NTV Telugu Site icon

Ashtadigbandhanam Review: అష్ట దిగ్భంధనం రివ్యూ

Ashtadigbandhanam

Ashtadigbandhanam

Ashtadigbandhanam Movie Review: టాలీవుడ్‌లో ప్రేక్షకుల టేస్ట్ మారింది. ఒకప్పుడు ఎక్కువగా పెద్ద సినిమాలను ఇష్టపడుతూ వచ్చిన వారు ఇప్పుడు అన్ని రకాల సినిమాలను ఇష్టపడుతున్నారు. ఇక యువ దర్శకుడు బాబా పీ.ఆర్‌ కూడా ఈ సారి ‘అష్ట దిగ్భంధనం’ థ్రిల్లర్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘సైదులు’ సినిమాతో డైరెక్టర్‌గా మారిన బాబా పీ.ఆర్ తెరకెక్కించిన ఈ రెండో సినిమాలో సూర్య భరత్ చంద్ర, విషిక కోట హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్‌ 22న విడుదలైన క్రమంలో ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
ప్రజా సంక్షేమ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాములు అలియాస్‌ రాములన్న రాష్ట్ర రాజకీయాల్లో సత్తా చాటుతూ ఉంటాడు. అతని అనుచరులుగా ఉన్న శంకర్‌, నర్సింగ్‌లలో ఎమ్మెల్యేగా నర్సింగ్‌ పోటీ చేస్తాడని రాములన్న ప్రకటిస్తాడు. అయితే తనకు అవకాశం రాకపోవడంతో శంకర్‌ ఇగో దెబ్బతిని తాను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రాములన్న దృష్టికి తీసుకుపోతే రూ. 50 కోట్లు ఇస్తే ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తానని అంటాడు. శంకర్‌ ఆ డబ్బు కోసం బ్యాంకు దోపిడీ చేయాలనుకుని ఒక ప్లాన్‌ వేస్తాడు. మరి ఆ ప్లాన్‌ వర్కౌట్‌ అయిందా? శంకర్‌ వేసిన స్కెచ్‌లో హీరో హీరోయిన్లు(సూర్య భరత్‌ చంద్ర, విషిక కోట) ఎలా ఇరుక్కున్నారు? అసలు గౌతమ్‌(సూర్య భరత్‌ చంద్ర) నేపథ్యం ఏంటి? ఎలక్షన్‌ ఫండ్‌ రూ. 100 కోట్లను శంకర్‌ ఎందుకు దాచాడు? అసలు ‘అష్టదిగ్భంధనం’ ప్లాన్‌ వేసిందెవరు? అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా? అనేది తెలియాలంటే అష్టదిగ్భంధనం సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ‘యుద్ధం ఎప్పుడూ బలినే కోరుకుంటుంది, ఈ యుద్ధం అహం కోసం, అహంతో మొదలైన యుద్ధం ఆ అహం దేహాన్ని వీడినప్పుడు ముగుస్తుంది’ అని ట్రైలర్‌లో చెప్పిన ఒక్క డైలాగ్‌ తోనే అష్ట దిగ్భందనం కథ ఏంటి? అని క్లారిటీ వచ్చేస్తుంది. ఇక అదే విషయాన్ని సినిమాలో చూపించాడు. ఇలా ఒక వ్యక్తి ఇగో వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? అవి చివరికి అతన్నే ఎలా బలి తీసుకున్నాయి అనే విషయాలను దర్శకుడు బాబా పిఆర్ బాగా ప్రెజెంట్ చేశాడు. ఫస్టాఫ్‌లో కథ సాదా సీదాగా అనిపించినా ఇంటర్వెల్‌ బ్లాక్ లో వచ్చే ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా వరుస ట్విస్టులతో భలే ఇంట్రెస్ట్ పెంచేస్తుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సిల్లీ సన్నివేశాలనిపిస్తే వాటికి సెకండాఫ్‌లో ఆన్సర్‌ ఇచ్చేసి డైరెక్టర్ కొంతవరకు సినిమా మీద ఆసక్తిని పెంచాడు. కొన్ని చోట్ల లాజిక్కులు మిస్‌ అయినా ఓవరాల్‌గా సినిమా బాగానే అనిపిస్తుంది. థ్రిల్లర్‌ జానర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే:
ముందుగా నటీనటుల విషయానికి వస్తే గౌతమ్‌ పాత్రలో నటించిన భరత్‌ చంద్ర యాక్టింగ్‌ బాగుంది. అయితే ఆయన డబ్బింగ్ విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. హీరోయిన్ విషిక మనం ఒకప్పుడు చూసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఏనా అని అనుమానం తెప్పించేలా ఆన్స్ స్క్రీన్ పై గ్లామర్ తో అందరినీ మెస్మరైజ్ చేసనిది. శంకర్‌ పాత్రలో నటించిన వ్యక్తి విలనిజం భలే అనిపించింది. రాములన్న పాత్రలో నటించిన విశ్వేన్దర్ రెడ్డికి కూడా మంచి పాత్ర దొరికినట్టు అయింది. మిలిగిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే ఈ సినిమా పాటలు కొంతవరకు పర్వాలేదు అనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే నార్మల్ గా అనిపించినా కొన్ని ఫ్రేమ్స్ బాగున్నాయి. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.

ఫైనల్లీ: ఇదే సినిమా నోటెడ్ ఆర్టిస్టులతో చేసి ఉంటే లెక్క వేరేలా ఉండేది. థ్రిల్లర్స్ ఇష్టపడేవారు చూడాల్సిన సినిమా ఇది.

Show comments