Polavaram Telugu Desam Party Politics : అక్కడ తెలుగు తమ్ముళ్లది చెరోదారి. రాజకీయంగా పుంజుకునే అవకాశం ఉన్నా క్యాచ్ చేయడం లేదట. నిత్యం ముఠాలు.. గ్రూపులు.. తన్నుకోవడమే. చివరకు వరద సాయం విషయంలోనూ చేతులు ఎత్తేశారని టీడీపీ శిబిరంలో ఒకటే చర్చ. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
పోలవరం. రాజకీయంగానే కాదు గోదావరిపై ప్రాజెక్టు పరంగానూ చర్చల్లో ఉండే నియోజకవర్గం. 2019 ఎన్నికల తర్వాత ఇక్కడ సీన్ మారిపోయింది. వార్ వన్‌సైడ్ అన్నట్టు వైసీపీ పట్టు పెంచుకుంటే.. టీడీపీ నేతలు చెల్లాచెదురు అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా హీటెక్కుతుండటంతో .. ఇన్నాళ్లూ కలుగుల్లో ఉన్న నాయకులు బయటకు వస్తున్నారు. నిన్న మొన్నటి వరకు చప్పుడు చేయని వాళ్లు.. ఇప్పుడు పెత్తనం చేయడానికి చూస్తున్నారు. అధికారపక్షంపై పోరాడటం కంటే.. వాళ్లలో వాళ్లే కొట్టుకోవడం.. గొడవలు పడటం ఎక్కువైంది.
మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బొరగం శ్రీనివాస్‌ల మధ్య అస్సలు పడటం లేదు. దీంతో పోలవరంలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఆ శిబిరంపై వాలిని కాకి.. ఈ శిబిరంపై వాలినా సహించడం లేదట. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇద్దరూ ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సమస్యలు.. రాజకీయ అంశాలపై దృష్టి పెట్టడం లేదట. ఇటీవల భారీ వర్గాలకు గోదావరి ఉప్పొంగి.. పోలవరం పరిధిలోని ముంపు మండలాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. బాధితులను ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినా.. ఆ స్థాయిలో పోలవరం టీడీపీ నేతల్లో చలనం కనిపించ లేదు. బాధితులవైపు కన్నెత్తి కూడా చూడలేదు టీడీపీ నేతలు.
స్థానిక ఎమ్మెల్యే బాలరాజు మరింత పట్టు పెంచుకునేలా అడుగులు వేస్తున్నారు. దానికి ధీటుగా రాజకీయ వ్యూహాలు రచించడంలో పోలవరం టీడీపీ నేతలు విఫలం అయినట్టు తమ్ముళ్లు ఓపెన్‌గానే చెబుతున్నారు. జనాల్లో తిరగడమే మర్చిపోయారట నాయకులు. రెండు వారాలపాటు వరదలతో జనాలు ఇబ్బంది పడితే.. వారికి అండగా ఉండలేదని.. కనీసం బాధితులకు ధైర్యం చెప్పేందుకు కూడా ముందుకు రాలేదని టీడీపీ కేడర్ గుర్రుగా ఉందట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇచ్చారని..ఆ సమయంలో పార్టీ నేతల పర్యటనలతో సందడిగా ఉండేదని పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత నాయకులు పత్తా లేకుండా పోయారు. ఇప్పుడొచ్చి టికెట్‌కోసం కుస్తీ పడుతున్నారు.
ప్రస్తుతం ఏపీలోని నియోజకవర్గాల వారీగా టీడీపీ పరిస్థితిని పార్టీ పెద్దలు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో సర్వేలు పార్టీ ఆఫీసుకు వెళ్లాయి. అందులో పోలవరం కూడా ఉందని టాక్. నియోజకవర్గంలో ఎవరు పనిచేస్తున్నారు? ఎవరు ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు? సమస్యలపై చురుకుగా స్పందిస్తోంది ఎవరు? అనే వివరాలు సేకరించారట. మరి.. వరదల సమయంలో నేతల తీరు కూడా గమనించారా అనేది తమ్ముళ్ల ప్రశ్న. పార్టీ బలోపేతానికి.. జనాల్లో అటెన్షన్ తీసుకొచ్చేందుకు అవకాశాలు వచ్చినా వాటిని క్యాచ్ చేయలేని దుస్థితిలో నేతలు ఉన్నారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి.. పోలవరంలో టీడీపీని సెట్‌రైట్ చేయడానికి అధిష్ఠానం ఏ మంత్రం వేస్తుందో చూడాలి.
