NTV Telugu Site icon

ButterFly Movie Review: బట్టర్ ఫ్లై (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)

Butterfly

Butterfly

ButterFly Movie Review: ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన ‘రౌడీ బాయ్స్’లో దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్‌ సరసన హీరోయిన్ గా నటించింది అనుపమా పరమేశ్వరన్. నేచురల్ స్టార్ నాని మూవీ ‘అంటే సుందరానికి..’లో ప్రత్యేక పాత్రను పోషించింది. ఈ రెండు సినిమాలు నిరాశ పర్చినా ఆ తర్వాత వచ్చిన ‘కార్తికేయ -2′, ’18 పేజీస్’ చిత్రాలు ఆమెకు చక్కని విజయాన్ని అందించాయి. ఇదే క్రమంలో ఈఏడాది ఆమె ఐదో చిత్రంగా ‘బట్టర్ ఫ్లై’ గురువారం నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అవైలబుల్ గా ఉన్న.. ఈ కిడ్నాప్ డ్రామా ఎలా ఉందో చూద్దాం.

క్రిమినల్ లాయర్ వైజయంతి (భూమిక) చెల్లెలు గీత (అనపమా పరమేశ్వరన్). పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన భర్త (రావు రమేశ్‌)తో గొడవపడి, ఇంటి నుండి బయటకు వచ్చేసి, ఇద్దరు పిల్లలు, చెల్లితో జీవితం గడుపుతుంటుంది వైజయంతి. జడ్జి పోస్ట్ ఇంటర్వ్యూ నిమిత్తం ఆమె ఓ రోజు హైదరాబాద్ నుండి ఢిల్లీకి బయలుదేరుతుంది. వైజయంతి అటు వెళ్ళగానే.. ఇక్కడ ఆమె పిల్లలిద్దరూ కిడ్నాప్ కు గురి అవుతారు. ఢిల్లీ నుండి అక్క తిరిగి వచ్చే లోపు ఎలాగైనా వాళ్ళను తిరిగి తీసుకురావడం కోసం గీత ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ఆ క్రమంలో ఆమెకు బాయ్ ఫ్రెండ్ విశ్వ (నిహాల్ కోదాటి) ఎలా తోడుగా నిలిచాడు? మేక వన్నె పులులు ఉన్న ఈ సమాజంలో గీత ఎలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది? అన్నదే మిగతా కథ.

సినిమా ప్రారంభంలోనే విరాట పర్వానికి సంబంధించిన సంఘటనను వివరించి అసలు కథలోకి దర్శకుడు తీసుకెళ్ళడం బాగుంది. భారతంలో పాండవులు తమ ఉనికి తెలియకుండా ఉండాలని, మారువేషాలు వేసుకుంటే… ఈ కలియుగంలో మనుషులు మారు వేషాలలో ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నారో చూపించాడు దర్శకుడు. అక్రమార్జన కోసం పిల్లల్ని కిడ్నాప్ చేయడమనేది ఇవాళ ఓ వృత్తిగా మారిపోయింది. దానిలో ఆరితేరిపోయిన ఓ ఫ్యామిలీ స్టోరీనే ఇది. అయితే దీనిని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సమాజంలో ఇన్ ఫ్లుయెన్స్ ఉన్న అక్కకు తెలియకుండా తనకు తానుగా గీత ఏదో సాధించాలని ఆరాటపడటంలోనే అర్థం లేకుండా పోయింది. ఆమెకు ఎదురైన సినిమా కష్టాలను ఏకరవు పెట్టడానికి దర్శకుడు ప్రయత్నించాడు తప్ప ఓ చదువుకున్న మహిళగా ఆమెను గుర్తించలేదు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఒకే పంథాలో కథ సాగడంతో ఎక్కడా రిలీఫ్ అనేది లేకుండా పోయింది. పోనీ కథనం ఐనా ఆసక్తికరంగా ఉందా అంటే అదీ లేదు.

