NTV Telugu Site icon

రివ్యూ: భీమదేవరపల్లి బ్రాంచి

Bheema Devarapalli

Bheema Devarapalli

పొరపాటు మానవ సహజం. ఇక బ్యాంక్ లలో సిబ్బంది చేసిన చిన్న పొరపాటు ఓ పల్లెలోని ప్రజలను ఎలా మార్చిందనే పాయింట్ తో రూపొందిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు అప్పుడప్పుడూ దక్కుతున్న ఆదరణ ఈ తరహా చిత్రాలను రూపొందించటానికి ప్రోత్సహించిందని భావించవచ్చు. అయితే ఈ తరహా చిన్న పాయింట్ తో సినిమా తీయటానికి ముందుకు వచ్చిన నిర్మాతలను, కథను అల్లుకున్న దర్శకుడుని అభినందించాలి. రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించిన ‘భీమదేవరపల్లి బ్రాంచి’ మూవీ శుక్రవారం విడుదలైంది.

భీమదేవరపల్లి తెలంగాణా రాష్ట్రంలోని ఓ చిన్న పల్లె. అక్కడి జనాలు నిరక్షరాస్యులు. కొద్దిగా చదువుకున్న వారు ఏది చెపితే అదే నిజమని నమ్ముతుంటారు. కేంద్ర ప్రభుత్వం జీరో బాలెన్స్ తో బ్యాంక్ ఖాతాలు తెరవమని చెప్పగానే బ్యాంక్ లో ఖాతాలు తెరిసేస్తారు. అంతే కాదు తమ ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు వేస్తుందనే పుకారును ఇట్టే నమ్మేస్తారు. అందుకు తగినట్లే ఆ ఊరిలోని జంపన్న ఖాతాలో పదిహేను లక్షలు జమ అవుతాయి. అంతే జంపన్న నైజం మారిపోతుంది. డాబుసరి పెరిగి ఫోజులకు కొడుతుంటాడు. ఇక జంపన్న ఖాతాలో పడ్డట్లే తమ ఖాతాల్లోనూ లక్షలకు లక్షలు వచ్చిపడతాయనే వెర్రినమ్మకం కలిగించిన గిరికి యాభై వేల లంచం ఇచ్చేస్తారు. అవి ప్రభుత్వం సొమ్ము కాదని, బ్యాంక్ సిబ్బంది చేసిన పొరపాటు అని బయటపడుతుంది. అప్పటికే ఆ డబ్బును తీసి ఖర్చు పెట్టేస్తాడు జంపన్న. ఆ తర్వాత జంపన్నకు ఎదురైన పరిస్థితి ఏమిటీ? ఆశతో మధ్యవర్తికి సొమ్ములు ఇచ్చిన మిగిలిన వారి పరిస్థితి ఏమిటీ? అన్నదే ఈ చిత్రం.

ఉచితంగా డబ్బు దొరికితే మనుషుల మనస్తత్వం ఎలా మారుతుందన్నది ఈ చిత్రంలో జంపన్న పాత్రద్వారా చూపించారు. మోసకారి అని తెలిసి నమ్మి డబ్బులు ఇచ్చే ప్రజలు ఎంత అమాయకులో కూడా దర్శకుడు చక్కగా చూపించాడు. పల్లెలలో మధ్య, దిగువ తరగతి ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుందనే దానిని తెర మీద బాగా ఆవిష్కరించారు. అంతే కాదు ఇందులో ప్రతి పాత్ర తెలంగాణ యాసను చక్కగా పలకటం కథకు అదనపు ఆకర్షణ అయింది. చరణ్ అర్జున్ బాణీలతో రూపొందిన పాటలు కూడా కథానుగుణంగా సాగాయి. సినిమా తొలి భాగం వినోదాత్మకంగా సాగి ద్వితీయార్థం వచ్చే సరికి ఆ టెంపోను కొనసాగించలేక పోయింది. దాంతో ప్రేక్షకులు కొంత నిరాశకు గురయ్యే అవకాశం లేకపోలేదు. ఇక సీబీఐ మాజీ అధికారి జెడీ లక్ష్మీనారాయణ, రాజకీయ నేత అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్స్ పై పెట్టిన బాగా బోర్ కొట్టేసింది. ప్రధాన పాత్రలు పోషించిన సాయి ప్రసన్న, ‘బలగం’ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్, రాజవ్వ, కీర్తిలత, అభిరామ్, రూప శ్రీనివాస్, రాజశేఖర్ అన్నంగి, గడ్డం నవీన్ నటనలో సహజత్వం కనిపించింది. చిన్న పాయింట్ కు ఎంటర్ టైన్ మెంట్ జోడించి, మెసేజ్ అందిచాలని తాపత్రయడ్డాడు దర్శక రచయిత రమేశ్ చెప్పాల. అందులో కొంత వరకూ సక్సెస్ అయ్యాడు కూడా. రొడ్డకొట్టుడు సినిమాలకు భిన్నమైన సినిమాను తీయటానికి ముందుకు వచ్చిన డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లికి అభినందనలు. ఈ తరహా సినిమాలను రిలీజ్ చేయటానికి ముందుకు వచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను కూడా మెచ్చుకోవలసిందే.

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథాంశం
నటీనటుల సహజ నటన
దర్శకుడు చిత్రీకరించిన తీరు

మైనెస్ పాయింట్స్
బోర్ కొట్టే ద్వితీయార్థం
సన్నివేశాల సాగతీత

రేటింగ్ : 2.5/5

ట్యాగ్ లైన్: సందేశాత్మక వినోదం!