ఆ జనసేన ఎమ్మెల్యే దందాల్లో ఆరితేరి పోయారా? పెద్ద పెద్ద పరిశ్రమల్ని సైతం లోకల్ ట్యాక్స్‌తో వేధిస్తున్నారా? తట్టుకోలేని పారిశ్రామికవేత్తలు డైరెక్ట్‌గా అమరావతిలో ఫిర్యాదు చేశారా? ఎమ్మెల్యే వెనక ఓ పెద్ద ఎంపీ కూడా ఉన్నారన్నది నిజమేనా? ఎవరా వసూల్ రాజా? ఆయనకు మద్దతిస్తున్న ఎంపీ ఎవరు? పారిశ్రామిక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ డెస్టినేషన్ అని ప్రకటించుకుంటోంది ఏపీ ప్రభుత్వం. భూములు, రాయితీలు, సింగిల్ విండో పర్మిషన్లతో బిజీగా ఉంది. ఐతే, ప్రభుత్వ లక్ష్యానికి, ఆలోచనలకు కొందరు ఎమ్మెల్యేలు తూట్లు పొడిచేస్తున్నారని సొంత వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. అసలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బకు ఎక్స్‌పోర్ట్స్ దెబ్బతిని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలను కొందరు శాసనసభ్యులు ఇంకా పీక్కుతింటున్నారని, వాళ్ళకు మామూళ్ళని ఇచ్చుకోవాలా, మాకున్న సమస్యల్ని పరిష్కరించుకోవా అన్నది అర్ధం కావడం లేదంటున్నారు చాలా మంది పారిశ్రామిక వేత్తలు. నేతల బెదిరింపుల వ్యవహారాన్ని కొందరు పారిశ్రామిక వేత్తలు ఇటీవల సీఎం, డిప్యూటీ సీఎం ద్రుష్టికి తీసుకు వెళ్ళారట. ఇరు వర్గాలు అవగాహనకు వచ్చిన ల్యాండ్ వివాదాల్లో సైతం ఎమ్మెల్యేలు ఎంటరైపోతున్నారని, పరిష్కారం పేరుతో సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నట్టు తెలుస్తోంది.దీంతో టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల్లోని బ్లాక్ షీప్స్ కోసం వెదుకుతున్నారట. ఆ ప్రయత్నంలోనే… ఫస్ట్ స్ట్రోక్ యలమంచిలి జనసేన శాసనసభ్యుడు సుందరపు విజయ్‌కుమార్‌కి తగిలింది. తన నియోజకవర్గంలోని పెద్ద పెద్ద పరిశ్రమల్ని ఆయన టార్గెట్ చేస్తున్నారని, నెలవారీ మామూళ్ళ కోసం డిమాండ్ చేస్తుండటంతో… వాళ్ళంతా ప్రభుత్వ పెద్దలకు మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది.
రెండున్నర దశాబ్ధాలుగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఓ పరిశ్రమ యాజమాన్యం ఇటీవల ప్రభుత్వ ముఖ్యుల దగ్గర పెద్ద పంచాయితీనే పెట్టినట్టు తెలిసింది. మీరు విధించే లోకల్ టాక్సులు కట్టే పరిస్ధితిలో ఇప్పుడు మేం లేమని నెత్తీనోరూ కొట్టుకుంటున్నా ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ వినడం లేదని వాళ్ళు కుండబద్ధలు కొట్టేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యే అరాచకాలకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా చూపించినట్టు సమాచారం. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఫ్యాక్ట్ చెక్ చేసుకుని నిర్ధారించుకున్నారట. దీంతో ఎమ్మెల్యే విజయ్ కుమార్ చుట్టూ సొంత పార్టీలోనే ఉచ్చు బిగుస్తోందా….? అన్న డిస్కషన్ మొదలైంది. రాజకీయంగా శాసనసభ్యుడికి ఇది ఎదురు దెబ్బేనని అంటున్నారు. యలమంచిలి నుంచి జనసేన తరపున తొలిసారి శాసన సభలో అడుగుపెట్టిన విజయ్ కుమార్ ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలకు మాత్రం పాతకాపే. టిక్కెట్ వ్యవహారంలో విపరీతమైన పోటీ వున్నప్పటికీ నాగబాబు సహా పార్టీ ముఖ్యులతో వున్న సాన్నిహిత్యం కారణంగా టీడీపీని ఒప్పించగలిగింది జనసేన. పవన్ చరిష్మా, కూటమి ఓట్ బ్యాంక్ తో పీఠం ఎక్కిన ఈ నేతకు మొదటి నుంచి దూకుడు ఎక్కువే. ఒక బహిరంగ వేదికపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణే ఆ మాట చెప్పారు. ఆ వ్యవహారశైలే శాససన సభ్యుణ్ణి ప్రత్యేకంగా నిలిపితే….ఇప్పుడు అదే కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మార్చేసిందనే చర్చ జరుగుతోంది. తాజాగా ఓ భూ వివాదంలో సెటిల్మెంట్ కోసం చేసిన ప్రయత్నం రచ్చరంబోలా అయ్యిందట.
అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో 33ఎకరాల భూమి వుంది. మూడు దశాబ్ధాలుగా రెండు కుటుంబాల మధ్య దానికి సంబంధించి వివాదం నలుగుతోంది. సుమారు 100కోట్ల విలు వైన ఈ ల్యాండ్ ఇష్యూలో ఎమ్మెల్యే ఫింగర్ పెట్టారనే ఫిర్యాదులు పవన్ కల్యాణ్ దాకా వెళ్ళాయట. సెటిల్మెంట్ కోసం డిమాండ్ చేశారని, అ డ్వాన్స్ రూపంలో కొంత సొమ్ము తీసుకుని కాలయాపన చేయడంతో బాధితులు డైరెక్ట్‌గా డిప్యూటీ సీఎంను ఆశ్రయించారనే కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధినేత అంతర్గత విచారణ చేయించగా ఇంకొన్ని కొత్త అంశాలు తెరపైకి వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇంకొందరు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారట. రెవెన్యూ, పోలీసుల యంత్రాంగం సహకారంతోనే ఆయన ఇవన్నీ చేస్తున్నారని చెబుతున్నా… బ్యాక్‌గ్రౌండ్ ఇంకో బలమైన శక్తి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఓ బీజేపీ ఎంపీ అండ చూసుకునే సుందరపు విజయ్కుమార్ అలా చెలరేగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ దందాల సొమ్ములో ఆ బీజేపీ ఎంపీకి కూడా వాటాలు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయకత్వాన్ని టీడీపీ లీడర్స్ అంగీకరించడం లేదు.దీంతో ప్రభుత్వం సైతం తీవ్రంగానే పరిగణి స్తున్నట్టు సమాచారం. ఇక ఎమ్మెల్యే సెట్ రైట్ అయ్యే వరకు ఆయన సిఫార్సులు, ఆదేశాలు పక్కనపెట్టేయాలని మౌఖికంగా అదికారుల్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు నాలుగు రోజులుగా డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కోసం ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నా…అట్నుంచి సానుకూలత రాలేదని తెలుస్తోంది.
