Site icon NTV Telugu

Nalgonda TRS Politics : నల్గొండలో కలిసి సాగిన ఆ.. టీఆర్ఎస్ నేతల మధ్య ఇప్పుడు పొరపొచ్చాలు

Trs

Trs

Nalgonda TRS Politics : ఆయన నోరు తెరిస్తే ఊర మాస్‌. ఆ నోటికి సొంత పార్టీ ప్రజాప్రతినిధులే బెంబేలెత్తిపోతారు. ఇన్నాళ్లూ ఏదో నెట్టుకొచ్చినా.. ఇప్పుడు మాత్రం తిరుగుబాటు ప్రకటించేశారు. అసంతృప్తి.. ఆందోళన.. అసమ్మతి అన్నీ కలగలసి ఒక్కసారిగా బరస్ట్‌ అయ్యారట. అదెక్కడో.. ఎవరిపైనో.. లెట్స్‌ వాచ్‌..!

నల్లగొండ TRSలో సీన్‌ రివర్స్‌. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పేరు చెబితేనే కస్సుమంటున్నారు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు. నల్లగొండ మున్సిపాలిటీ కేంద్రంగా అధికారపార్టీలో ఎమ్మెల్యేపై తిరుగుబాటు రాజకీయంగా కలకలం రేపుతోంది. అసంతృప్తి పతాకస్థాయికి చేరడంతో ఎమ్మెల్యేతో విభేదించేవాళ్లు ఓపెన్‌గానే తమ మనసులో మాటను చెప్పేస్తున్నారు. ఈ సమస్య గులాబీ పెద్దల దృష్టికి వెళ్లినట్టు టాక్‌. ఉన్నట్టుండి నల్లగొండ అధికారపార్టీలో ఎందుకీ పరిస్థితి? కలిసి మెలిసి సాగిన నాయకుల మధ్య ఎక్కడ పొరపచ్చాలు వచ్చాయి? పరస్పరం అనుమానంగా చూసుకుంటూ.. ఎందుకీ చిర్రుబుర్రులు? ఈ ప్రశ్నల చుట్టూనే టీఆర్‌ఎస్‌లో వాడీవేడీ చర్చ నడుస్తోంది.

నల్లగొండలో అభివృద్ధి పనుల విషయంలో టీఆర్ఎస్‌ కౌన్సిలర్లు.. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి మధ్య గ్యాప్‌ వచ్చినట్టు సమాచారం. జరుగుతున్న పనులను సైతం పార్టీ ఖాతాలో వేసుకోలేకపోతున్నామని.. స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు వాపోతున్నారట. కొద్దిరోజులుగా దీనిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అది మున్సిపల్‌ కౌన్సిల్ సమావేశంలో బయటపడింది. మీటింగ్‌ను TRS కౌన్సిలర్లే బహిష్కరించారు. తమలోని అసంతృప్తిని తిరుగుబాటు రూపంలో బయటపెట్టారు నేతలు. అయితే వారిని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి లేదా మున్సిపల్‌ ఛైర్మన్‌ మందడి సైదిరెడ్డి పిలిచి మాట్లాడలేదట. గతంలో ఇదే విషయాన్ని కొందరు కౌన్సిలర్లు ప్రస్తావిస్తే.. ఎమ్మెల్యే తిట్ల దండకం అందుకున్నారట. దాంతో వారంతా భూపాల్‌రెడ్డికి దూరంగా జరిగిన పరిస్థితి.

వార్డుల్లో పనులు చేపట్టాలన్నా.. సమస్యలు పరిష్కరించాలన్నా ఎమ్మెల్యేకే చెప్పుకోవాల్సి వస్తోందన్నది కౌన్సిలర్ల ఆరోపణ. ఒకవేళ చెబుదామన్నా అక్కడ వినేవాళ్లు లేరని.. అలకబూనారు చాలామంది కౌన్సిలర్లు. కాంట్రాక్టు పనులను ఎమ్మెల్యే తన సమీప బంధువులు లేదా విపక్ష పార్టీలలో తనకు అనుకూలంగా ఉన్నవారికి అప్పగిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఇదేంటని గతంలో ప్రశ్నిస్తే.. మీ సంగతి తెలుసు.. మీ బండారం బయట పెడతానని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అదిలించడంతో కంగుతిన్నారట కౌన్సిలర్లు. విపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లతో రహస్య ఒప్పందాలే టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారట. అందుకే ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారని.. ఆయన ఇంటికి కూడా వెళ్లడం మానేశారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ గొడవలకు తోడు ఒకరిద్దరు కౌన్సిలర్లు.. మరికొందరు TRS ముఖ్య నాయకులు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై తామే పోటీ చేస్తున్నామని ప్రజల్లోకి వెళ్తున్నారు. దీంతో కేడర్‌లో మరింత గందరగోళానికి దారితీస్తోందట. మొత్తానికి నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ అసంతృప్తి రానున్న రోజుల్లో మరింతగా బరస్ట్ అవుతుందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయట. ఈలోగానే నల్లగొండ ఎపిసోడ్‌పై పక్కాగా సమాచారం తెప్పించుకున్నారట టీఆర్‌ఎస్‌ పెద్దలు. మరి.. సమస్యకు ఎలాంటి పరిష్కరం సూచిస్తారో కాలమే చెప్పాలి.

 

Exit mobile version