NTV Telugu Site icon

Ushashri Charan : వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు ఎక్కడున్నారు ? ఏం చేస్తున్నారు ?

Ycp Annathapur

Ycp Annathapur

ఆ ఇద్దరి నేతల మీద ఆ పార్టీ అధినేత పెద్ద ఆశే పెట్టుకున్నారు. టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టే బాధ్యతను వారిద్దరి మీద పెట్టారు. కానీ.. ఒకరేమో ఇంటిపోరు.. ఇంకొకర్నేమో మిగిలిన వాళ్లు లైట్‌ తీసుకుంటున్నారట. దీంతో మొదట్లో ఉత్సాహంగా ఉరుకులు పరుగులు పెట్టిన ఇద్దరు జిల్లా అధ్యక్షులు ఇప్పుడు ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో అన్నట్టుగా మారిపోయింది.

ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతం. 2019 తర్వాత పూర్తిగా వైసిపి అధిపత్యంలోకి వచ్చింది. ఆ ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే ముందుగా.. పార్టీ చాలా బలపడాల్సి ఉంది. అందుకే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. జిల్లాల పునర్విభజన తర్వాత.. ప్రత్యేక చర్యలు చేపట్టింది పార్టీ. సీనియర్ లీడర్లుగా ఉండి.. మంత్రి పదవి కోల్పోయిన శంకర నారాయణకు శ్రీసత్యాసాయి జిల్లా.. మంత్రి కావాలని ఉవ్విళ్లూరిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డికి అనంతపురం జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఇద్దరు సౌమ్యూలు కావడం.. ఎవరితోనూ విభేదాలు లేకపోవడంతో కొత్త బాధ్యతల్లో బాగా రాణిస్తారని అంతా భావించారు. ఈ రెండు జిల్లాల్లో మొదట్లో కాస్త హడావిడి కనిపించింది. ఆ తర్వాత ఇద్దరు నేతలు సైలెంట్‌ అయిపోయారు.

శంకర నారాయణ విషయానికి వస్తే… ఆయనకు సీఎం జగన్ తొలి క్యాబినెట్లో అనూహ్యంగా మంత్రి పదవి వచ్చింది. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు కలిసి వచ్చింది. మొదట్లో దీనిపై జిల్లాలో మిగిలిన వైసీపీ నేతలు కాస్త మనసు నొచ్చుకున్నా ఆ తర్వాత.. ఎమ్మెల్యేలు కామ్‌ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నా… ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మారలేదు. దీనికి తోడు శంకర నారాయణ ఎవరితోనూ విభేదాలు పెట్టుకోలేదు. కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి పోయిన తర్వాత ఆయన కాస్త మెత్తబడ్డారు. శంకర నారాయణ గతంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో బాగా యాక్టివ్‌గా ఉండేవారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో శంకర నారాయణ పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు చిన్న జిల్లాకు అధ్యక్షుడైనా ఆయన అనుకున్నంత మేర రాణించడం లేదట. దీనికి కారణాలు లేకపోలేదు. ఆయనకు సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు నుంచే వ్యతిరేకత ఉంది. దీనికి తోడు గడపగడపకు కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. కుటుంబ సభ్యులు పెత్తనం వలన వచ్చిన అపవాదును చెరిపేసే పనిలో ఆయన ఉన్నారు. అందుకే నియోజకవర్గం గడప దాటి రావడం లేదట. హిందూపురంతోపాటు పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న విభేదాలపై ఫోకస్‌ పెట్టడం లేదట.

అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి విషయానికి వస్తే… ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి ఆశించారు. అయితే సామాజిక సమీకరణలో భాగంగా పదవి దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తిని గమనించి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్‌. దీనికి సంతృప్తి వ్యక్తం చేసిన కాపు.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ముందు జిల్లాలో భారీ ప్రదర్శన కూడా నిర్వహించారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితం కావడంతో పార్టీ బాధ్యతలను కాపు సమర్థవంతంగా నిర్వహిస్తారని అంతా భావించారు. ఆయనను వ్యతిరేకించేవారు ఎవరూ లేరు. కానీ కాపు రామచంద్ర రెడ్డి కూడా నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అన్ని నియోజకవర్గాలపై ఫోకస్ చేయడం లేదు. కళ్యాణదుర్గంలో పార్టీ విభేదాలు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిపై దృష్టి పెట్టడం లేదట. ఇటీవల భారీ వర్షాల వల్ల రాయదుర్గంలో జరిగిన నష్టాన్ని గుర్తించి.. బాధితులకు నిత్యవసరాలు కొంత నగదు సొంతంగా అందజేశారు.

ఇక ఉమ్మడి జిల్లాకు ఉన్న ఏకైక మంత్రి ఉషశ్రీ చరణ్ పాత్ర కూడా.. ఆమె నియోజకవర్గానికే పరిమితమైంది. మొదట్లో మంత్రి హడావిడి ఎక్కువగా కనిపించింది. పొలిటికల్‌ స్టేట్‌మెంట్లలో సీనియర్లను మించేలా మాట్లాడారు మంత్రి. ఆ తర్వాత మంత్రి సైలెంట్‌ అయ్యారు. జిల్లాలో మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆమెను లైట్‌ తీసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిన ప్రారంభోత్సవాలు జరిగిన మంత్రిని ఆహ్వానించడం లేదట. మరి..ఈ సమస్యను పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.