NTV Telugu Site icon

Masthu Shades Unnai Ra Review: మస్తు షేడ్స్ ఉన్నాయి రా రివ్యూ

Masthu Shades Unnai Ra

Masthu Shades Unnai Ra

Masthu Shades Unnai Ra Movie Review: కమెడియన్లుగా నిలదొక్కుకుని ఇక ఫర్వాలేదు అనుకున్నాక హీరోలుగా మారారు చాలా మంది. అలా మారిన వారిలో నిలదొక్కుకుంది చాలా తక్కువ మంది. ఈ వారం ఇద్దరు కమెడియన్లు హీరోలుగా మారారు. వైవా హర్ష సుందరం మాస్టర్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాగా అభినవ్ గోమఠం కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి రా సినిమాతో హీరోగా మారాడు. ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. మరి అభినవ్ గోమఠం మస్తు షేడ్స్ ఉన్నాయి రా సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ:
చిన్నప్పటి నుంచే పెయింటింగ్ లో మంచి టాలెంట్ సంపాదించిన మనోహర్(అభినవ్ గోమఠం) టెన్త్ క్లాస్ కే చదువు ఆపేసి పెయింటర్ అవుతాడు. తన తండ్రి చనిపోవడంతో అతని కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఎదురయిన క్రమంలో గోడలపై పెయింట్స్ వేసుకొంటూ కుటుంబాన్ని సాకుతూ ఉంటాడు. మరో పక్క అతని స్నేహితుడు రాహుల్(అలీ రెజా) చిన్ననాటి స్నేహితుడు, రిచ్ ఫ్యామిలీలో పుట్టిన రాహుల్ మనోహర్‌ను చూసి అవహేళన చేస్తుంటాడు. అదే సమయంలో మనోహర్ కి పెళ్లి కుదిరినా లైఫ్ లో సెటిల్ కాలేదన్న కారణంతో పెళ్లిపీటలపై నుండి పెళ్లికూతురు లేచిపోతుంది. దీంతో మనోహర్ పెళ్లి ఆగిపోవడంతో ఇక ఆ కసితో మనోహర్ ఫోటోషాప్ నేర్చుకుని ఫ్లెక్సీ డిజైనింగ్ యూనిట్ సొంతగా పెట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. ఈ ప్రయాణంలో అతనికి ఉమాదేవి ( వైశాలి రాజ్) పరిచయం అయి అది ప్రేమగా మారుతుంది. అయితే పదో తరగతి పాస్, అసలు ఫోటోషాప్ అంటే ఏంటో కూడా తెలియదు, చేతిలో ఒక్క రూపాయి కూడా లేని మనోహర్ ఈ ప్రయాణంలో విజయం సాధించాడా? ఈ క్రమంలో రాహుల్ (అలీ రెజా) నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని మనోహర్ ఎలా దాటగలిగాడు, ఉమాదేవి అయినా మనోహర్ కి దక్కిందా? అన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ:
నిజానికి అభినవ్ లాంటి కమెడియన్ హీరోగా సినిమా చేస్తున్నాడు అనగానే కామెడీ ఆశిస్తారు. అందుకు తగ్గట్టుగానే మనోహర్ చిన్నప్పటి ఎపిసోడ్‌తో కథ మంచి కామెడీతో మొదలవుతుంది. ఆ తర్వాత మనోహర్ పెళ్లికి ఒక రోజు ముందు పెళ్లికూతురు మరో వ్యక్తితో లేచిపోవడం చూపడంతో ఒక్కసారిగా ఆసక్తి రేగుతుంది. అయితే ఆ తరువాత పెయింటింగ్ కష్టాలు, బిజినెస్ లోకి దిగి నిరూపించుకోవాలని ఫిక్స్ అవడం లాంటి కొన్ని విషయాలు కొంత రొటీన్‌ అనిపిస్తాయి. ఆయా సీన్స్ లో కొత్తదనం మిస్ అవడంతో వల్ల రెగ్యులర్ సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ కలిగినా ఆశ్చర్యం లేదు. అయితే దర్శకుడు తిరుపతిరావు సెకండాఫ్‌లో తన ప్రతిభను చాటుకునేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. చివరి 20 నిమిషాలు కథలో ఎమోషన్స్, డ్రామా పండటంతో ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూశామని అనుకుంటారు. ఎందుకంటే ఎలాంటి హంగు-ఆర్బాటాలు, హింస, బోల్డ్ కంటెంట్ లేని విధంగా కథ రాసుకుని తెరకెక్కించాడు డైరెక్టర్. దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగుంది కానీ ఒకే పాయింట్‌ తో సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా మొత్తం సింగిల్ పాయింట్‌పైనే సాగడం.. సెంటిమెంట్, ఎమోషన్స్‌ కూడా కొంచెం కనెక్ట్ అవ్వని విధంగా అనిపించడం సినిమాకు మైనస్. స్క్రిప్ట్ పరంగా గుర్తించే లోపాలు ఉన్నప్పటికీ.. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ తో వాటిని పక్కకు నెట్టేశారు. అయితే అంచనాలు లేకుండా సినిమా చూసిన వారికి నచ్చచ్చు.

ఇక ఇప్పటి వరకు కమెడియన్‌గా రాణించిన అభినవ్ ఒక సినిమా మొత్తాన్ని లీడ్ చేసే హీరో బాధ్యతను తన వంతు వరకు పూర్తి స్థాయిలో మెప్పించాడు. మనోహర్ క్యారెక్టర్‌లో అభినవ్ ఒదిగిపోయాడు. కమెడియన్‌గా మాత్రమే కాదు.. సీరియస్‌ పాత్రల్లోనూ అభినవ్‌ తన టాలెంట్ చూపించాడు. ఇక రాహుల్‌గా అలి రెజా కూడా ఆకట్టుకునేలా నటించారు. ఇక ఉమాదేవిగా వైశాలి రాజ్‌ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో స్నేహితుడు శివగా మొయిన్‌, రవి పాత్రకు తమిళ నటుడు నిజల్గళ్ న్యాయం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. టెక్నికల్‌గా కూడా సినిమా ఆకట్టుకునేలా ఉంది. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన పాట బాగా ప్లస్. సినిమాటోగ్రఫీ కూడా చూడడానికి రిచ్‌గా ఉంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్‌ పాయింట్. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా అభినవ్ గోమఠం హీరోగా చేసిన ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయ్‌ రా’ అంచనాలు లేకుండా చూసే వారికి నచ్చొచ్చు.