NTV Telugu Site icon

Aa Ammayi Gurinchi Meeku Cheppali Review : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి! రివ్యూ

Aa Ammayi Gurinchi Meeku Cheppali

Aa Ammayi Gurinchi Meeku Cheppali

 

హీరో సుధీర్ బాబు, డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇంతకు ముందు వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాలలో మొదటిది ప్రేక్షకులను అలరించింది. ‘ఉప్పెన’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతీశెట్టి ఇందులో నాయికగా నటించగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో మహేంద్రబాబు, కిరణ్‌ బళ్ళపల్లి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు.

వరుసగా ఆరు సూపర్ హిట్స్ ఇచ్చిన కమర్షియల్ డైరెక్టర్ నవీన్ (సుధీర్ బాబు) తన నెక్ట్స్ మూవీ ఓ కొత్త అమ్మాయితో తీయాలని అనుకుంటాడు. అదే సమయంలో యాక్సిడెంటల్ గా అతనికో ఫిల్మ్ రీల్ బాక్స్ దొరుకుతుంది. అందులో ఉన్న డాక్టర్ అలేఖ్యను తన సినిమాలో నాయికగా పెట్టుకోవాలని నవీన్ భావిస్తాడు. అయితే అలేఖ్యకే కాదు వాళ్ళ అమ్మానాన్నలకు కూడా సినిమాలంటే గిట్టదు. మరి అలేఖ్యతోనే సినిమా తీయాలనే నిర్ణయానికి వచ్చిన నవీన్ కోరిక నెరవేరిందా? అలేఖ్య కుటుంబానికి సినిమాలంటే, సినిమా వాళ్ళంటే ఎందుకంత ద్వేషం? ఇంతకూ నవీన్ చెప్పాలని అనుకున్న ‘ఆ అమ్మాయి’ ఎవరు? ఆమె గురించి చెప్పే క్రమంలో అతనికి ఎదురైన అనుభవాలు ఏమిటీ? అన్నదే ఈ సినిమా! టైటిల్ లో ఉంది కదా అని ‘ఆ అమ్మాయి గురించి’ చెప్పడం మొదలెడితే కథను లీక్ చేసినట్టే! సో… ఆ ప్రయత్నం చేయదల్చుకోలేదు!!

