Site icon NTV Telugu

లగడపాటి ఎంట్రీ వెనుక వ్యూహం ఏంటి ? ఎన్నికల ముందే హడావిడి ఎందుకు ?

Lagadapati

Lagadapati

వసంత కృష్ణప్రసాద్‌తో లగడపాటి ఎందుకు భేటీ అయ్యారు?ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉండగానే పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. ఇదే సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చర్చల్లోకి వచ్చింది. ఆక్టోపస్‌గా పేరొంది.. రాజకీయాల్లో అస్త్ర సన్యాయం చేసిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని నందిగామ నియోజకవర్గంలో పర్యటించారు. వైసీపీకి చెందిన వివిధ స్థాయిల నేతలతోపాటు.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను కూడా కలవడం చర్చగా మారింది. వీరిద్దరూ కాసేపు రాజకీయాలపై మాట్లాడుకున్నట్టు సమాచారం. ఆ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. రాజకీయాలకు, సర్వేలకు దూరంగా ఉంటానని చెప్పిన లగడపాటి మళ్లీ ఎందుకు పొలిటికల్‌ తెర మీదకు వచ్చారు..? ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను ఎందుకు కలిశారనేది రకరకాల ఊహాగానాలకు తెరతీస్తోంది. లగడపాటితో జరిపిన భేటీకి ఎలాంటి ప్రాధాన్యం లేదని వసంత కృష్ణప్రసాద్‌ చెబుతున్నప్పటికీ.. చర్చ ఆగడం లేదు.

ఊరికే రారు మహానుభావులు అన్నట్టు లగడపాటి ఎంట్రీని చూడాలన్నది పొలిటికల్‌ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ. దీని వెనక పెద్ద వ్యూహమే ఉందని అనుమానిస్తున్నారు. లగడపాటి రాజకీయం తెలిసినవాళ్లు.. ఆయన ముందస్తు వ్యూహం లేకుండా మీడియా ముందు ప్రత్యక్షం కాబోరని వాదిస్తున్నారు. ఆయన ఎంట్రీ సర్వేలా కోసమా.. లేక ఏదైనా వ్యూహమా అన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది. అయితే ఆయన ఎవరికి అనుకూలంగా మళ్లీ పొలిటికల్‌ గ్రౌండ్‌లోకి దిగారన్నదే ఆసక్తికరం. ఈ అంశంలో కొంత సస్పెన్స్‌ ఉంది.

సాధారణంగా కుటుంబ వ్యవహారాల్లో నాయకులు కలిసి మాట్లాడుకున్నప్పుడు మీడియా ముందుకు రారు. కానీ.. నందిగామ పర్యటనలో లగడపాటి మీడియా ముందుకు వచ్చారు. బలమైన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఉంటేకానీ.. ఆయన అలా చేబోరన్నది విశ్లేషకుల మాట. వాస్తవానికి లగడపాటి ఎంపీగా ఎంత ఫేమస్‌ అయ్యారో.. తర్వాత సర్వేల ద్వారా అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట్లో ఆయన సర్వేలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నా.. తర్వాత బెడిసి కొట్టాయి. గ్రౌండ్‌ లెవల్లో కాంటాక్ట్స్‌ దెబ్బతినడంతో సర్వేలు ఎన్నికల ఫలితాల అంచనాలను అందుకో లేకపోయాయి. దాంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు స్వచ్ఛందంగా ప్రకటించారు. కానీ.. ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగా.. లగడపాటి ఎంట్రీ ఇవ్వడమే అనుమానాలకు దారితీస్తోంది.

నందిగామ నియోజకవర్గంలో తనకున్న అనుచరులను కలుసుకోవడం ద్వారా లగడపాటి సరికొత్త రాజకీయానికి తెర తీయబోతున్నారా..? అనే ప్రశ్నా ఉంది. నేరుగా రాజకీయాల్లోకి రాకున్నా.. తెరవెనక ఇంకెవరికైనా సహకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. అంతా తూచ్‌ అని లగడపాటి ఎంత చెబుతున్నా.. ఆయన వ్యవహార శైలి తెలిసిన వారు మాత్రం విశ్వసించడం లేదట. ప్రస్తుతం వైసీపీలో ఉన్న పరిచయస్తులను.. స్నేహితులను గేదర్‌ చేస్తున్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో ఆయన భేటీని ఆ కోణంలోనే చూడాలంటున్నారు కూడా. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని తెలిసినా.. అందరికీ అర్థమయ్యేలా కన్పిస్తున్నా.. లేదు లేదు.. కచ్చితంగా గెలుస్తుందని ఢంకా బజాయించి చెప్పిన వారిలో లగడపాటి ముందు వరసలో ఉన్నారు. ఆ తర్వాత మూడేళ్లు అజ్ఞాతవాసంలో గడిపారు. ఇప్పుడు చాపకింద నీరులా వ్యవహారాలు నడుపుతున్నారంటే.. బలమైన కారణం ఉందన్నది కొందరి వాదన. మరి లగడపాటి ఆలోచనలేంటో కాలమే చెప్పాలి.

Watch Here : https://youtu.be/aHHQYXx96lE

Exit mobile version