NTV Telugu Site icon

Bachhala Malli Review: బచ్చల మల్లి రివ్యూ

Bachhala Malli

Bachhala Malli

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం బచ్చల మల్లి. గతంలో సోలో బతికే సో బెటర్ అనే సినిమా చేసిన సుబ్బు దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కింది. హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండా నిర్మాతగా ఈ సినిమాని రూపొందించారు. హనుమాన్ హీరోయిన్ అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రావు రమేష్, బలగం జయరాం, కన్నడ అచ్యుత్ కుమార్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. గతంలో వరుస కామెడీ సినిమాలు చేస్తూ వచ్చిన అల్లరి నరేష్ నాంది సినిమాతో ట్రాక్ మార్చాడు. ఆ తర్వాత సీరియస్ సబ్జెక్టులు చేస్తూ వస్తున్నాడు. ఇది కూడా అలాంటి ఒక సీరియస్ సబ్జెక్టు కావడంతో సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలు పెంచడంతో సినిమా ఎలా ఉందా అని ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ సినిమా ఎట్టకేలకు నిన్న సాయంత్రం ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులు ఎంత వరకు ఆకట్టుకుందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

బచ్చల మల్లి కథ:
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో జరిగే కథ ఇది. బచ్చల మల్లి(అల్లరి నరేష్) చిన్నప్పటినుంచి బాగా తెలివైనవాడు. పదో తరగతిలో జిల్లా ఫస్ట్ వచ్చిన అతను తండ్రి(బలగం జయరాం) చేసిన ఓ పని కారణంగా అతని మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఒకరోజు కాలేజీలో స్నేహితుడి(వైవా హర్ష) కారణంగా టిసి కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానిలో తోడు మొండితనం కారణంగా చదువు అక్కడితో ఆపేసి ఊరిలో ట్రాక్టర్ డ్రైవర్ అవుతాడు. మూర్ఖత్వం పరిధి దాటిపోయిన వ్యక్తిగా ఊరు మొత్తం అతని మీద ముద్ర వేస్తుంది. అతను కూడా ఏమాత్రం మూర్ఖత్వం విషయంలో వెనక్కి తగ్గకుండా తనకు నచ్చిన పని నచ్చినట్టు చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. అలాంటి మల్లి జీవితంలోకి అనుకోకుండా కావేరి(అమృత) ప్రవేశిస్తుంది. ముందు మల్లి అంటే భయంతో అతన్ని దూరం పెట్టడానికి ప్రయత్నించినా మల్లి మంచితనానికి ప్రేమలో పడుతుంది. కానీ మల్లి వ్యక్తిత్వం కారణంగా వారి పెళ్లికి అడ్డంకులు ఏర్పడతాయి. చివరికి కావేరి, మల్లి పెళ్లి చేసుకున్నారా? చిన్నతనంలో తండ్రికి దూరమైన మల్లి తండ్రికి దగ్గరయ్యాడా? మూర్ఖత్వంతో మల్లి పోగొట్టుకున్నదేంటి ? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
బచ్చల మల్లి అనే తన ఊరిలో ఉన్న ఒక వ్యక్తిని ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథ రాసుకున్నాడు డైరెక్టర్. మూర్ఖత్వం బోర్డర్ దాటిపోయిన ఒక వ్యక్తి జీవితంలో చేయకూడని పొరపాట్లు చేసి తరువాత ఆ పొరపాటు చేయకుండా ఉంటే బావుండు అని పశ్చాత్తాపడే లైన్తో ఈ సినిమా తెరకెక్కించారు. సినిమా ఓపెనింగ్ మళ్లీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు చిన్నతనంలో ఏం జరిగింది ఆ క్యారెక్టర్ ఎందుకు మూర్ఖంగా తయారైంది లాంటి విషయాలను కన్వెన్సింగ్ గా ప్రేక్షకులకు చెప్పారు కానీ ఎక్కడ కొత్తదనం కనిపించదు. నిజానికి ఇది కొత్త కథ కాదు. ముందు ప్రమోషన్స్లో సినిమా యూనిట్ ఏం చెప్పిందో సినిమాలో కూడా మొత్తం అదే ఉంది.. సినిమా ప్రారంభం మంచే మల్లి క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిన దర్శకుడు అందులో సఫలమయ్యాడు. తర్వాత మల్లి మూర్ఖత్వం ఏ స్థాయికి పెరిగింది? ఆ తర్వాత ఒక అమ్మాయి కోసం ఎలా మారాలనుకున్నాడు? అనే విషయాలను ఆసక్తికరంగా చూపించాడు. అయితే తండ్రి మీద విపరీతమైన ద్వేషం తెచ్చుకున్న మల్లి ఒక అమ్మాయి ప్రేమలో సిల్లీగా పడిపోవడం ప్రేక్షకులకు కాస్త లాజిక్ కి అందని అంశం. తన తల్లి మీద కేర్ చూపించింది అని లాజిక్ బానే ఉంది కానీ ఆ కేర్ చూపించడానికంటే ముందే మల్లి ఆమె ప్రేమలో పడతాడు. ఈ ఒక్క విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇక ఆ తర్వాత మల్లి జీవితం ఎలా మారింది అనేది ఊహకు అందేలా ఉన్నా క్లైమాక్స్ మాత్రం కాస్త హార్ట్ టచింగ్ గా ముగించాడు డైరెక్టర్. ఎవరి కోసం? ఎందుకోసం? అని ఆలోచించి మొండితనం, మూర్ఖత్వంతో మన అనుకున్న వారికి దూరమై తర్వాత బాధపడినా ఉపయోగమేమంది? అదే పాయింట్ ను హానేస్ట్ గా చెప్పారు. కొన్ని తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కొన్నిటిని ఏమీ చేసినా సరిదిద్దుకోలేం. అలా సరిదిద్దుకోలేని తప్పులు చేసి బాధపడేకంటే ఏదైనా పని చేసే ముందు బంధాలను దూరం పెట్టే ముందు ఒకటి పది సార్లు ఆలోచింపజేసేలా ఈ సినిమా సాగుతుంది. తమ కోపమే తన శత్రువు అని సుమతీ శతక పద్యంలో అన్నట్టుగా ఈ సినిమాలో హీరోయిన్ ఉంటాడు కానీ ఆ విలన్ కంటే పెద్ద శత్రువు హీరో కోపమే. మూర్ఖత్వం కంచెలు తెంచుకున్న ఓ పల్లెటూరి కుర్రాడి కథ బచ్చల మల్లి. అయితే పూర్తిస్థాయిలో ఎలివేషన్స్, మంచి హై మూమెంట్స్ ఆశించే వారికి ఈ సినిమా ఎక్కదు. అలాగే మన జీవితాల్లో ఎన్నో కష్టాలు చూస్తున్నాం..సినిమా కష్టాలు కూడా చూడాలా అనే వారికి కూడా కనెక్ట్ అయ్యే అంశాలు తక్కువ.