మనకు సినిమా నేపథ్యంలో ఎన్నో మూవీస్ వచ్చాయి. అందులో కొన్ని విజయం సాధిస్తే, కొన్ని పరాజయం పాలయ్యాయి. సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ ఫస్ట్ కాంబోలో వచ్చిన ‘సమ్మోహనం’ మూవీ కూడా సినిమా నేపథ్య చిత్రమే. ఓ స్టార్ హీరోయిన్ స్టోరీ అది. ఆ సినిమా చక్కని విజయం సాధించడంతో ఈ మూవీ మీద కూడా అంచనాలు పెరిగాయి. ఇది కూడా సినీ నేపథ్య చిత్రం అనేసరికీ ఇందులో కొత్తగా ఏం చూపిస్తారో అనే కుతూహలమూ ఆడియెన్స్ కలిగింది. ‘సమ్మోహనం’కు పూర్తి భిన్నంగా ఈ కథను ఇంద్రగంటి మోహనకృష్ణ రాసుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే… సుధీర్ బాబు పాత్ర కంటే కూడా కీర్తీశెట్టి పాత్రే ఇందులో అత్యంత కీలకం. ‘ఉప్పెన’కు ముందే ఆమె పొటన్షియాలిటీని గుర్తించి, ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేసుకోవడం నిజంగా గ్రేట్! దానికి తగ్గట్టే ఆమె నటించింది కూడా. అయితే ప్రధాన పాత్రలపై బలమైన సన్నివేశాలు రాసుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ… మిగిలిన పాత్రలను సరిగా ప్రెజెంట్ చేయలేదు. దర్శకుడు, అతని స్నేహితుడు పాత్ర మధ్య అనుబంధాన్ని సరిగా చూపలేదు. అలానే దర్శకుడి తల్లిదండ్రుల పాత్రలు, వాటి తీరుతెన్నులు కామెడీ కోసం రాసుకున్నట్టుగా ఉన్నాయి. సహజత్వానికి పెద్ద పీట వేసే ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ మూవీ విషయంలో కాస్తంత అవేగా వెళ్ళారనిపిస్తుంది. నిజానికి ఆయన సినిమాల్లో హీరో ఇండ్రక్షన్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ అరుదు. కానీ ఆ రెండూ ఇందులో ఉన్నాయి. మూవీ మొత్తంలో హార్ట్ టచ్చింగ్ సీన్స్ రెండు మూడు మాత్రమే ఉన్నాయి. వాటి కోసం సినిమా మొత్తాన్ని భరించడం కష్టమే. కమర్షియల్ చిత్రాల్లోని కొన్ని అర్థవంతమైన సంభాషణలు కొందరిపై బలమైన ప్రభావం చూపుతాయని, వాటితో వారు జీవితాన్ని సార్థకం చేసుకుంటారని చూపించే సన్నివేశం హృదయానికి హత్తుకుంటుంది. కానీ మూవీలో కీలకమైన హీరోయిన్ – వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కాన్ ఫ్లిక్ట్ రీజన్ సిల్లీగా ఉంది. మరీ ముఖ్యంగా సెంటిమెంట్ పెద్దంత పండలేదు. చనిపోయిన ఓ యువదర్శకుడి ప్రేరణతో తాను దర్శకుడిగా మారానంటూ నవీన్ చెప్పే పాయింట్ కూడా పెద్దంత కన్వెన్సింగ్ గా లేదు. మొత్తం మీద ఇదంతా హాఫ్ కుక్క్డ్ డిష్ లా అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే… స్టార్ డైరెక్టర్ పాత్రకు సుధీర్ బాబు చక్కని న్యాయం చేకూర్చాడు. ‘ఉప్పెన’ తర్వాత కృతీశెట్టికి మరోసారి నటిగా తన సత్తాను చాటే ఛాన్స్ ఈ మూవీలో వచ్చింది. దానిని ఆమె చక్కగా ఉపయోగించుకుంది. ఆమె తల్లిదండ్రులుగా కళ్యాణీ నటరాజన్, శ్రీకాంత్ అయ్యంగార్ బాగానే చేశారు. సినిమాలో కాస్తంత రిలీఫ్ కలిగించేది ‘వెన్నెల’ కిశోర్ పోషించిన బోస్ పాత్ర మాత్రమే. గోపరాజు రమణ, సతీశ్ సారిపల్లి, విశ్వంత్, వడ్లమాని సాయి శ్రీనివాస్, గోపరాజు విజయ్, అరుణ భిక్షు తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా ఫేమ్ శివానీ జాదవ్ ఐటమ్ సాంగ్ లో నర్తించింది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం బాగానే ఉంది. ట్యూన్స్ ఏమంత చెప్పుకోదగ్గవిగా లేవు. పి. జి. వింద సినిమాటోగ్రఫీ బాగుంది. బట్… తనతో ప్రత్యక్ష సంబంధం గానీ అనుబంధం గానీ లేని ఓ అమ్మాయి గురించి చెప్పాలనుకున్న దర్శకుడి ప్రయత్నం ఫలించలేదనే చెప్పాలి.

రేటింగ్: 2.25/ 5

ప్లస్ పాయింట్స్
సుధీర్ బాబు, కీర్తిశెట్టి నటన
పి.జి. వింద సినిమాటోగ్రఫీ
క్లయిమాక్స్

మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని కథనం
పేలవమైన సన్నివేశాలు
పండని సెంటిమెంట్ సీన్స్

ట్యాగ్ లైన్: చెప్పొద్దు (సస్పెన్స్ పోతుంది!)