Banaras Movie Review: ‘బనారస్’ అనే అనువాద చిత్రం నవంబర్ 4న జనం ముందు నిలచింది. కొత్త హీరో జైద్ తో రూపొందిన ఈ సినిమా ఏకకాలంలో కన్నడ, తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో విడుదలయింది. ఓ కొత్త సినిమాకు ఇంత హంగామానా అన్న అనుమానం రాకపోదు. అయితే కన్నడనాట పేరొందిన రాజకీయ నాయకుడు జమీర్ ఆహ్మద్ కుటుంబం నుండి ఈ జైద్ ఖాన్ వచ్చారు. ఇంతకు ముందు కన్నడలో “ఒలవే మందార, బ్యూటిఫుల్ మనసుగలు, బెల్ బాటమ్” వంటి జనాదరణ పొందిన చిత్రాలు రూపొందించిన జయతీర్థ ఈ ‘బనారస్’ సినిమాకు దర్శకత్వం వహించారు. దాంతో కన్నడ సీమలో ఈ సినిమాకు కాసింత ఊపు వచ్చిన మాట వాస్తవమే!
‘బనారస్’ కథ విషయానికి వస్తే – సిద్ధార్థ్ వచ్చి ధనితో తాను భవిష్యత్ నుండి వచ్చానని, ఫ్యూచర్ లో ఆమెను పెళ్ళాడబోయే భర్తను తానేనని చెబుతాడు. టైమ్ ట్రావెలింగ్ వంటి అంశాలపై ఆసక్తి ఉన్న ధని, నిజమే అని నమ్ముతుంది. ఎప్పుడూ ప్రేమలో పడని ధని, సిద్ధార్థ్ మాటలు నమ్మి తన గదికి తీసుకువెళ్తుంది. అక్కడ ఆమె నిద్రపోతుండగా, సెల్పీ తీసుకుంటాడు సిధ్. అది తన మిత్రులకు పంపిస్తాడు. కట్ చేస్తే పందెంలో తాను గెలిచానని, అన్న మాట ప్రకారం ఫారిన్ కు తీసుకువెళ్ళాలని అంటాడు సిధ్. ఆ అమ్మాయిని పడేయడం అంత ఈజీ కాదు అని సిధ్ ఫ్రెండ్స్ అతనితో పందెం కట్టి ఉంటారు. ఓడిపోయినందుకు సిధ్ ను ఫారిన్ ట్రిప్ తీసుకు వెళ్తారు. అక్కడ ‘టైమ్ ట్రావెల్’ గురించి ఓ మరుగుజ్జు మనిషి సిధ్ బృందంతో చర్చిస్తాడు. పోతూ పోతూ అతనో టాబ్లెట్ ను సిధ్ తాగే పానీయంలో కలుపుతాడు. దాంతో సిధ్ రచ్చ చేస్తాడు. చివరకు హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత కాలేజ్ లో సిధ్ ను అందరూ అసహ్యించుకుంటారు. అందుకు కారణం, ధనితో అతను తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ షేర్ చేయడమే! అందులో వచ్చిన కామెంట్స్ చూసి తట్టుకోలేక ధని తనకున్న బంధువులు బాబాయ్, పిన్ని వద్దకు బనారస్ వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న సిధ్ చలించిపోతాడు. అలా చేసిన మిత్రుడిని చీవాట్లు పెడతాడు. ఓ అమ్మాయిని మోసం చేశానే అనే బాధతో కుమిలిపోతాడు. అతని తండ్రి కొడుకు పరిస్థితి చూసి, వెళ్ళి ఆ అమ్మాయిని కలుసుకొని క్షమాపణ కోరమని సలహా ఇస్తాడు. ధని బనారస్ లో ఉందని తెలుసుకొని పలు పాట్లు పడి చివరకు కలుసుకుంటాడు సిధ్. అక్కడ అతనికి ఓ ఫోటోగ్రాఫర్ సహాయం చేస్తూ ఉంటాడు. అయితే సిధ్ కు తరచూ ఓ కల వస్తూ ఉంటుంది. అందులో ధని, ఆమె బాబాయ్, పిన్ని హత్యకు గురైనట్టు కనిపిస్తుంది. పదే పదే అదే రావడంతో ధనికి, ఆమె బంధువులకు ఏమో అవుతుందని ఆందోళన చెందుతుంటాడు. చివరకు ధని ఉండే ఆమె బాబాయ్, పిన్ని ఇంటికి వెళతాడు సిధ్. అక్కడ విదేశాల్లో కనిపించిన మరుగుజ్జు మనిషి ఉంటాడు. ఆ తరువాత ఏమయింది? నిజంగా టైమ్ ట్రావెల్ సాధ్యమా? చివరకు ధని, సిధ్ ఏమయ్యారు అన్నదే మిగిలిన కథ!
జైద్ ఖాన్ చూడటానికి హిందీ హీరో ఆయుష్మాన్ ఖురానాలా కనిపిస్తాడు. అతనితో దర్శకుడు జయతీర్థ మంచి నటన రాబట్టుకోగలిగారు. కథ ఆరంభంలో ‘టైమ్ ట్రావెల్’ అంటూ భూతభవిషత్ వర్తమాన కాలాల గురించి మాట్లాడటం కాసింత ఆసక్తి కలిగిస్తుంది. తరువాత అంతా మామూలే అన్నట్టు సాగుతుంది. ఇక ద్వితీయార్ధంలో కథ ముందుకు సాగదు. ఒకే సన్నివేశాన్ని మూడుసార్లు మూడు రకాలుగా చూపిస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. నాయిక ధని పాత్రలో సోనాల్ మోంటేరియో పరవాలేదనిపించింది. మిగిలిన పాత్రల్లో తెలుగువారికి సుపరిచితమైనది ఒకే ఒక్క దేవరాజ్. హీరో తండ్రిగా నటించిన అతని పాత్ర పరిధి చాలా తక్కువనే చెప్పాలి. సంగీతం ఆకట్టుకొనేలా సాగినా, అప్పటికే ప్రేక్షకుల సహనం క్షీణించి పోయి ఉంటుంది కాబట్టి అంతగా ఎంజాయ్ చేయలేరు. “కన్ను తెరచినా పాట…” అనేది అలరించేలా రూపొందింది. బనారస్ లోని ప్రదేశాలను మాత్రం దర్శకుడు బాగానే చూపించారు. అందుకు అద్వైత గురుమూర్తి కెమెరా పనితనం కూడా బాగానే పనిచేసిందని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
– బనారస్ లో కథ సాగడం
– మేకింగ్ వేల్యూస్
మైనస్ పాయింట్స్:
– అంతగా ఆకట్టుకోని కథ, కథనం
– నస పెట్టే సన్నివేశాలు
– అలరించలేక పోయిన సంగీతం
రేటింగ్: 2/5
ట్యాగ్ లైన్: నస ‘రేస్’!