నటీనట్ల విషయానికి వస్తే అల్లరి నరేష్ ఇప్పటికే కోపిష్టి పాత్రలలో కొన్ని సినిమాలు చేశాడు కానీ ఇది ఒక రకంగా మూర్ఖుడి పాత్ర. అల్లరి నరేష్ తన పాత్రకు ఈ సినిమాలో పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. నరేష్ తర్వాత ఆ స్థాయిలో ఎమోషన్స్ పండించే పాత్ర బలగం జయరాం ది. హీరోయిన్ పాత్ర కీలకమే కానీ ఆమె పాత్రకు పెద్దగా నటించే స్కోప్ లేదు కానీ కొన్ని కీలక సన్నివేశాల్లో అదరగొట్టింది. హరితేజ చాలా కాలం తర్వాత ఒక లాంగ్ లెన్త్ రోల్ లో అదరగొట్టింది.. ప్రవీణ్, వైవా హర్ష ఎప్పటిలాగే తమ అనుభవం పండించారు. రావు రమేష్ అచ్యుత్ కుమార్ కూడా తమలైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు.

టెక్నికల్ అంశాల విషయానికి వొస్తే ముందుగా డైరెక్టర్ గురించి చెప్పాలి. కోపం, మూర్ఖత్వంతో ఏమీ సాధించలేమని, పట్టు విడుపులు ఉండాలని మల్లి పాత్రతో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కానీ రొటీన్ కి భిన్నంగా జెప్పే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. అయితే స్క్రీన్ ప్లే మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పీరియాడిక్ సినిమాను చూసిన ఫీలింగ్ కోసం ఊర్లలోకి వెళ్లి షూట్ చేసిన కష్టం స్క్రీన్ మీద కనిపించింది. విశాల్ చంద్రశేఖర్ పాటల కట్టే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు మరింత ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణం విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ ఈ బచ్చల మల్లి ఓ రా అండ్ రస్టిక్ హానెస్ట్ అటెంప్ట్