NTV Telugu Site icon

TCongress : ఇంచార్జ్ ఎదుటే గొడవపడ్డ రేవంత్ రెడ్డి, యాష్కీ

Tcongress

Tcongress

అసలే వారిద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉంది యవ్వారం. ఛాన్స్‌ దొరకగానే పరస్పరం మాటలతో విరుచుకు పడుతున్నారు. పార్టీ ఇంఛార్జ్‌ ఎదుటే అలా జరగడంతో అంతా బిత్తర పోయారట. నాకెందుకు చెప్పలేదని ఒకరు.. నీకెందుకు చెప్పాలని ఇంకొకరు ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారట. ఈ తాజా గొడవపైనే కాంగ్రెస్‌లో చర్చ. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ ఇద్దరూ కీలక నాయకులే. చేరికల అంశంలో ఇద్దరూ సాదాసీదాగా మాట్లాడుకుంటే సరిపోయేది. కానీ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌ ముందే గొడవ పడ్డారట. హైదరాబాద్ పర్యటనలో మొదటిరోజే కాంగ్రెస్‌ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు ఠాగూర్‌. ఆ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరికలపై ఎక్కువగా చర్చ జరిగింది. ఒకరిద్దరు నేతలు తమకున్న అభ్యంతరాలు లేవనెత్తారు. మధుయాష్కీ.. రేవంత్ రెడ్డి మధ్య చర్చ సీరియస్‌గానే జరిగినట్టు సమాచారం.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని మెట్‌పల్లికి చెందిన ZPTC ఒకరు కాంగ్రెస్‌లో చేరారు. ఆ సమాచారం మధుయాష్కీకి లేదట. నా పార్లమెంట్ నియోజకవర్గంలో చేరికలపై కూడా సమాచారం ఇవ్వరా..? అని అడిగారట యాష్కీ. అక్కడే ఉన్న రేవంత్‌ జోక్యం చేసుకుని.. నిజామాబాద్‌ పార్లమెంట్‌ మీది కాదన్నారట అని ఎదురు ప్రశ్నించారట. అదేంటి అని యాష్కీ కౌంటర్‌ ప్రశ్న వేయడంతో సమావేశం వేడెక్కినట్టు చెబుతున్నారు. నియోజకవర్గాన్ని పట్టించుకోనప్పుడు అది మీ సెగ్మెంట్‌ అని ఎలా అంటారు? బాల్కొడ అనిల్‌, ఒకరిద్దరు నాయకులు కూడా చెప్పారని రేవంత్‌ స్వరం పెంచడంతో హీట్ పెరిగిందట. జడ్పీటీసీ చేరికపై నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లా నాయకులకు చెప్పే చేశామని రేవంత్‌ బదులిచ్చారట.

వాస్తవానికి కాంగ్రెస్‌లో రేవంత్‌, యాష్కీల మధ్య గ్యాప్‌ కొనసాగుతోంది. అది పలు సందర్భాలలో బయట పడింది కూడా. కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదును యాష్కీ పట్టించుకోలేదని రేవంత్ టీమ్‌ ఆరోపిస్తోంది. దానిపై ఠాగూర్‌తో జరిగిన మీటింగ్‌లో ప్రశ్నిస్తే.. తనకేం సంబంధం లేదని.. సభ్యత్వం డబ్బులు కూడా చెల్లించబోనని యాష్కీ చెప్పినట్టుగా రేవంత్‌ ప్రస్తావించారట. ఈ సందర్భంగా తనను రాష్ట్రమంతా పర్యటించాలని రాహుల్ చెప్పారని యాష్కీ వెల్లడించారట. ఇలా ఇద్దరు సీనియర్లు ఇంఛార్జ్‌ ఎదుటే గొడవ పడటం రచ్చ అవుతోంది. పొలిటికల్ అఫైర్స్‌ కమిటీ సమావేశాల్లోనూ సమన్వయ లోపంపై రేవంత్‌, యాష్కీల మధ్య వాగ్వాదం సాధారణంగా మారిపోయింది. తాజా వివాదంలో ఇంఛార్జ్‌ ఠాగూర్‌ జోక్యం చేసుకుని చేరికలపై క్లారిటీ ఇచ్చారట.

నిజామాబాద్‌ను యాష్కీ పట్టించుకోవడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉందట. ఆయన ఎక్కువగా AICC వ్యవహారాల్లోనే తలమునకలై ఉంటారని.. 2019లోనే భువనగిరిలో పోటీ చేద్దామని చూశారని చెబుతారు. భువనగిరిలో ఆఖరి నిమిషంలో చుక్కెదురు కావడంతో తిరిగి నిజామాబాద్‌కు వచ్చారు. ఆ ఎన్నికల్లో సొంతపార్టీ నేతలే దెబ్బతీశారని తరచూ ఆరోపిస్తుంటారు యాష్కీ. ఇప్పుడు చేరికల గొడవ కూడా అదే నియోజకవర్గంతో ముడిపడి ఉండటంతో ఆయన బరస్ట్‌ అయ్యారని సమాచారం.