NTV Telugu Site icon

Vundavall Sridevi : వైసీపీలో వివాదాల ఎమ్మెల్యే శ్రీదేవికి పార్టీ చెక్ పెడుతుందా..?

Sri Devi

Sri Devi

Vundavall Sridevi :

వివాదాల ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అధిష్ఠానం చెక్ పెడుతోందా? అదనపు సమన్వయకర్త నియామకం దేనికి సంకేతం? తాడికొండలో జరిగిన డ్యామేజీను డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో రిపేర్‌ చేయాలని హైకమాండ్‌ చూస్తోందా? గెలుపు గుర్రాల వేట అధిష్ఠానం తాడికొండ నుంచే ప్రారంభించిందా?

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. 2019లో గెలిచిన దగ్గర నుంచి వివాదాలతో వార్తల్లో వ్యక్తిగా మారారు. గెలిచీ గెలవగానే నియోజకవర్గంలో వివాదాలకు.. గ్రూపు రాజకీయాలకు కేంద్ర బిందువయ్యారని ప్రచారం జరుగుతున్నా దానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. దీంతో నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టారు. కనీసం గడప గడపకు కూడా రావద్దు అంటూ శ్రీదేవిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఎమ్మెల్యే నియోజకవర్గానికి దూరం అయ్యారనే ప్రచారం తాడికొండలో ఉంది. పైపెచ్చు పేకాట శిబిరాలు, అక్రమ ఇసుక వ్యవహారాలు, బాపట్ల ఎంపీతో ఉన్న వివాదాలతో ఉండవల్లి శ్రీదేవి వివాదాల ఎమ్మెల్యేగా మార్చేశాయి.

వివాదాలతో సహజంగానే అధిష్ఠానానికి దూరమయ్యారు శ్రీదేవి. తాడికొండలో కొంతమంది వైసీపీ నేతలు అధిష్ఠానం దగ్గరకు వెళ్లి ఎమ్మెల్యేను మార్చాలని.. సమన్వయ కర్తను నియమించాలని డిమాండ్ చేశారు. అధిష్ఠానం కూడా ఇప్పుడు కార్యకర్తల డిమాండ్‌ను నెరవేరుస్తున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను అదనపు సమన్వయకర్తగా తాడికొండ నియోజకవర్గానికి నియమించింది. దీంతో హైకమాండ్‌ శ్రీదేవికి చెక్‌ పెట్టనుందనే ప్రచారం ఊపందుకుంది.

అదనపు సమన్వయకర్తను నియమించిన కొద్దిసేపటికే శ్రీదేవి స్వయంగా రంగంలోకి దిగారు. ఆందోళన చేయడంతోపాటు తన అనుచరులతో కలిసి జిల్లా వైసీపీ ప్రెసిడెంట్‌ సుచరిత ఇంటికికి వెళ్లి ధర్నా చేశారు. అంతటితో ఆగకుండా చోటామోటా నేతలతో అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేసే వరకు శ్రీదేవి అనుచరులు వెళ్లారు. ఈ ఆందోళన వెనక శ్రీదేవి ఉన్నారనే అనుమానాలు తాడికొండలో షికారు చేస్తున్నాయి. శ్రీదేవి అనుచరుల పేరుతో కొంతమంది చేస్తున్న ఆందోళనలు ఆపాలని పార్టీలో సీనియర్లు ఇప్పటికే వార్నింగ్‌ ఇచ్చారట. పార్టీ లైను దాటి మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొంతమంది నేతలకు చెప్పడంతో చోటా నాయకులు డైలమాలో పడ్డట్టుగా తెలుస్తుంది. నియోజకవర్గంలో కార్యకర్తలను, నాయకులను సమన్వయ పరిచేందుకు సీనియర్ నేతను అదనపు సమన్వయకర్తగా నియమిస్తే ఇలా గందరగోళం చేయటం ఏంటని అధిష్ఠానం సీరియస్‌గా ఉందట. అందుకే శ్రీదేవి విషయంలో హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే చర్చ జరుగుతోంది.

జరుగుతున్న చర్చ ప్రకారం వైసీపీలో ఇక శ్రీదేవి ఆట ముగిసినట్టేనని, రాబోయే ఎన్నికల కోసం గెలుపు గుర్రాలను అధిష్టానం ఎంపిక చేసుకుంటుందని, అది తాడికొండ నుంచే ప్రారంభించిందని ప్రచారం జరుగుతుంది. రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడ గెలిచి తీరాలని వైసీపీ పట్టుదలతో ఉంది. కార్యకర్తలతో.. ద్వితీయ శ్రేణి నాయకులతో సరైన సంబంధాలు లేని ఉండవల్లి శ్రీదేవిని కొనసాగిస్తే పార్టీకి నష్టమని వైసిపి పెద్దలు భావించారట. ఆ కారణంగానే ఉండవల్లి శ్రీదేవికి ప్రత్యామ్నాయంగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను సమన్వయకర్తగా నియమించిందనేది పార్టీ నేతలలో జరుగుతున్న చర్చ. డొక్కా 2004, 2009 ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. తర్వాత మళ్లీ వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు శ్రీదేవి వివాదాల స్పీడ్‌కు బ్రేక్‌ వేయడానికే డొక్కాను అదనపు సమన్వయ కర్తను నియమించారా? శ్రీదేవి వన్‌టైమ్‌ ఎమ్మెల్యేగా మిగిలిపోతారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. మరి.. తాడికొండలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.