NTV Telugu Site icon

Bodhan MLA Shakeel :,టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎంఐఎం టెన్షన్ పట్టుకుందా..? కంటిపై కునుకు లేదా..?

Trs Mla 's Mim Tension

Trs Mla 's Mim Tension

ఆ రెండు నియోజకవర్గాల్లోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు MIM టెన్షన్‌ పట్టుకుందట. వచ్చే ఎన్నికల్లో MIM ఆ సీట్లు అడిగితే తమ పరిస్థితి ఏంటని ఒక్కటే ఆందోళన. కంటిపై కునుకు కూడా లేదట. ఇంతకీ మజ్లిస్‌ పార్టీ గురిపెట్టిన ఆ రెండు నియోజకవర్గాలు ఏంటి? టెన్షన్‌ పడుతున్న ఎమ్మెల్యేలు ఎవరు? లెట్స్‌ వాచ్‌..!

హైదరాబాద్‌ పాతబస్తీని రాజకీయంగా అడ్డగా మార్చుకున్న MIM.. ఇప్పుడు నిజామాబాద్‌ జిల్లాపైనా కన్నేసిందట. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో మజ్లిస్‌ పార్టీ ఉందట. నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌లలో పోటీకి సిద్ధంగా ఉండాలని స్థానిక కేడర్‌కు MIM పెద్దల నుంచి సంకేతాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఆ రెండుచోట్లా పార్టీ కార్యక్రమాల జోరు పెంచాలని డిసైడ్‌ అయ్యారట. MIM పోటీ ఎలా ఉన్నా.. టీఆర్ఎస్‌తో ఆ పార్టీకి ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్‌ అర్బన్‌, బోధన ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.

రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. 2004 ఎన్నికల్లో ఇక్కడ MIM అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 13 డివిజన్లలో గెలిస్తే.. MIM 16 చోట్ల పాగా వేసింది. ఇక బోధన్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి ముస్లిం సామాజికవర్గానికి చెందిన షకీల్ ఎమ్మెల్యేగా గెలిచారు. షకీల్‌ గెలుపులో ముస్లిం ఓట్లు కీలకంగా పనిచేశాయని చెబుతారు. ఇక మున్సిపల్‌ ఎన్నికల్లో 38 వార్డులకుగాను 11 చోట్ల MIM గాలిపటం సత్తా చాటింది. ఇలా రెండు నియోజకవర్గాల్లో మజ్లిస్‌ పార్టీ పట్టు సాధించడంతో.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం.

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌లలో టీఆర్ఎస్‌కు సపోర్ట్‌ చేసిందని చెబుతారు. అందుకే అక్కడ టీఆర్ఎస్‌ అభ్యర్థులు ఈజీగా గెలిచారని .. ఇప్పుడు మజ్లిస్‌పార్టీ వైఖరి మార్చుకోవడంతో లెక్కలు మారిపోతాయని చర్చ సాగుతోంది. నిజామాబాద్‌ అర్బన్‌ సీటు కోసం MIMలో డిప్యూటీ మేయర్‌ ఇద్రీస్‌ ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే మీర్‌ మజాజ్‌ అలీ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. బోధన్‌లోనూ గట్టి అభ్యర్థి కోసం వేట మొదలైనట్టు తెలుస్తోంది.

తెలంగాణలో హైదరాబాద్‌ పాత బస్తీకే పరిమితం కాకూడదనే ఆలోచనలో మజ్లిస్‌ పార్టీ నేతలు ఉన్నారు. తమకు అనువైన.. ఈజీగా గెలిచే అసెంబ్లీ నియోజకవర్గాలపై కొంతకాలంగా కసర్తతు చేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాలలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. కొన్నిచోట్ల గెలిచి MIM బలమైన శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే సూత్రం అమలు చేసే పనిలో పడింది. మరి.. ఈ ఆలోచనలకు అధికారపక్షం ఓకే చెబితే.. అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీటు గల్లంతే. మరి ఏం జరుగుతుందో చూడాలి.