ఇటీవల జరిగిన ఓ ఘటనతో పొలిటికల్‌గా మైలేజ్ వస్తుందని భావించారు అక్కడి నేతలు. అంతలోనే సీన్ రివర్స్. ఒక వర్గానికే పేరు వస్తోందని.. మరోవర్గం చిటపటలాడుతోంది. ఉన్నంతలో ఏదో లాక్కొస్తున్నారని అభిప్రాయ పడుతున్న అధిష్ఠానానికి కొత్త సమస్య పెద్ద చిక్కే తెచ్చిపెట్టిందట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
చిత్తూరు అసెంబ్లీ పరిధిలో టీడీపీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ నడిపించే నాయకుడు లేరు. 2014లో డీకే ఆదికేశవుల సతీమణి సత్యప్రభ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభకు పోటీ చేసిన ఆమె.. వైసీపీ అభ్యర్థి మిధున్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. రెండేళ్ల క్రితం ఆమె అనారోగ్యంతో చనిపోవడంతో.. చిత్తూరు టీడీపీ ఇంఛార్జ్ పదవి ఖాళీగా ఉండిపోయింది. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరో తెలియకపోయినా.. స్థానికంగా ఉండే నేతలు గట్టిగానే ట్రయిల్స్ వేసుకుంటున్నారు.
మూడేళ్లుగా సమస్యలపై పోరాడిన టీడీపీ నేతలు లేరు. కానీ.. అభ్యర్థి ఎవరంటే మాత్రం అందరూ ముందుకొస్తున్నారు. చిత్తూరులో టీడీపీ తరఫున ఏ కార్యక్రమం చేయాలన్నా మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, పార్టీ నేత పులివర్తి నాని రావాల్సిందే. ఈ మధ్య మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో సాక్ష్యుల కేంద్రంగా నడిచిన రగడలో మరో మాజీ మేయర్ హేమలత చేపట్టిన నిరసన చిత్తూరు టీడీపీలో వేడి పుట్టించింది. చంద్రబాబు, లోకేష్ ఇక్కడి పరిస్థితులను వాకబు చేశారు. నిరసనలో గాయపడిన హేమలతకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు పార్టీ పెద్దలు. అయితే టికెట్ రేసులో ఉన్నామని చెప్పుకొంటున్న హేమలత వర్గం.. కటారి అనుచరులు జరిగిన ఘటనను బాగానే వాడుకునే ప్రయత్నం చేశారట. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లో హేమలతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చర్చ మొదలు పెట్టేశారు.
విషయం తెలిసిన చిత్తూరు టీడీపీలోని ఇతర గ్రూపులు యాక్టివ్ అయ్యాయి. అలకలు.. అసంతృప్తులు.. అసమ్మతుల స్వరాలు శ్రుతిమించాయి. రెండు వర్గాల మధ్య విమర్శల వేడి రాజుకుంది. దీంతో పార్టీకి మైలేజ్ వస్తోందని లెక్కలేస్తున్న తరుణంలో వర్గపోరు పరిస్థితిని మార్చేసిందని కేడర్ వాపోతోందట. మాజీ మంత్రి అమర్నాథరెడ్డి రెండు వర్గాలను పిలిచి క్లాస్ తీసుకున్నట్టు చెబుతున్నారు. వర్గపోరుకు చెక్ పెట్టేందుకు డీకే కుటుంబం నుంచి ఎవరో ఒకరిని ఇంఛార్జ్‌గా చేస్తారని ప్రచారం జోరందుకుంది. మరి.. ఈ చిటపటలు శాంతించేందుకు టీడీపీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.
