Site icon NTV Telugu

బీజేపీ నేతలు గిల్లి.. గట్టిగానే గిల్లించుకున్నారా…?

ఏదో చేయబోయారు.. ఇంకోదో అయ్యింది. వీళ్లను నిలదీయాలనుకున్నారు.. కానీ వాళ్లని నిలదీసే పరిస్థితి తెచ్చారు. ఇంతకీ వీళ్లు చేసింది.. మంచి అయ్యిందా? చెడు చేసిందా? క్రెడిట్ కొట్టేద్దాం అని వాళ్లు అనుకుంటే.. సీన్ రివర్స్ చేసిపెట్టారా? గిల్లి.. గిల్లించుకోవడం అంటే.. ఇదేనంటూ సెటైర్లు పడుతోంది అందుకేనా..?

ఉపఎన్నికల ఫలితాలతో తలబొప్పికట్టి నష్టాన్ని గుర్తించిన కేంద్రం..!

రోజూ అదేపనిగా పెరిగిన పెట్రో ధరలు వంద దాటిపోయాయి. అయినా ఆగలేదు. జనం గగ్గోలుపెట్టినా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదు. దేశవ్యాప్తంగా జరిగిన 29 అసెంబ్లీ, 3 ఎంపీ ఉపఎన్నికల్లో తలబొప్పికట్టిన ఎన్డీఏ మర్నాడే జరిగిన నష్టాన్ని గుర్తించింది. పెట్రోల్, డీజిల్ మీద 5 రూపాయలు, పది రూపాయాల చొప్పున పన్నులు తగ్గించేసింది. త్వరలో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పెట్రోమంట అంటుకోకుండా జాగ్రత్తపడింది. ఎప్పుడైతే కేంద్రం ట్యాక్సులు తగ్గించిందో… బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యాయి. వాటితోపాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తులపై ఉన్న వ్యాట్ లో కొంత మేర తగ్గించాయి.

ఏపీ బీజేపీ అల్టిమేటాలకు.. ప్రకటనలతో వైసీపీ కౌంటర్..!

ఏపీ ఆ అంశం మీద స్పందించలేదు. వ్యతిరేకించలేదు. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ధరలు తగ్గిస్తారా? ధర్నా చేయమంటారా? అంటూ అల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ధర్నాలకు దిగారు. దీంతో ప్రభుత్వానికి ఎక్కడో కాలినట్టుంది. అసలీ పెట్రో ధరల పెంపు కథాకమామీషు ఏంటీ? కేంద్రం వసూలు చేసేది ఎంత, రాష్ట్రాలకు పంచేది ఎంత? అంటూ పేపర్లలో పేద్ద ప్రకటనలు ఇచ్చేసింది. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించలేదన్న భావనతో ఉన్న ప్రజలకు వాస్తవలు చెప్పే పేరుతో ఈ ప్రకటనలు ఇచ్చింది ప్రభుత్వం.

బీజేపీతో అవగాహన లేదని క్లారిటీ ఇచ్చిన వైసీపీ..!

వాస్తవంగా బీజేపీ ధర్నాల వ్యవహారం లేకుంటే ఏపీ ప్రభుత్వానికి ఇలాంటి ప్రకటన ఇచ్చుకునే అవకాశం ఉండేది కాదట. ఎలాగూ వాళ్లే కాలు దువ్వారు కాబట్టి మనమూ దువ్వడంలో తప్పేంలేదనుకుందో ఏమో… కేంద్ర ప్రభుత్వ పెట్రో ధరల పెంపు, వసూలు చేసే పన్నుల చిత్రాన్ని ఆవిష్కరించేసింది. అంతేకాదు… ఆ పార్టీ నేతలు ఈ లెక్కలతోనే మీడియా సమావేశాలు పెట్టేశారు. అప్పటి వరకు బీజేపీతో అవగాహన ఉంది అని పించేలా ఉన్న వైసీపీ.. ఇలా ఒక్కసారి ఎదురు తిరగడంతో కేడర్‌కు ఒక క్లారిటీ ఇచ్చినట్టు అయ్యిందట. అలాగే పెట్రోపై వ్యాట్ ఎందుకు తగ్గించలేదో కూడా జనానికి చెప్పేసుకోడానికి ఏపీ బీజేపీని వాడేసుకుందట.

బీజేపీ నేతల ఆందోళనలతో సీన్‌ రివర్స్‌..!

ఏపీ మొదలుపెట్టిన ఈ రివర్స్ అటాక్‌ను పక్కనే ఉన్న తెలంగాణ కూడా అందిపుచ్చుకుంది. సీఎం కేసీఆర్ ఏకంగా ఏపీ ప్రభుత్వ ప్రకటనను మీడియా సమావేశంలోనే ప్రస్తావించారు. తెలంగాణలో కూడా వ్యాట్ తగ్గించలేదు కనక ఏపీ చేసిన దాన్ని ఆయన కూడా సమర్ధించడంతోపాటు…. మేమూ అంతేనని చెప్పేశారు. వరుసగా ధరలు పెంచేసి.. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను వంద దాటించేసిన కేంద్రం ఎంతో కొంత ధరలు తగ్గించి క్రెడిట్ కొట్టేద్దాం అనుకుంటే.. సొంత పార్టీ నేతలు చేసిన ఆందోళనలతో తెలుగు రాష్ట్రాల్లో సీన్ రివర్స్ అయ్యిందనే భావనలో కేంద్రం ఉందట. గిల్లి గిల్లించుకోవడం అంటే ఇదేనంటూ సోము టీంపై సెటైర్లు వేస్తున్నారు జనం.

Exit mobile version