్స్
నటి నటులు :

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు : చందు కోడూరి
నిర్మాత : రాజేష్ కోడూరి
సంగీతం : సందీప్ కనుగుల
ఎడిటర్ : కోదాటి పవన్ కళ్యాణ్