Site icon NTV Telugu

Off The Record: వైసీపీ మైండ్ గేమ్ తో అధికార పార్టీకి ఇబ్బందులు.. 4 అసెంబ్లీ సీట్లపై కన్ను..!

Otr Vizag Ysrcp

Otr Vizag Ysrcp

Off The Record: విశాఖ జిల్లాలో టీడీపీ సంస్ధాగతంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం అంటూ ఉంటారు ఆ పార్టీ నేతలు. ఇక్కడ ఓటర్లు మొదటి నుంచి సైకిల్ బ్రాండ్‌కు కనెక్ట్ అయినంతగా ఇతర పార్టీలను ఆదరించడంలేదు. దీనిని బ్రేక్ చేసేందుకు 2014, 2019, 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. ఫ్యాన్ పార్టీ రాష్ట్రం అంతటా ప్రభంజనం సృష్టించినప్పటికి విశాఖ నగర పరిధిలోని కీలకమైన నాలుగు అసెంబ్లీ సీట్లను గెలవలేకపోయింది. 2024నాటికి పరిస్ధితులు పూర్తిగా మారిపోగా జిల్లా మొత్తం కూటమి పార్టీల చేతుల్లోకి వెళ్లిపోయింది.

ఐతే…జనసేన, టీడీపీ, బీజేపీల నుంచి ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నప్పటికీ కేడర్లో అసమ్మతి మొదలైందని తెలుస్తోంది. ఇటీవలి పరిణామాలను బట్టి ఇది అర్ధం అవుతోంది. రాజకీయంగా ఆశించిన స్ధాయిలో గుర్తింపు రాలేదని భావిస్తున్న నేతలను ఆకర్షించడం మొదలెట్టింది వైసీపీ. వివిధ రంగాలలో ఉండి భవిష్యత్ రాజకీయాల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్న వాళ్లకు ప్రతిపక్షమే సరైన వేదికగా కనిపిస్తోందట. మేయర్ పీఠం మార్పు కోసం వైసీపీ కార్పొరేటర్లలో అసమ్మతిని రేపిన టీడీపీ సక్సెస్ అయింది. 26మంది కార్పొరేటర్లు పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఆ స్ధానాలతో పాటు నగర పరిధి పెరుగుతోంది. జీవీఎంసీలో డివిజన్ల సంఖ్య పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. దీంతో నాయకత్వ లోటు కనిపిస్తుండగా వైసీపీలో అయితే భవిష్యత్ ఉంటుందని నమ్మి చేరేవాళ్ళ సంఖ్య పెరుగుతోందని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేందుకు పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తోంది వైసీపీ. ఇటీవలి కాలంలో నియోజకవర్గాల వారీగా ఇంఛార్జుల సమక్షంలో వందల సంఖ్యలో జాయినింగ్స్ ఉంటున్నాయి. ఇంతకాలం పార్టీని వదిలిపోతున్న వాళ్ల పట్ల పెద్దగా పట్టీపట్టనట్టు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు అంతర్గతంగా ఉండేవి. మన బలం కంటే బలహీనత ప్రత్యర్ధికి అస్త్రం అవుతుందనే లాజిక్ మిస్ అవ్వడం ప్రమాదకరమని ద్వితీయ శ్రేణి నాయకత్వం మథన పడుతోందని పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఇటీవల వైసీపీ చేపట్టిన భారీ చేరికలు అనూహ్యంగా వివాదానికి కారణం అయ్యాయట. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా వేదికగా ఈ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని టాక్‌. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు వీఎంఆర్డీఏ ప్రాంగణం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ఆఖరి నిమిషంలో రద్దు చేశారు అధికారులు. ఐతే, ఏర్పాట్లు అన్నీ చేసుకున్న తర్వాత పర్మిషన్ లేదని చెప్పడం ముమ్మాటికీ అధికార పార్టీ కుట్రలో భాగమేనని వైసీపీ ఆందోళనకు దిగింది. స్వయంగా మాజీమంత్రి అమర్నాథ్, ఎమ్మెల్సీ కల్యాణి వంటి వాళ్లు జోక్యం చేసుకోవడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ మరుసటి రోజే దక్షిణ నియోజకవర్గం నుంచి చేరికలు జరిగాయి.

అంతకుముందు…మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాలతో నిర్వహించిన భారీ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయింది. జీవీఎంసీ నుంచి మద్దిలపాలెం వరకు జరిగిన ఈ ప్రదర్శన ద్వారా ప్రతిపక్షం బలమైన సంకేతాలు పంపించింది. ఇలా చేపట్టిన ప్రతీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం విజయవంతం కావడం, చేరికలు పెరుగుతుండటంతో సహజంగానే అధికార పార్టీ వర్గాలను కలవరంలోకి నెట్టేస్తున్నాయట. వాస్తవానికి ఇదంతా తెర ముందు కథ. వైసీపీ వ్యూహాత్మక కార్యాచరణ, జాయినింగ్స్ అంశం మీద టీడీపీ అధినాయకత్వం సీరియస్‌గా స్పందించినట్టు తెలిసింది. కొందరు నేతలకు ఫుల్ క్లాస్‌ తీసుకుందనే ప్రచారం సైతం జరుగుతోంది. హైకమాండ్ సీరియస్నెస్ అర్ధం చేసుకున్న శాసనసభ్యులు అంతా ఉరుకులు పరుగులు మీద అధికారులకు ఫోన్లు కొట్టి చిల్డ్రన్ ఎరీనాలో ఎలాగైన కార్యక్రమం జరక్కుండా చూడాలని కోరినట్టు సమాచారం.

అప్పటికప్పుడు ఎరీనాలోకి వెళ్లకుండా అడ్డుకోగలిగినప్పటికీ రోడ్డుపైనే వెయ్యి మందికిపైగా పార్టీలో చేరడం టీడీపీకి ఇబ్బందికరమైన పరిస్ధితిగా మారిందట. నియోజకవర్గస్ధాయిలో వందల మంది ప్రతిపక్ష పార్టీలో చేరుతుంటే ఎమ్మెల్యేలంతా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించాల్సి వస్తుందో తేల్చాలని జోనల్ ఇంఛార్జులకు నిర్దేశించినట్టు తెలిసింది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఏయే నియోజకవర్గాల నుంచి టీడీపీ కేడర్ వైసీపీ వైపు మొగ్గు చూపుతోంది? ఆ పరిస్ధితికి దారితీస్తున్న పరిణామాలపై అంతర్గతంగా పరిశీలన మొదలైనట్టు సమాచారం. VMRDA వంటి ప్రభుత్వ ప్రాంగణంలో పెద్ద ఎత్తున వైసీపీ చేరికలు చేస్తున్నా ఎమ్మెల్యేలు పసి గట్టలేకపోవడం ముమ్మాటికీ వైఫల్యమే అనే భావన అధికార పార్టీలో ఉందని పొలిటికల్‌ సర్కిల్స్‌లో టాక్‌ నడుస్తోంది.

Exit mobile version