Site icon NTV Telugu

CM YS Jagan : తెలుగు రాకపోతే రిటైర్మెంట్ తీస్కోండి..!

Ys Jagan

Ys Jagan

ఆ మంత్రికి తెలుగు రాదా? ఇంగ్లీష్ మాత్రమే వస్తుందా? అందుకే మీడియా ముందుకు రాలేకపోతున్నారా? తెలుగురాని మంత్రులు కేబినెట్‌లో ఎందుకు.. రిటైర్మెంట్‌ తీసుకోండి అని సీఎం జగన్ ఎవరి గురించి వ్యాఖ్యానించారు? పార్టీ వర్గాల్లో తెలుగురాని ఆ అమాత్యులు హాట్ టాపిక్‌గా మారారా?

కేబినెట్‌ సమావేశంలో సీఎం జగన్‌ మంత్రులకు తీసుకున్న క్లాస్‌పై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు, వారికి మద్దతుగా ఉండే కొన్ని మీడియాల్లో ప్రభుత్వంపై ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్నారనే అంశాన్ని మంత్రివర్గ సమావేశంలో సీఎం ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ సందర్భంగా సీఎం జగన్‌ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలపై ఇప్పుడు పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొంతమంది మంత్రులు సహజంగానే స్పందిస్తారు. స్పందించకుండా .. తమకు సంబంధం లేదు అనుకునే మంత్రులను సీఎంవో, పార్టీ హెడ్‌క్వార్టర్‌ ఎప్పటికిప్పుడు అలర్ట్‌ చేస్తుంటుంది. ఇన్‌పుట్స్‌ ఇచ్చి మీడియా ముందుకు రావాలని చెబుతుంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌ ఇవ్వాలని పార్టీ పెద్దలు, సీఎంవో అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లినా ఆ మంత్రి నాకు తెలుగు రాదు.. ఇంగ్లీష్‌ మాత్రమే వచ్చు.. ఇంగ్లీష్‌లోనే మాట్లాడగలను అని సాకులు చెప్పినట్టు సమాచారం. దాన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం జగన్‌ తెలుగురాని మంత్రులు కేబినెట్‌లో ఎందుకు రిటైర్మెంట్‌ తీసుకోండి అని చురకలు వేశారట.

ఇప్పుడు చర్చంతా తెలుగురాని మంత్రి ఎవరు అనే దానిమీదే జరుగుతోంది. మీడియాకు ముఖం చాటేసిన మంత్రుల జాబితా.. మంత్రి పదవి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు చేసిన విమర్శలు.. ఆరోపణలపై స్పందించకుండా మౌనం వహిస్తున్న మంత్రుల పేర్లు పార్టీ వర్గాల చర్చల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది కొత్త మంత్రులు కాగా.. మరికొంత మంది రెండో దఫా కేబినెట్‌లో కొనసాగుతూ.. శాఖా పరంగా ప్రమోషన్‌ పొందినా సైలెంట్‌ అయిపోయిన వారి పేర్లను లెక్కలు వేస్తున్నారట. వీరిలో తెలుగురాదు అని సాకులు పెట్టే వారెవరు? గతంలో టీడీపీ వంటి పార్టీ నుంచి వచ్చి.. సీరియస్‌గా విమర్శలు చేయకుండా గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తోంది ఎవరు అనే చర్చ నడుస్తోందట.

భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా అతి జాగ్రత్తలు పడుతున్నారా? లేక అధికారం, హోదా ఉంది.. ఇక నాకు బాధ్యతలు ఎందుకు అని తప్పించుకుని తిరుగుతున్నారా అనే విశ్లేషణలు జరుగుతున్నాయి. కేబినెట్‌లో బెర్త్‌ కోసం నానా హడావిడి చేసిన కొందరు.. పదవి రాగానే ఎక్కడాలేని పెద్దరికం చూపిస్తున్నారట. తామేదో ఇలాంటి వాటికి అతీతం అన్నట్టు బిల్డప్‌ ఇచ్చారట. పార్టీ ఆదేశించినా లైట్‌ తీసుకున్నారట. మిగిలిన ఆరోపణల సంగతేమోకానీ.. సీఎం జగన్‌ ఫ్యామిలీ మీద వచ్చిన విమర్శలను తిప్పికొట్టడంలో కూడా సదరు మంత్రులు సేమ్‌ ఫార్ములాను వాడటంతో అధినేతకు మండిందట. అందుకే ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే సీఎం జగన్‌.. కాస్త గట్టిగానే క్లాస్‌ పీకారట. ఇక ఇంగ్లీష్‌ విషయానికి వస్తే రెండోసారి మంత్రి అయ్యి పెద్ద శాఖ కొట్టేసిన ఓ పాత మంత్రి.. వేరే పార్టీ నుంచి వైసీపీలో చేరి.. ఫస్ట్‌ టైమ్‌లోనే గెలిచి.. మంత్రి అయిన మరో మహిళా మంత్రి గురించేననే ప్రచారం జరుగుతోంది. సీఎం వార్నింగ్‌లో మర్నాడే నలుగురైదుగురు మంత్రులు మీడియా ముందుకు క్యూ కట్టారు. మరి.. ఆ ఇంగ్లీస్‌.. వింగ్లీస్‌ మంత్రులను ఏం చేస్తారో చూడాలి. అలాగే రెండు మూడు నెలల్లో వేటుపడే అవకాశం ఉన్న మంత్రుల జాబితాలో వాళ్లు కూడా ఉంటారో లేదో కాలమే చెప్పాలి.

Exit mobile version