NTV Telugu Site icon

Buddy Movie Review: బడ్డీ రివ్యూ

Buddy

Buddy

Buddy Movie Review: అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు పదేళ్లు అవుతుంది. అయితే సోదరుడి లాగా తనకు ఇప్పటివరకు ఒకసారి కూడా సరైన హిట్ పడలేదు. మధ్యలో కొన్ని సినిమాలు పరవాలేదు అనిపించుకున్నా కమర్షియల్ సక్సెస్ మాత్రం లేదు. ఆయన కాస్త గ్యాప్ తీసుకుని బడ్డీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన టెడ్డీ అనే సినిమాకి ఇది రీమేక్ అని ముందు నుంచి ప్రచారం జరిగింది. కానీ లేదు అనేక మార్పులు చేర్పులు చేశామని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది. పిల్లలే మెయిన్ టార్గెట్గా తెరకెక్కించబడిన ఈ సినిమా ఆగస్టు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం పదండి.

బడ్డీ కథ ఏమిటంటే:
కెప్టెన్ ఆదిత్య రామ్(అల్లు శిరీష్) పైలట్ ఒక ప్రయివేటు కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. పల్లవి (గాయత్రి భరద్వాజ్) వైజాగ్‌ లో ఏటీసీలో(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్) పని చేసే ఓ అమ్మాయి. పల్లవి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి సరైన సిగ్నల్స్ ఇవ్వడంలో ఆదిత్య హెల్ప్ చేయడంతో ఆమెకు అతని మీద ఆసక్తి ఏర్పడుతుంది. క్రమంగా కలుసుకోకుండా కేవలం ఏటీసీలోని వారి సంభాషణ ప్రేమకు దారి తీస్తుంది. అయితే ప్రేమలో ఉన్నా ఆదిత్యకి పల్లవి పేరు కూడా తెలీదు. ఆమెను ఏటీసీ అనే పిలుస్తుంటాడు. ఇక ఈ క్రమంలోనే ఆదిత్య ఓ టెడ్డీ బేర్ ని పల్లవికి గిఫ్ట్ గా పంపిస్తాడు. ఆదిత్యని నేరుగా కలసి తన ప్రేమని చెప్పడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న పల్లవి ఆదిత్యను నేరుగా కలిసే ప్రయత్నం చేసి కూడా వెనక్కు తగ్గుతుంది. అయితే ఇలా ఎందుకు ఆమె వెనక్కు వచ్చేసింది? మరోపక్క పల్లవిని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసి కోమాలోకి వెళ్ళే విధంగా మత్తు మందు ఇస్తారు. ఈ ప్రమాదంలో పల్లవి శరీరం నుంచి ఆత్మ విడిపోయి టెడ్డీబేర్ లో దూరుతుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగింది ? అసలు పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు ? పల్లవి శరీరంలోకి ఆమె ఆత్మ తిరిగి వచ్చిందా? అసలు వీరు కలిశారా? లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ:
ఈ సినిమాకి స్ఫూర్తి అయిన టెడ్డి సినిమా కథే ఓ హాలీవుడ్ సినిమా ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పుడు మళ్ళీ టెడ్డి కథనే కొన్ని మార్పులు చేర్పులు చేసి బడ్డీగా తీసుకొచ్చారు. చాలా మార్పులు చేశామని సినిమా యూనిట్ చెప్పింది కానీ పైలెట్ సెటప్ ప్రేమ ట్రాక్ తప్పితే మూలకథ, మలుపులు, కథా గమనంలో దాదాపుగా టెడ్డినే గుడ్డిగా ఫాలో అయినట్టనిపించింది. అంతేకాక తెలుగులో కూడా ఈ టెడ్డి అందుబాటులో ఉండడంతో ఆ సినిమా చూసిన ఆడియన్స్ కి బడ్డీ ఓ పాత సినిమా ఎక్స్ పీరియన్స్ ఏ ఇస్తుంది. నేరుగా బడ్డీని చూసిన ఆడియన్స్ కి మాత్రం కథలో సోల్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐడియా పరంగా చూసుకున్నా బడ్డీ కథ కొత్త పాయింట్ ఏమీ కాదు. ‘ఆస్ట్రల్ ప్రొజెక్షన్’బ్యాక్ డ్రాప్లో తెలుగులోనే చాలా సినిమాలు ఈగ, టాక్సీవాలా, ఎందుకంటే ప్రేమంట లాంటివి ఉన్నాయి. బడ్డీ విషయానికి వస్తే పైన చెప్పుకున్న సినిమాల్లో కనిపించిన ఆర్గానిక్ నెస్ మిస్ అయ్యింది. డాక్టర్ గా అజ్మల్ ఎంట్రీతో ఈ కథ ఏమిటి అనేదానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఒక్కడున్నాడు లైన్ కూడా మధ్యలో తగిలినట్టు అనిపిస్తే అది మీ తప్పు కాదు. సినిమాలో కాస్తో కూస్తో అలరించింది ఏంటంటే అది బడ్డీ అనబడే టెడ్డీ బేర్ క్యారెక్టరే. జై బాలయ్య అంటూ భారీ మెషీన్ గన్ను పేల్చే సన్నివేశంతో పాటు అక్కడక్కడా తెలుగు సినిమాలను అనుకరిస్తూ చేసిన కొన్ని పనులు ప్రేక్షకుల్లో కొంచెం హుషారు పుట్టిస్తాయి. అయితే ఓవరాల్ గా చూస్తే సినిమా కొత్తగా ఏమీ లేదు.

నటీనటుల విషయానికి వస్తే ఆదిత్య అనే పాత్రతో అల్లు శిరీష్ ఆకట్టుకున్నాడు. చాలా వరకు ముభావంగా కనిపించే పాత్రలో శిరీష్ కనిపించాడు. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ కు కథలో కీలక పాత్రే దక్కినా కథ పరంగా తనదైన ముద్ర వేయలేక పోయింది. మరో హీరోయిన్ ప్రిషా సింగ్ అందంగా కనిపించింది. విలన్ అజ్మల్ అమీర్ ఫర్వాలేదు అనిపించాడు. ముకేష్ తనకు అలవాటైన పాత్రలకు భిన్నంగా కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఆలీ నవ్వించడానికి ట్రై చేశాడు కానీ ట్రాక్ పండలేదు. ఇక టెక్నీకల్ టీం విషయానికి వస్తే హిప్ హాప్ తమిళ ‘బడ్డీ’తో పెద్దగా ఏమీ చేయలేక పోయాడు. పాటలు ఒక్కటీ గుర్తుండవు. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రపీ సినిమాకి సెట్ అయింది. జ్ఞానవేల్ రాజా నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. శామ్ ఆంటన్ హాలీవుడ్లో.. కోలీవుడ్లో తీసిన కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు అడాప్ట్ చేసే ప్రయత్నం బాగుంది కానీ సఫలమైనదా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. రైటింగ్ కూడా సినిమాకి మైనస్ అయింది.

ఫైనల్లీ : బడ్డీ బుడ్డోళ్లను మాత్రమే కొన్ని చోట్ల అలరిస్తుంది.. పెద్దలను అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తేనే!!

Show comments