మోహన్ లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబోలో వచ్చిన ‘దృశ్యం’ రెండు భాగాలు విశేషంగా అలరించాయి. దాంతో వారి కలయికలో రూపొందిన ‘ట్వల్త్ మేన్’ పై మొదటి నుంచీ సినీ ఫ్యాన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలయింది. మే 20న డిస్నీ హాట్ స్టార్ లో ‘ట్వల్త్ మేన్’ వెలుగు చూసింది.
‘ట్వల్త్ మేన్’ కథ ఏమిటంటే – ఐదుమంది మిత్రులు, తమ భార్యలతో కలసి ఓ హిల్ స్టేషన్ కు ‘బ్యాచ్ లర్ పార్టీ’కి వెళ్తారు. ఆ పదిమందితో పాటు ఓ లేడీ ఫ్రెండ్ కూడా ఉంటుంది. వారందరూ కలసి మొత్తం పదకొండు మంది. వారి మిత్రబృందంలో చివరగా పెళ్ళి చేసుకుంటున్న వ్యక్తి కోసం ఈ ‘బ్యాచ్ లర్ పార్టీ’ ఏర్పాటు చేస్తారు. పైకి ఎంతో అన్యోన్యంగా కనిపించినా, అటు తిరగగానే ఒకరిపై ఒకరు సెటైర్స్ వేసుకొంటూ ఉంటారు. సరదాగా సాగుతున్న వారందరి మధ్యకు ఓ తాగిన వ్యక్తి ప్రవేశిస్తాడు. వారు పదకొండు మంది అయితే, తాను ట్వల్త్ మేన్ అని తనకు తాను డిక్లేర్ చేస్తాడు. అతనిని చూసి అందరూ అసహ్యించుకుంటారు. అక్కడ నుండి వెళ్ళమని చీదరించుకుంటారు. తరువాత మూడ్ మారేటందుకు ఓ గేమ్ ఆడుకోవాలని భావిస్తారు. అప్పుడు మిత్రులు అందరూ తమ మధ్య ఎలాంటి దాపరికాలు లేవని నిరూపించుకోవడానికి ఓ గేమ్ ఆడతారు. మిత్రులు చెప్పే వాస్తవాలు తెలుసుకొని ఒకరికొకరు అవాక్కయిపోతారు. కొందరు మిత్రులు కొట్టుకుంటారు. అన్నేళ్ళ వారి స్నేహం ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో వారిలో ఓ అమ్మాయి మరణిస్తుంది. తాగుబోతుగా పరిచయమైన ఆ వ్యక్తి డివైఎస్పీ చంద్రశేఖర్. ఆయనే ఇన్వెస్టిగేషన్ కు వస్తాడు. ఆ తరువాత ఏమయింది అన్నదే ‘ట్వల్త్ మేన్’ చిత్రకథ.
క్రైమ్ చుట్టూ ఫ్యామిలీ సెంటిమెంట్ ను అల్లి ‘దృశ్యం’ రెండు భాగాలనూ రక్తి కట్టించిన జీతూ జోసెఫ్ ఈ సారి కూడా అదే విధంగా కథను నడపాలని చూశారు. ఇలా పార్టీలకు పోవడం అక్కడ ఎవరో ఒకరు చనిపోవడం అన్న కథలు ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. అందువల్ల ఈ సినిమా చూస్తున్నప్పుడు, మనం చదివిన కథలు, చూసిన సినిమాలు బోలెడు గుర్తుకు వస్తాయి. అందులో సందేహం లేదు. పవోలో గెనవీస్ తెరకెక్కించిన ‘పర్ ఫెక్ట్ స్ట్రేంజర్స్’ అనే ఇటలీ చిత్రం మరింతగా గుర్తుకు వస్తుంది. ఇందులో ఇన్వెస్టిగేషన్ కన్నా గేమ్ షోనే ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా ఇందులోని ట్విస్టులు కూడా పాతగానే అనిపిస్తాయి. ‘దృశ్యం’లోలాగా థ్రిల్ ఫీల్ కాలేము కానీ, సరదాగా చూడవచ్చు. పదకొండు మంది మిత్రుల దగ్గరకు తాగుబోతుగా వచ్చిన పాత్రలో మోహన్ లాల్ తనదైన బాణీ పలికించారు. మిగిలిన వారు సైతం తమకు లభించిన పాత్రలకు న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్:
– మోహన్ లాల్, జీతూ జోసెఫ్ సినిమా కావడం
– సినిమాటోగ్రఫి
మైనస్ పాయింట్స్:
– కథనంలో కొత్తదనం లేకపోవడం
– పలు సన్నివేశాలు పాతగా అనిపించడం
– ట్విస్టుల్లోనూ థ్రిల్ కలగక పోవడం
రేటింగ్: 2.25/ 5
ట్యాగ్ లైన్: అంత ‘దృశ్యం’ లేదు!