ఇందులో కీలక పాత్రధారి భూమికను ఢిల్లీకి పంపేసి, అనుపమా పరమేశ్వరన్ మీదనే కథను నడిపే ప్రయత్నం చేశారు. కిడ్నాప్ కు సూత్రధారి, పాత్రధారి ఎవరనే విషయం సినిమా చూస్తున్న వ్యూవర్ కు తెలిసిపోతూనే ఉంటుంది. సి.ఎ. చదువుకున్న అనుపమ మాత్రం అమాయకంగా కిడ్నాపర్ చెప్పినట్టు ఓ పప్పెట్ లా ఆడుతుంటే… చూసే వారికి చికాకు పుడుతుంది. ప్రాక్టికల్ గా ఆలోచించకుండా అటూ ఇటూ పరిగిత్తే ఆమెను చూస్తే జాలి కూడా కలగదు. భూమిక, అనుపమా పరమేశ్వరన్ మధ్య బాండింగ్ ను సినిమా ప్రారంభంలో చక్కగానే చూపించారు. ఆ తర్వాత కూడా ఛాన్స్ తీసుకుని మరీ పాటలలో చూపడం కాస్తంత అతిగా అనిపించింది. భూమిక పాత్ర హుందాగా సాగితే, అనుపమా తన సహజ నటన ప్రదర్శించింది. మొన్న వచ్చిన ‘కార్తికేయ -2’, ’18 పేజీస్’కు భిన్నమైన పాత్రను ఆమె ఇందులో చేసింది. కానీ మూవీని తన భుజానకెత్తుకుని తీసుకెళ్ళేంత స్టఫ్ కథలో లేకపోయింది. ఓ నిస్సహాయ మహిళగానే ఆమె పాత్రను దర్శకుడు మలిచాడు. అలా కాకుండా ఆమె తన తెలివి తెలివితేటలతో కిడ్నాపర్స్ డ్రామాకు తెర తీసినట్లు చూపించి ఉంటే… కొంతలో కొంత ఉత్తేజభరితంగా ఉండేది. అనుపమకు జోడీగా నటించిన నిహాల్ నటన ఓకే. రావు రమేశ్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. ఇతర ప్రధాన పాత్రలను ప్రవీణ్‌, రచ్చ రవి, వెన్నెల రామారావు, మేఘన, ప్రభు, కృష్ణతేజ, భవాని చౌదరి తదితరులు పోషించారు.

అనంత శ్రీరామ్ సాహిత్యం అర్థవంతంగా ఉంది. దక్షిణ్ శ్రీనివాస్ మాటలు పాత్రోచితంగా ఉన్నాయి. ఈ చిత్రానికి అర్విజ్, గిడియన్ కట్టా సంగీతం అందించారు. ఓ పాటను అనుపమా పరమేశ్వరన్ చేత పాడించడం విశేషం. సమీర్ రెడ్డి కెమెరా పనితనం చాలా బాగుంది. ఘంటా సతీశ్ బాబు దర్శకత్వంలో రవి ప్రకాశ్, ప్రసాద్, ప్రదీప్ ఈ సినిమాను నిర్మించారు. ఇలాంటి కిడ్నాప్ డ్రామాలు థ్రిల్ అయిన కలిగించాలి లేదా హార్ట్ టచింగ్ గా అయినా ఉండాలి. కానీ ఇందులో ఏదీ లేదు. ఓ రకంగా దీనిని ఓటీటీలో విడుదల చేసి మంచి పని చేశారు. బోర్ కొట్టినప్పుడల్లా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేయొచ్చు!

రేటింగ్ : 2.25 /5

ప్లస్ పాయింట్స్
భూమిక, అనుపమ నటన
సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్
పేలవమైన కథ
ఆసక్తి కలిగించని కథనం
మూవీ రన్ టైమ్!

ట్యాగ్ లైన్: బిట్టర్ ఎక్స్ పీరియన్స్!

Show comments