NTV Telugu Site icon

Munugodu Politics : రాజగోపాల్ రెడ్డి స్థానంలో వెంకట్ రెడ్డి బరిలోకి?

Manugodu Congress

Manugodu Congress

Munugodu Politics : మునుగోడు ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్‌ వ్యూహం ఏంటి? అభ్యర్థి విషయంలో ఎలాంటి చర్చ జరుగుతోంది? టికెట్‌ ఆశిస్తున్న నాయకులకు ఛాన్స్‌ ఇస్తారా లేక.. పీసీసీ మరో వ్యూహం రచిస్తోందా? లెట్స్‌ వాచ్‌..!

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో అలజడి రేపుతోంది. ఇదే సమయంలో మునుగోడులో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్‌ ఛాన్స్‌ ఇస్తే పోటీ చేసేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు బలమైన నేత. ఆయన తర్వాత కాంగ్రెస్‌ను లీడ్‌ చేసేది ఎవరు? బరిలో నిలబడితే నెగ్గుకొచ్చేది ఎంతమంది? అధికార టీఆర్ఎస్‌ను గట్టిగా ఢీకొట్టే నాయకులు ఉన్నారా? ప్రస్తుతం ఈ ప్రశ్నల చుట్టూనే మునుగోడులో చర్చ జరుగుతోంది.

మునుగోడులో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఆరుసార్లు గెలిచింది. ఇందులో ఐదుసార్లు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి గెలిచారు. ఇక్కడ సీపీఐకి కూడా బలమైన కేడర్‌ ఉంది. 2014లో టీఆర్ఎస్‌ పాగా వేసింది. ఇక్కడ పొత్తులు.. ఎత్తులు.. రాజకీయ అవగాహనలు చాలా కీలకం. తెలంగాణలో రాజకీయ వాతావరణం మారిపోవడంతో.. ఉపఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తుందా.. టీఆర్ఎస్‌ వ్యూహాలకు విరుగుడు మంత్రం వేయగలదా అని కేడర్‌ ఆలోచించే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కుమార్తె స్రవంతి రేస్‌లో ముందు ఉన్నారు. 2014లోనే ఆమె టికెట్‌ ఆశించినా.. కాంగ్రెస్‌ ఇవ్వలేదు. దాంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆ సమయంలో పొత్తులో భాగంగా సీపీఐకి మునుగోడు సీటు కేటాయించింది కాంగ్రెస్‌. 2018కి వచ్చే సరికి రాజగోపాల్‌రెడ్డి పోటీ చేయడంతో ఆమె సైలెంట్‌ అయ్యారు. ఇప్పుడు మాత్రం తనకు టికెట్‌ ఇవ్వాలని గట్టిగానే కోరుతున్నారు స్రవంతి.

పున్నా కైలాస్‌ నేత అనే విద్యార్థి జేఏసీ నేత కూడా టికెట్‌ ఆశిస్తున్నా.. కాంగ్రెస్‌ ఆలోచనలు మరోలా ఉన్నట్టు తెలుస్తోంది.
ఉప ఎన్నిక జరిగితే.. అది అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా నిలుస్తుంది. బై ఎలక్షన్‌లో తేడా కొడితే మొదటికే మోసం రావొచ్చన్న ఆందోళన ఉందట. అందుకే కాంగ్రెస్‌ నుంచి బలమైన అభ్యర్థిని పోటీ చేయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టికెట్‌ ఆశిస్తున్న వారిలో ఆ స్థాయి నేతలు ఉన్నారా అనే వడపోతలకు దిగే అవకాశం ఉంది. ఒకవేళ వారిలో బలమైన అభ్యర్థి లేకపోతే.. టీఆర్ఎస్‌లో టికెట్ ఆశించి బంగపడే వాళ్లకు గాలం వేయొచ్చని తెలుస్తోంది. వాళ్లు ఎన్నికలను ప్రభావితం చేస్తారని భావిస్తే మాత్రం వెంటనే చేర్చేసుకుని టికెట్‌ ఇస్తారనే వాదన ఉంది.

కాంగ్రెస్‌లో మరో చర్చ జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి అన్న.. ప్రస్తుతం భువనగరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బరిలో దించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఈ దిశగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే పోటీకి వెంకటరెడ్డి ఒప్పుకుంటారో లేదో అనే సందేహాలు ఉన్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకుంటే.. సాధారణ ఎన్నికలకు అది టానిక్‌లా పనిచేస్తుంది. రెండోస్థానంలో నిలిచినా.. ప్రత్యామ్నాయం తామే అనే వాదన వినిపించొచ్చు. తేడా కొట్టిందో కేడర్‌ డీలా పడే ప్రమాదం ఉంది. అందుకే అభ్యర్థి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది కాంగ్రెస్‌.